నిన్న బాహుబ‌లి, సాహో.. నేడు సైరా.. బాలీవుడ్ ని షాక్ చేస్తోన్న టాలీవుడ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  2 Oct 2019 10:41 AM GMT
నిన్న బాహుబ‌లి, సాహో.. నేడు సైరా.. బాలీవుడ్ ని షాక్ చేస్తోన్న టాలీవుడ్..!

టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ లో సినిమాలు చేయ‌డం... అక్క‌డ త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోవ‌డం అనేది నాటి నుంచి జ‌రుగుతూనే ఉంది. మెగాస్టార్ చిరంజీవి త‌న సినిమాల‌ను హిందీలో డ‌బ్ చేయ‌డం ద్వారా అక్క‌డ వాళ్ల‌కు ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆత‌ర్వాత చిరు డైరెక్ట్ గా హిందీలో సినిమాల్లో న‌టించారు. సూపర్‌ హిట్టైన తమిళ సినిమా జెంటిల్మన్‌ రీమేక్‌ లోనూ, తెలుగులో సూపర్‌ హిట్ మూవీ అంకుశం హిందీ రీమేక్‌లోనూ చిరంజీవి నటించారు కానీ... హిందీలో చిరంజీవికి సరైన హిట్టు లేదు. దీంతో చిరు హిందీ సినిమాల ప్ర‌యాణం కొన్ని సినిమాల‌కే ప‌రిమితం అయ్యింది.

హిందీలో ఎక్కువ సినిమాల్లో న‌టించిన టాలీవుడ్ హీరో అంటే నాగార్జునే. శివ రీమేక్‌తో బాలీవుడ్‌ ప్రయాణం మొదలుపెట్టిన నాగార్జున ఆ తర్వాత అమితాబ్ తో క‌లిసి ఖుదాగ‌వా, అనిల్ క‌ఫూర్ తో క‌లిసి మిస్ట‌ర్ బేచారా, అక్ష‌య్ కుమార్ తో క‌లిసి అంగారే..త‌దిత‌ర చిత్రాల్లో న‌టించారు. ప్ర‌స్తుతం కూడా బ్ర‌హ్మాస్త్ర అనే భారీ సినిమాలో కూడా నాగార్జున న‌టిస్తున్నారు. అయితే.. హిందీ సినిమాల్లో అప్పుడ‌ప్పుడు న‌టిస్తున్న‌ప్ప‌టికీ బాలీవుడ్ ని నాగ్ సీరియ‌స్ గా తీసుకోలేదు. దీనికి కార‌ణం ఏంట‌ని నాగ్ ని అడిగితే...బాలీవుడ్ మేకింగ్ కి ఇక్క‌డ మేకింగ్ కి చాలా తేడా ఉంది. ఇక్క‌డ మ‌నం ఉద‌యం 10 గంట‌ల‌కు ఫ‌స్ట్ సీన్ తీస్తాం కానీ.. బాలీవుడ్ లో అలా కాదు. ఫ‌స్ట్ సీన్ మ‌ధ్యాహ్నం తీస్తారు. ఇంకా చెప్పాలంటే... ఇక్క‌డ నేను కింగ్. అలాంటిది అక్క‌డ‌కి వెళ్లి సినిమా చేసి ఇబ్బంది ప‌డ‌డం ఎందుకు..? అనే ఆలోచ‌న‌తో హిందీ సినిమాలు చేయ‌డం పై అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌న్నారు.

