అది ఇద్దరికి ఉండాల్సిందే.. వాహనదారులపై పోలీసుల కొరడా..!

By Newsmeter.Network  Published on  14 Jan 2020 3:24 AM GMT
అది ఇద్దరికి ఉండాల్సిందే.. వాహనదారులపై పోలీసుల కొరడా..!

హైదరాబాద్‌: మార్గం మధ్యలో బైక్‌ నడుపుతున్నవారిని ఎంతో మంది పాదాచారులు లిఫ్ట్‌ అడుగుతుంటారు. అయితే వారిని బైక్‌ ఎక్కించుకొని పోలీసులకు పట్టుబడితే ఇక అంతే సంగతులు. బైక్‌ నడుపుతున్న వారు హెల్మెట్‌ ధరించినా సరే.. పోలీసులు జరిమానా విధించడం లేదా జైలుకు పంపడం ఖాయం ఎందుకంటారా..? బైక్‌పై వెళ్లే ఇద్దరూ హెల్మెట్‌ ధరించాల్సిందేనంటున్నారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. లేదంటే భారీ జరిమానాలు విధిస్తామని చెబుతున్నారు.

మన దేశంలో ఏటా జరిగే రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 70 శాతం బైక్‌ వెళ్తు హెల్మెట్‌ లేని కారణంగానే మరణిస్తున్నారు. దీంతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో బలమైన గాయలవడం, దివ్యాంగులుగా మారడం వల్ల కుటుంబాలకు భారంగా మారుతున్నారు. ఉద్యోగస్తులే రోడ్డు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారని తాజా గణంకాలు చెబుతున్నాయి. వాహనదారులందరూ ట్రాఫిక్‌ నియమ, నిబంధనలు తప్పకుండా పాటిస్తే ఇలాంటి ప్రమాదాలను చాలా వరకు నివారించవచ్చు. అందరూ తప్పకుండా తమ విధిగా రోడ్డు సేప్టీని పాటించడం వల్ల వేలాది మంది ప్రాణాలను కాపాడినవారం అవుతాము.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మోటర్‌ వెహికల్‌ చట్టంలోనూ ఈ నిబంధనను చేర్చారు. అయితే మన హైదరాబాద్ పోలీసులు మాత్రం మొదట్లో ఈ నిబంధనను పట్టించుకోలేదు. కాగా ఇటీవల నగరంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతు పోతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికి హెల్మెట్‌ తప్పనిసరి అనే నిబంధనను అమలు చేయడంపై దృష్టి పెట్టారు. మన దేశంలో ఇప్పటికే బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో బైక్‌ వెనుక సీటుపై కూర్చునే వారికి హెల్మెట్‌ తప్పనిసరి నిబంధన ఉంది.

బైక్‌ వెళ్తున్న ఇద్దరూ హెల్మెట్‌ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ట్రాఫిక్‌ పోలీసులు అంటున్నారు. కర్నాటక రాష్ట్రంలోనూ ఈ నిబంధన అమలులో ఉంది. తెలంగాణలో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు. మూడు కమిషనరేట్ల పరిధుల్లో బైక్‌ వెళ్తున్న ఇద్దరు హెల్మెట్‌ ధరించాలని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఇక నుండి బైక్‌పై వెళ్తున్న ఇద్దరు హెల్మెట్‌ ధరించకపోతే భారీ జరిమానాలు విధిస్తామని, ఈ-చలాన్‌లు ఇంటికి పంపిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇక్కడ జరిమానా కేవలం బైక్‌ యజమానికే విధించనున్నారు.

Bike riders

గత ఏడు రోజులుగా రాచకొండలో ఈ విధానం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచ హెల్మెట్‌ లేకుండా బైక్‌లు నడిపిన వారిపై దాదాపు 263 కేసులు నమోదు అయ్యాయి. సైబరాబాద్‌ పరిధిలో నేటి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. అయితే తాము కావాలనే జరిమానాలు విధించాలనే ఉద్దేశంతో ఇద్దరికి హెల్మెట్‌ తప్పనిసరి నిబంధనను తీసుకురాలేదని ట్రాఫిక్‌ డీసీసీ దివ్యచరణ్‌రావు అన్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలపై అవగాహన పెంచుకోవాలని డీసీపీ దివ్యచరణ్‌ రావు తెలిపారు.

Next Story