బాక్సైట్ తవ్వకాలు రద్దు చేసిన ఏపి సీఎం వైఎస్‌ జగన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  26 Sep 2019 11:43 AM GMT
బాక్సైట్ తవ్వకాలు రద్దు చేసిన ఏపి సీఎం వైఎస్‌ జగన్

అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ జగన్ విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు. 30ఏళ్ల పాటు బాక్సైట్ తవ్వకాలకు గతంలో ఇచ్చిన అనుమతులను సీఎం జగన్ రద్దు చేశారు. అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్-1,2,3, గాలికొండ, చిత్తమగొండి, రక్తకొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలు రద్దు చేశారు.

విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని రిజర్ట్ ఫారెస్ట్ ప్రాంతంలో అపారమైన బాక్సైట్‌ ఖనిజ సంపద ఉంది. ఖనిజం కోసం కొండలను తవ్వేస్తే తమ జీవనానికి, సాంస్కృతిక వారసత్వానికే కాదు అటవీ, పర్యావరణానికి విఘాతం కలుగుతుందనే భయాందోళనలతో 50 ఏళ్లుగా గిరిజనులు పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో గిరిజనుల పోరాటానికి జగన్ అండగా నిలిచారు. అధికారంలోకి రాగానే బాక్సైట్‌ తవ్వకాల జీవోను పూర్తిగా రద్దు చేసి గిరిజనులకు మేలు చేస్తామని జగన్‌ ప్రజాసంకల్ప యాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడా మాటను నిలుపుకున్నారు.

బాక్సైట్‌ తవ్వకాలకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకమని, గత ప్రభుత్వాలు జారీ చేసిన బాక్సైట్‌ అనుకూల జీవోలన్నీ రద్దు చేస్తున్నామని సీఎం జగన్‌ ఇటీవలే చెప్పారు. బాక్సైట్ తవ్వకాలు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ మనుగడను కాపాడిన సీఎం జగన్ అంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఏన్నో ఏళ్ల తమ పోరాటానికి ఫలితం దక్కిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు.

Next Story