వెంక‌టేష్ కూడా హిందీలో అనారి, త‌క్ దిర్ వాలా చిత్రాల్లో న‌టించారు కానీ... ఆశించిన స్ధాయిలో స‌క్స‌స్ సాధించ‌లేదు. మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ జంజీర్ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు కానీ... ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా దెబ్బ‌తిన్న‌ది. ఆత‌ర్వాత మ‌ళ్లీ చ‌ర‌ణ్ హిందీ సినిమా చేయ‌లేదు. దీంతో... టాలీవుడ్ హీరోలు హిందీ సినిమాల్లో న‌టిస్తుంటారు కానీ... చెప్పుకోద‌గ్గ విజ‌యాన్ని సాధించ‌లేరు అనుకునేవాళ్లు బాలీవుడ్ జ‌నాలు. అలా అనుకునే వాళ్లంద‌రికీ బాహుబ‌లి సినిమాతో స‌మాధానం చెప్పి.. ఒక్క‌సారిగా బాలీవుడ్ మాత్ర‌మే కాదు హాలీవుడ్ సైతం త‌మ వైపు చూసేలా చేసిన ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. బాహుబ‌లి 2 సినిమాతో 1000 కోట్లు వ‌సూలు చేసి...1000 కోట్లు వ‌సూలు చేసిన తొలి ఇండియ‌న్ మూవీగా చ‌రిత్ర సృష్టించింది తెలుగు సినిమా.

కె.విశ్వ‌నాథ్ తెర‌కెక్కించిన శంక‌రాభ‌ర‌ణం సినిమా చ‌రిత్ర సృష్టించి తెలుగు సినిమా గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచానికి తెలియ‌చేసింది. ఆత‌ర్వాత నాగార్జున హీరోగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన శివ సినిమా ఓ చ‌రిత్ర‌. తెలుగు సినిమా న‌డ‌త‌నే మార్చేసింది ఈ సినిమా. బాహుబ‌లి సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం బాలీవుడ్ వెళ్లిన ప్ర‌భాస్, రాజ‌మౌళితో అక్క‌డి జ‌నాలు చెప్పిన మాట‌. తెలుగు సినిమా గురించి శివ సినిమా టైమ్ విన్నాం. మ‌ళ్లీ ఇప్పుడు వింటున్నాం అన్నారంటే... శివ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అర్ధం చేసుకోవ‌చ్చు.

బాహుబ‌లి సినిమా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి బాలీవుడ్ జ‌నాల ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింది. టాలీవుడ్ లో భారీ సినిమాలు, మంచి క‌థా బ‌లం ఉన్న సినిమాలు వ‌స్తున్నాయి అని తెలుసుకుని... తెలుగు సినిమాల గురించి ఆరా తీయ‌డం మొద‌లైంది. బాహుబ‌లి త‌ర్వాత ఆస్ధాయిలో క్రేజ్ సంపాదించుకున్న మూవీ సాహో. హాలీవుడ్ స్ధాయిలో రూపొందిన సాహో చిత్రాన్ని టాలీవుడ్ జ‌నాల క‌న్నా.. బాలీవుడ్ జ‌నాలు ఎక్కువుగా ఆద‌రించారు అంటే... అక్క‌డ తెలుగు సినిమాల‌కు ఎంత‌టి ఆద‌ర‌ణ ఉందో...? అర్ధం చేసుకోవ‌చ్చు.

బాహుబ‌లి, సాహో త‌ర్వాత ఆ స్ధాయిలో రూపొందిన భారీ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవితో సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన సైరా సినిమాని 5 భాష‌ల్లో రిలీజ్ చేసారు. బిగ్ బి అమితాబ్, సుదీప్, విజ‌య్ సేతుప‌తి, న‌య‌న‌తార, త‌మ‌న్నా... ఇలా భారీ తారాగ‌ణంతో రూపొందింది. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్ తో సైరా చిత్రాన్ని రామ్ చ‌ర‌ణ్ నిర్మించారు. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. మొన్న బాహుబ‌లి, నిన్న సాహో, నేడు సైరా... ఇలా బాలీవుడ్ ని షేక్ చేస్తుంది టాలీవుడ్. మ‌రి.. భ‌విష్య‌త్ లో టాలీవుడ్ నుంచి మ‌రిన్ని భారీ చిత్రాలు వ‌స్తాయ‌ని... ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని సంచ‌ల‌న విజ‌యాలు సాధిస్తాయ‌ని ఆశిద్దాం.

Next Story