స్మార్ట్‌ సిటీగా అయోధ్య.. యోగి సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  11 Jan 2020 12:52 AM GMT
స్మార్ట్‌ సిటీగా అయోధ్య.. యోగి సంచలన నిర్ణయం

రామ జన్మభూమి అయిన అయోధ్యను స్మార్ట్‌ సిటీగా అభివృద్ది చేసేందుకు ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యతో పాటు తన మఠం ఉన్న గోరఖ్‌పూర్‌, ఘజియాబాద్‌, ఫిరోజాబాద్‌, మీరట్‌, మధుర, షాహాజాన్‌ పూర్‌ నగరాలను స్మార్ట్‌ సిటీలుగా అభివృద్ది చేసేందుకు యోగి నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో స్మార్ట్‌ సిటీకి రూ. 50 కోట్ల చొప్పున మంజూరు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇక సరయూ నదీ తీరంలో 151 మీటర్ల ఎత్తు గల రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుతో అయోధ్యనగరాన్ని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయోధ్య నగర అభివృద్ధి కోసం యాత్రికుల అభివృద్ధి కౌన్సిల్‌ ను ఏర్పాటు చేయనున్నారు. అయోధ్య తీర్థ డెవలప్‌మెంట్‌ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు మేయర్‌ రిషికేష్‌ ఉపాధ్యాయ్‌ తెలిపారు.

ఇక అయోధ్య రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి పర్చేందుకు రూ. 100 కోట్లను మోదీ ప్రభుత్వం మంజూరు చేసింది. 4వేల బస్సులు రాకపోకలు సాగించే విధంగా బస్సు టెర్మినల్‌ ను నిర్మించనున్నారు. యాత్రికుల కోసం అయోధ్యలో అధునాతన సౌకర్యాలతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే 13 కిలోమీటర్ల రాముడి కారిడార్‌ నిర్మాణంతో పాటు సరయూ నదిలోయాత్రికులు పర్యటించేందుకు లాంచీలు సైతం ఏర్పాటు చేయనున్నారు. అయోధ్యలో యాత్రికుల బస చేసేందుకు ఐదు నక్షత్రాల హోటళ్లు, రిసార్టులను ఏర్పాటు చేయనుంది. ఇక అయోధ్య నగర సమీపంలోని 42 గ్రామాలను అయోధ్య మున్సిపాలిటీలలో విలీనం చేసేందుకు కసరత్తు చేస్తుంది యోగి సర్కార్‌.

Next Story