పేద వర్గాలకు వరం ఈ బస్తీ దవాఖానాలు: మంత్రి తలసాని
By సుభాష్
పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల ఆరోగ్య దృష్ట్యా బస్తీ దవాఖానాలు ఎంతగానో ఉపయోగపడతాయని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని చేపల బావి, నాలా బజార్ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానాలో ఆయన బీపీ పరీక్ష చేయించుకున్నారు. నగర వ్యాప్తంగా 45 బస్తీ దవాఖానాలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. పేద ప్రజలకు బస్తీల్లోనే అందుబాటులో దవాఖానాలు ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు.
పేద మధ్య తరగతి వర్గాల ప్రజలకు అన్ని రకాల పరీక్షలతో పాటు వైద్యాన్నిఅందించేందుకు బస్తీ దవాఖానాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు పేదలకు స్థోమత లేకపోవడంతో ఈ ఆస్పత్రులు ఉపయోపడనున్నాయని అన్నారు. పేద ప్రజలకు వైద్యం అందించేందుకు ఆరోగ్య సిబ్బంది తో పాటు ఆశ వర్కర్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజలంతా బస్తీ దవాఖానలోని వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, గ్రేటర్ పరిధిలో మొత్తం 123 దవాఖానాలుండగా, ఇందులో హైదరాబాద్ జిల్లాలో 74, రంగారెడ్డి పరిధిలో 23, మేడ్చల్ పరిధిలో 26 ఉన్నాయి. ప్రతీ రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 46 గంటల వరకూ ఆరోగ్య సేవలు అందుతున్నాయి.