చిలుక పోయింది.. కనిపెట్టరూ..?

By సుభాష్  Published on  29 Feb 2020 2:45 PM GMT
చిలుక పోయింది.. కనిపెట్టరూ..?

ఎనిమిదో క్లాస్ విద్యార్థి.. ఎంతో ప్రేమగా ఓ చిలుక(Australian cockatiel) ను పెంచుకుంటూ ఉన్నాడు. అది కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించాడు. అతడు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఇలా తన పెంపుడు చిలుక పోయిందని ఫిర్యాదు చేయగా పోలీసులు కనీసం అతడి వైపు కూడా కన్నెత్తి చూడలేదు. చిలుక తప్పిపోవడంపై పోలీసులు కనీసం కంప్లయింట్ తీసుకోలేదని.. కేసు ఫైల్ చేయలేదని అంటున్నాడు ఆ పిల్లాడు.

తాము ఆ చిలుకను వెతకడానికి ప్రయత్నిస్తున్నామని... కానీ కేసును రిజిస్టర్ చేయించలేదని హైదరాబాద్ సంజీవ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.మురళి క్రిషన్ మీడియాకు తెలిపారు. ఆ పిల్లాడు ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉంటున్నాడు. ఏపీజెన్కో లో ఉద్యోగిగా పనిచేసే రామలింగేశ్వర్ రావు ఆ పిల్లాడి తండ్రి.. ఆయన మాట్లాడుతూ గురువారం నాడు ఆ పక్షి ఎగిరిపోయిందని తెలిపారు. సాధారణంగా తాము ఆ పక్షిని ఇంట్లో వదిలేస్తూ ఉంటామని.. కిటికీలు, డోర్లు మూశాక ఆ పక్షి ఇంట్లోనే తిరుగుతూ ఉంటుందని.. గురువారం ఉదయం 9:30 నిమిషాల సమయంలో డోర్ సరిగా మూయకపోవడంతో ఆ పక్షి బయటకు ఎగిరిపోయిందని రామలింగేశ్వర్ రావు తెలిపారు. ఆ పక్షి మనుషులతో బాగా కలిసిపోతుందని.. ఇంట్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటుందని పదినెలల క్రితం నాగార్జున సర్కిల్ లోని ఓ షాప్ నుండి పక్షిని 3000 రూపాయలకు కొనుక్కుని వచ్చామని ఆయన తెలిపారు. ముఖ్యంగా తన కొడుకు చాలా బాగా చూసుకునే వాడని ఆయన అన్నారు. గురువారం నుండి ఆ పక్షి కోసం తాము వెతుకుతూ ఉన్నామని.. శనివారం నాడు పోలీసులను సంప్రదించగా వారు కంప్లయింట్ రిజిస్టర్ చేయించడానికి సంకోచిస్తున్నారని చెప్పారు.

నెహ్రు జూలాజికల్ పార్క్ వెటెరినేరియన్ డాక్టర్ ఎం.ఏ.హకీమ్ మాట్లాడుతూ ఆ పక్షి బయట బ్రతకడం కష్టమేనని అంటున్నారు. ఎందుకంటే ఆ పక్షి పంజరంలో బ్రతికేదని.. అది బయట పరిస్థితులకు అలవాటు పడి బ్రతకడం అన్నది చాలా కష్టమేనని అంటున్నారు. ఇతర పెద్ద పక్షులు దీన్ని చంపి తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు .

Next Story