'కా..కా..ఛీ..ఛీ' మమతా కొత్త నినాదం..!

By రాణి  Published on  24 Dec 2019 1:17 PM GMT
కా..కా..ఛీ..ఛీ మమతా కొత్త నినాదం..!

కోల్ కత్తా : సీఏఏ మంచిది కాదు అనే అర్థంలో ‘‘కా.. కా.. ఛీ.. ఛీ..’’ ("CAA, CAA, Chhi Chhi")అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సరికొత్త నినాదం అందుకున్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 10 రోజుల ఆందోళనకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా వరుసగా రెండోరోజు కోల్ కతాలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె..పదే పదే అదే నినాదాన్ని లేవనెత్తారు. మమతా సంధించిన ఈ నినాదాన్ని చూసి పలువురు ముక్కును వేలేసుకున్నారు.

ఆ నినాదాన్ని మమతా అనడమే కాకుండా అక్కడున్న జనసందోహంతో కూడా ఇదే నినాదాన్ని పలికించారు. క్యాబ్, ఎన్ ఆర్సీ లను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తూ..‘‘క్యాబ్, ఎన్నార్సీ.. షేమ్.. షేమ్. బీజేపీ షేమ్.. షేమ్’’ అని నినాదాలు చేశారు. ప్రస్తుతం మమతా చేసిన నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ ఇలా కామెంట్ పెట్టాడు. ‘‘ఆమె ఆందోళనలో నేను కూడా ఉన్నాను. ‘‘ఛీ..ఛీ’’ అంటూ ఆమె నినాదాలతో గొంతుకలిపాను. భలే సరదాగా అనిపించింది..’’

మరోవైపు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎం.కే స్టాలిన్ సోమవారం ర్యాలీ నిర్వహించారు. స్టాలిన్ సహా ర్యాలీలో పాల్గొన్న 8000 మందిపై పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ చేసినందుకే కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. సోమవారం స్టాలిన్ నిర్వహించిన ర్యాలీలో విపక్ష పార్టీల నేతలు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. కొత్త చట్టంపై తమ వ్యతిరేకతను నిరసన రూపంలో తెలిపారు పలు పార్టీల నేతలు.

Next Story