రివ్యూ : 'భీష్మ' - బాగానే నవ్వించాడు !
By రాణి Published on 21 Feb 2020 12:09 PM IST'అ..ఆ' తర్వాత హీరో నితిన్ కెరీర్లో ఆ స్థాయి హిట్ మళ్లీ పడలేదు. ఆయన గత చిత్రాలు 'లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం' మూడు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని 'భీష్మ' సినిమా చేశారు. రష్మిక మందన్న కథానాయకిగా నటించిన సినిమాలోని పాటలు, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. దర్శకుడు వెంకీ కుడుముల చిత్రాన్ని ఆకట్టుకునే రీతిలోనే తెరకెక్కించారనే నమ్మకం రిలీజ్ కి ముందే కలిగింది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
భీష్మ (నితిన్) చిన్నప్పటినుండి గర్ల్ ఫ్రెండ్ కోసం ఆశగా ఎదురుచూస్తుంటాడు. డిగ్రీ కూడా సగంలో ఆపేసి తనకు నచ్చినట్టు లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. ఈ క్రమంలో చైత్ర (రష్మిక)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె వెంట పడుతూ ఆమెను లవ్ లో పడేయడానికి ట్రై చేస్తాడు. మరో పక్క వ్యవసాయ రంగానికి చెందిన “భీష్మ ఆర్గానిక్ కంపెనీ” ద్వారా మంచి చేయాలనుకునే భావనతో ఆ కంపెనీ సీఈఓ భీష్మ (అనంత్ నాగ్) ఉంటాడు. అంతలో కొన్ని ఊహించని పరిణామాల ద్వారా భీష్మ (నితిన్) తనకు ఏ సంబంధం లేని భీష్మ ఆర్గానిక్ కంపెనీ భాద్యతలు చేపడతాడు. అలా చేపట్టాక నితిన్ ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అతను కంపెనీని ఎలా కాపాడాడు ? అసలు కంపెనీతో ఎలాంటి సంబంధం లేని నితిన్ ఎలా సీఈవో అయ్యాడు ? చివరికి నితిన్ రష్మిక ఒక్కటవుతారా ? లేదా ? అనేది మిగతా కథ.
నటీనటులు :
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.19 కోట్లకు పైగానే ప్రీ రిలీజ్ బిజినెస్ అలాగే కర్ణాటక, ఓవర్సీస్, ఇతర ప్రాంతాలతో కలిపి మొత్తం రూ.26 కోట్లు బిజినెస్ చేసి మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రంలో నితిన్ - రష్మీక కెమిస్ట్రీ, వారి యాక్టింగ్, అలాగే వెంకీ దర్శకత్వ పనితనం, కొన్ని లవ్ ఎపిసోడ్లు అండ్ ఆర్గానిక్ కి సంబంధించి ఇచ్చిన మెసేజ్ బాగా ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాలో నితిన్ తన పాత్రకు ప్రాణం పోసాడు. తన మార్క్ నటనతో పాటు లుక్స్ పరంగా కూడా గత తన చిత్రాల్లో కంటే ఈ చిత్రంలో చాలా బాగున్నాడు. ఇక నటన విషయానికి వస్తే బరువైన కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా చేసి ఆకట్టుకున్నాడు. మరియు కామెడీ సన్నివేశాల్లో కామిక్ టైమింగ్ తో కొన్ని సీన్స్ లో హైలెట్ గా నిలిచాడు.
ఇక కథానాయకిగా నటించిన రష్మిక, తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటుగా తన నటనతోనూ బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా కొన్ని ప్రేమ సన్నివేశాల్లో అలాగే కొన్ని ఎమోషనల్ సీన్స్ లోనూ రష్మిక నటన ఆమె పలికించిన హావభావాలు చాల బాగున్నాయి. ప్రత్యేకంగా రష్మిక డాన్స్ సినిమాకి బాగా ప్లస్ అయింది. కీలక రోల్ లో కనిపించిన కేజీఎఫ్ నటుడు కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే విలన్ పాత్రలో కనిపించిన మలయాళ నటుడు కూడా తన నటనతో తనఎక్స్ ప్రెషన్స్ తో..కీలక సన్నివేశాల్ని చాలా బాగా పండించారు. వెన్నెల కిషోర్, రఘుబాబుతోపాటు కమెడియన్స్ గా నటించిన ఇతర నటులు కూడా చాల బాగా నటించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేసారు.
సాంకేతిక విభాగం :
ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు వెంకీ పర్వాలేదు అనిపించాడు. అయితే సినిమాలో అక్కడక్కడా ఎంటర్ టైన్ గా ఉన్నా..కథ సింపుల్ గా ఉండటం, హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్ రెగ్యూలర్ గా ఉండటం, సినిమాలో బలమైన సంఘర్షణ లేకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొదటి భాగం సరదాగా సాగుతూ పర్వాలేదనిపించినప్పటికీ, రెండువ భాగం మాత్రం నెమ్మదిగా సాగుతుంది. దీనికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో కథలో సహజత్వం లోపించింది. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సాగే కీలక సన్నివేశాలు బోర్ గా సాగాయి. వీటికి తోడు హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా అనవసరమైన ఎమోషన్ కి లోబడి.. మరి నాటకీయకంగా సాగుతాయి. పైగా వారి ఎమోషన్ అండ్ పెయిన్ ఇంకా బలంగా ఎలివేట్ చేసే అవకాశం ఉన్నా దర్శకుడు అలా చేయలేకపోయాడు.
ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. సంగీత దర్శకుడు అందించిన పాటలు పర్వాలేదు. అయితే హీరోయిన్ హీరోల మధ్య వచ్చే సన్నివేశాల్లోని నేపధ్య సంగీతం మాత్రం బాగా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
కామెడీ,
మెయిన్ థీమ,
నితిన్ నటన,
నితిన్ - రష్మిక మధ్య కెమిస్ట్రీ,
కొన్ని లవ్ ఎపిసోడ్స్,
మైనస్ పాయింట్స్ :
స్లో సాగే కథనం,
పాత సినిమాల షేడ్స్,
బలహీనంగా సాగే పాత్రలు,
తీర్పు :
ముందుగానే చెప్పుకున్నట్లు దర్శకుడు వెంకీ సింపుల్ కథను తీసుకున్నా మంచి కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగానే ఎంటర్ టైన్ చేశారు. ఇక నితిన్ - రష్మిక తమ నటనతో సినిమాని మరో లెవల్ కి తీసుకు వెళ్లారు. మ్ముఖ్యంగా రష్మిక నటన కూడా చాలా బాగుంది. వారిద్దరీ కెమిస్ట్రీ కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ కామెడీ కూడా సినిమాకి హైలెట్ గా నిలుస్తోంది. మొత్తం మీద రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా యూత్ తో పాటుగా మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చెప్పొచ్చు.
రేటింగ్ : 3/5