రాజకీయం రాజకీయమే ..బంధుత్వం బంధుత్వమే. ఈ సూత్రం బాగా తెలిసినవాడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. నందమూరి కుటుంబాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు తెలిసినట్లుగా ఈ దునియాలో ఎవరికీ తెలియదు. ఎన్టీఆర్‌ దగ్గర నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన నందమూరి సుహాసిని వరకు అందర్ని రాజకీయంగా ఉపయోగించుకున్నాడు చంద్రబాబు. తన రాజకీయ మంత్రాంగంలో, ఎత్తుల్లో. జిత్తుల్లో నందమూరి ఫ్యామిలీ నలిగిపోతూనే ఉంది. ఇప్పుడు మరోసారి మోసపోవడానికి అంటారో..మరేమంటారో చంద్రబాబు రాజకీయ పాచికలు నందమూరి ఫ్యామిలీ బలి కాబోతుందని తెలంగాణ టీడీపీ నేతలు అనుకుంటున్నారు.

తెలంగాణలో టీడీపీ పని అయిపోయింది. ఇది అందరికీ తెలిసిన విషయం. కాని..చంద్రబాబుది మాత్రం దింపుడు కల్లెం ఆశ. హుజుర్‌ నగర్‌లో నాలుగు ఓట్లు సంపాదించుకుంటే..తమ పార్టీ బతికుందని చెప్పుకోవడానికి పనికి వస్తుందనేది చంద్రబాబు ప్లాన్‌. ఆ దిశగా ఆలోచించే బీసీ నాయకురాలు కిరణ్మయికి టికెట్ ఇచ్చారు. “తమది బీసీల పార్టీ, టీడీపీపై ప్రజలు నమ్మకంతో ఉన్నారు, మా పార్టీ విజయంపై నమ్మకంతో ఉన్నాం, ప్రజలు ఆదరిస్తారు” అని కిరణ్మయి ఎంత చెప్పినా ..టీడీపీకి అంత సీన్ లేదని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. గ్రౌండ్ లెవల్ ఫీడ్ బ్యాక్‌ తీసుకున్న తరువాతనే చంద్రబాబు హుజూర్ నగర్‌ లో నందమూరి కుటుంబాన్ని దించాలని ప్లాన్‌ చేస్తున్నాడట..!

గత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి అసెంబ్లీ సీటు పెద్దిరెడ్డికి ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్నారు చంద్రబాబు. తరువాత హరికృష్ణ కుమార్ సుహాసినికి టికెట్ ఇచ్చారు. అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఆమె 50వేలకు పైగా ఓట్లతో ఘోరంగా టీఆర్‌ఎస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయింది. చంద్రబాబు ఆమెకు అలా సీట్ ఇచ్చినట్లే ఇచ్చి ఓడగొట్టారని టీడీపీ నేతలే చెప్పకుంటారు. సుహాసినిని రంగంలోకి దించితే మహిళలు టీడీపీకి పడతాయని స్థానిక నేతలు భావించే చంద్రబాబుకు ఈ సలహా ఇచ్చారట..!

హరికృష్ణ ఫ్యామిలీని అడిగే ధైర్యం కూడా చంద్రబాబు చేయడంలేదని రాజకీయ వర్గాల్లో వినికిడి. చంద్రబాబు నైజం గురించి బాగా తెలిసిన కల్యాణ్ రామ్, జూ.ఎన్టీఆర్‌లు చంద్రబాబు గురించి ఆలోచించడమే మానేశారు. హరికృష్ణ బాడీని పక్కన పెట్టుకుని..తెలంగాణలో పొత్తులు గురించి చర్చించినప్పుడే చంద్రబాబు ఏంటో వాళ్లు గ్రహించారు. అందుకే..టీడీపీకి, చంద్రబాబుకు కల్యాణ్ రామ్‌, జూనియర్ ఎన్టీఆర్‌లు దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇక..ఎవరొచ్చినా..రాకపోయినా బాలయ్యకు తప్పదుగా ఆయన మాత్రం హుజూర్ నగర్‌ ప్రచారానికి కచ్చితంగా వస్తారని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. బాలయ్య రాకతో హుజూర్ నగర్ టీడీపీ జాతకం కొంచెమైనా మారుతుందా..?. చంద్రబాబు ప్రచారం చేసుకునే ఓట్లు అయినా వస్తాయో లేదో చూడాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.