రేపు 25 కోట్లమందితో సార్వత్రిక సమ్మె..!

By Newsmeter.Network  Published on  7 Jan 2020 2:47 AM GMT
రేపు 25 కోట్లమందితో సార్వత్రిక సమ్మె..!

ముఖ్యాంశాలు

  • కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన
  • భారత సమ్మెకు పలు సంఘాలు మద్దతు
  • కేంద్ర కార్మిక సంఘాల ప్రకటన

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి 8న దేశవ్యాప్త అఖిల భారత సమ్మెకు పలు సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. వివిధ కార్మిక సంఘాలతో పాటు, బ్యాంకింగ్‌ సంఘాలు, వివిధ రంగాల స్వతంత్ర సమాఖ్యలు, సంఘాలు సైతం సమ్మెకు సిద్ధం అయ్యాయి. ఈ సమ్మెను భారీగా విజయవంతం చేయాలని పోరాట సంఘాలు భావిస్తున్నాయి. సుమారు 25 కోట్ల మంది పాల్గొంటారని పది కేంద్ర కార్మిక సంఘాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. దేశంలోని ఆరు ఉద్యోగ సంఘాలతో పాటుగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, అలాగే సెంట్రల్, కోఆపరేటివ్, రీజినల్ గ్రామీణ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగ సంఘాలు కూడా ఈ సమ్మెలో చేరనున్నాయి. దీంతో అధికారికంగా జనవరి 8న సాధారణ సెలవు దినం కానప్పటికీ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడనుంది. బ్యాంకింగ్ సేవలు, ముఖ్యంగా బ్యాంకు ఏటీఎం సర్వీసులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే, ఆన్‌లైన్ లావాదేవీలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి.

Bharat bandh

జనవరి 2, 2020న తమ డిమాండ్లపై చర్చించేందుకు జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా ఇవ్వడంలో కార్మిక మంత్రిత్వ శాఖ విఫలమైందనీ, దీంతో కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించి హక్కులను రక్షించుకునేందుకు జనవరి 8న అఖిల భారత సమ్మె చేపట్టనున్నామని 10 కేంద్ర కార్మిక సంఘాలు తమ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. పెరిగిన ఫీజులు, విద్య వ్యాపారీకరణకు వ్యతిరేకంగా స్వరం పెంచే ఎజెండాతో 60 మంది విద్యార్థుల సంస్థలు, కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాలు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించాయి.

Bharat Bandh 1

Next Story