రుచీపచీ మారిన 'బొంగులో చికెన్'

By Newsmeter.Network  Published on  25 Dec 2019 7:53 AM GMT
రుచీపచీ మారిన బొంగులో చికెన్

ముఖ్యాంశాలు

  • బొంగులో చికెన్ ను కమర్షియలైజ్ చేసిన గిరిజనుడు
  • రంపచోడవరం ఏజెన్సీలో బొంగులో చికెన్ ఫేమస్
  • గతంలో దీనికోసం టూరిస్టులు అర్రులు చాచేవాళ్లు
  • హోటళ్లవల్ల పక్కదోవ పట్టిన బొంగులో చికెన్ కాన్సెప్ట్
  • సంప్రదాయ పద్ధతుల్లో వండే చికెన్ తగ్గిపోయిన డిమాండ్
  • కొత్త తరహాలోనే ఇష్టపడుతున్న టూరిస్టులు
  • పూర్తిగా ఉనికిని కోల్పోయిన సంప్రదాయ విధానం

రంపచోడవరం ఏజెన్సీలో బొంగులో చికెన్ చాలా ఫేమస్. ఈ ప్రాంతానికి వచ్చిన మాంసాహారులు ఎవరైనా సరే ఒక్కసారైనా ఈ చికెన్ ని రుచిచూడకుండా వెళ్లరంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. స్థానిక గిరిజనులు చికెన్ ముక్కల్ని, ఇతరత్రా మసాలా పదార్థాలను వెదురు బొంగులో కూరి, కట్టెలతో మంటపెట్టి దానిపై చికెన్ వండే ఈ ప్రక్రియ ఎన్నో తరాలుగా ఈ ప్రాంతంలో కనిపిస్తోంది.

మారేడు మిల్లి నివాసియైన కొండారెడ్డి అమర్ నాథ్ రెడ్డి 2000 సంవత్సరంలో దీన్ని పూర్తి స్థాయిలో కమర్షియలైజ్ చేశాడు. స్థానికంగా మాత్రమే కాక, ఇలా వండిన బొంగులో చికెన్ ని ఇతర ప్రాంతాలకు కూడా సరఫరా చేసే ఏర్పాట్ల ద్వారా విస్తృత స్థాయిలో దీనికి ప్రాచుర్యం కల్పించాడు. అంతవరకూ బాగానే ఉంది. కొన్నేళ్లపాటు ఈ వ్యాపారం మూడుపూలూ ఆరు కాయలుగా నడిచిందికూడా.

కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో దీనికి డిమాండ్ పడిపోయింది. కారణం ఏంటంటే ఈ ఫార్ములాను కాపీ కొట్టేసిన కొన్ని హోటళ్లు తామే సొంతగా బొంగులో చికెన్ ను వండి వడ్డించడం మొదలుపెట్టాయి. అదికూడా ఇబ్బందికలిగించే విషయం ఏమీ కాలేదు. కానీ మార్కెట్ ను పెంచుకోవడంకోసం హోటళ్లు ఇప్పుడు ఆ బొంగులో చికెన్ కి రకరకాల రుచులు, వాసనలను చేర్చి కొత్త రూపులోకి తీసుకొచ్చేశాయి.

దీంతో అసలు బొంగులో చికెన్ కాన్సెప్ట్ అయితే సక్సెస్ అయ్యిందికానీ, స్వచ్ఛమైన, అచ్చమైన గిరిజన పద్ధతుల్లో వండే బొంగులో చికెన్ కి పూర్తిగా డిమాండ్ పడిపోయింది. నిజానికి బొంగులో చికెన్ ని తయారు చేయడానికి గిరిజన పద్ధతుల్లో నూనెల్ని, మసాలాల్ని, ఉప్పును వాడరు. సంప్రదాయ పద్ధతుల్లోనే ప్రకృతి సిద్ధంగా లభించే కొన్ని సుగంధ ద్రవ్యాలను మాత్రం దీనికి కలిపి మంటమీద పెట్టి రోస్ట్ చేస్తారు.

ప్రకృతి సిద్ధమైన పద్ధతిలో

వెదురుబొంగులో ప్యాక్ చేసి పెట్టడంవల్ల పూర్తి స్థాయిలో ఆ చికెన్ ఏమాత్రం నూనెల అవసరం లేకుండానే చక్కగా ఉడుకుతుంది. మరికొంత సేపటి తర్వాత పూర్తి స్థాయిలో రోస్ట్ అవుతుంది. అలా స్వచ్ఛంగా ప్రకృతి సిద్ధమైన పద్ధతిలో మాత్రం తయారయ్యే బొంగులో చికెన్ కి విపరీతమైన ఆదరణ ఇదివరలో కనిపించేది. ఇప్పుడు రకరకాల కొత్త పద్ధతులు పుట్టుకురావడం వల్ల పూర్తి స్థాయిలో కొండారెడ్డి బిజినెస్ దెబ్బతినిపోయింది.

గిరిజిన సంప్రదాయ విధానంలో ఇలా చికెన్ తయారు చేయడానికి తాజా వెదురు బొంగుల్ని మాత్రమే వాడతారు. దాదాపుగా గంటన్నర సేపు నేరుగా మంటపై దాన్ని కాలుస్తారు. కానీ ఇప్పుడు హోటళ్లు అనుసరిస్తున్న అధునాతన పద్ధతుల్లో పది పదిహేను నిమిషాల్లోనే వెదురు బొంగుల్లో ఉన్న చికెన్ ఉడికిపోతుంది. దానికి తోడు వివిధ రకాల మసాలాలు, ఉప్పూ, కారం కూడా తోడవడం, ఇవన్నీ కలిసిన చికెన్ ఆర్డర్ ఇచ్చిన కొద్ది క్షణాల్లోనే కళ్లముందు కనిపించడం మాంసాహార ప్రియులకు ఇష్టంగా మారిపోయింది.

ఈ కారణాలవల్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో గిరిజన సంప్రదాయ పద్ధతిలో వండే బొంగులో చికెన్ కి పూర్తిగా డిమాండ్ పడిపోయింది. తన స్వార్థంకోసం ఈ విధానాన్ని కమర్షియలైజ్ చేయడంవల్ల ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో గిరిజనపద్ధతుల్లో వండే బొంగులో చికెన్ ప్రాధ్యాన్యత, స్వచ్ఛత కనుమరుగైపోయాయని దీన్ని కమర్షియలైజ్ చేసిన కొండారెడ్డి వాపోతున్నాడు. ఇకపై ఈ ఏజెన్సీ ప్రాంతంలోకూడా స్వచ్ఛమైన, అచ్చమైన బొంగులో చికెన్ గురించిన ప్రస్తావనే కనిపించేలా లేదన్న బాధను వ్యక్తం చేస్తున్నాడు.

Next Story