తెలంగాణలోని భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. పోలీసులు – మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దేవల గూడెం వద్ద జరిగిన ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు హతం కాగా, మరొకరు పరారైనట్లు తెలుస్తోంది. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ పరిశీలించారు. మావోయిస్టుల ఏరివేత దిశగా తెలంగాణ పోలీసుల ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఈ క్రమంలో భద్రాది కొత్తగూడెం జిల్లాలో ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం తీవ్ర సంచలనంగా మారింది.

కాల్పులు జరుగుతున్న సమయంలో కొందరు మావోయిస్టులు పారిపోయారని, వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, జులై 15న కూడా ఇదే జిల్లాలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. మణుగూరు సబ్‌డివిజన్‌ పరిధిలోని కరకగూడెం, ఆళ్లపల్లి మండలాల సరిహద్దులో ఉన్న అటవీ ప్రాంతంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌ గాయపడగా, పది మంది వరకు మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలిసింది. తాజాగా మరోసారి ఎన్‌కౌంటర్‌ జరగడంతో ఏజన్సీ ప్రాంతం ఉలిక్కపడింది.

మరోవైపు మావోయిస్టు అగ్రనేత గణపతి పోలీసులకు లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయన అనుచరులు, ప్రభుత్వానికి చర్చలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. 74 ఏళ్ల గణపతి గత రెండు సంవత్సరాల క్రితమే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. గణపతికి అనారోగ్యం కారణంగా లొంగిపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గణపతి నిర్ణయంతోనే మరి కొందరు మావోయిస్టులు లొంగిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆదిలాబాద్‌లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టు డైరీ లభ్యమైంది. అందులో మావోయిస్టు డైరీలో కొందరు ప్రముఖ మావోయిస్టుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటన చర్చనీయాంశంగా మారింది

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *