ఆ లుక్ లో నన్ను చూసి మా పేరెంట్సే షాక్ అయ్యారు

By Medi Samrat  Published on  15 Oct 2019 9:03 AM GMT
ఆ లుక్ లో నన్ను చూసి మా పేరెంట్సే షాక్ అయ్యారు

ముఖ్యాంశాలు

  • 'చిన్నారి పెళ్లికూతురు'గా బుల్లితెర‌లో బాగా పాపుల‌ర్ అయ్యి... ఆత‌ర్వాత 'ఉయ్యాలా జంపాల' సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మై... తొలి ప్ర‌య‌త్నంలోనే విజయం సాధించి తనకంటూ మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకుంది అవికా గోర్. ప్రస్తుతం ‘రాజు గారు గది 3’చిత్రంలో న‌టిస్తుంది. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓక్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘అవికా గోర్’ తో ప్ర‌త్యేక‌ ఇంట‌ర్వ్యూ మీ కోసం..

తెలుగులో గ్యాప్ రావ‌డానికి కార‌ణం..?

'ఉయ్యాలా జంపాల' స‌క్సెస్ త‌ర్వాత చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి కానీ... హిందీ సినిమాలు చేయడం, ముఖ్యంగా ఒకే రకమైన సినిమాలు రావడంతో తెలుగు సినిమాలు ఎక్కువ చేయలేకపోయాను.

‘రాజుగారి గది 3’ సినిమా క‌థ చెప్పిన‌ప్పుడు మీకు న‌చ్చింది ఏంటి..?

ఈ సినిమా చేయ‌డానికి మెయిన్ రీజ‌న్ దర్శకుడు ఓంకార్ గారే. ఆయన తమన్నా అనుకుని రాసుకున్న పాత్రలో నేను అయితే బాగా చేస్తానని నమ్మారు. ఆయన కథ చెప్పినప్పుడు నాకు కథ బాగా నచ్చింది. అందులో నా పాత్ర ఇంకా న‌చ్చింది. అందుకే వెంటనే ఈ సినిమా చేయడానికి అంగీకరించాను.

మీ క్యారెక్టర్ గురించి?

సినిమాలో నా క్యారెక్టర్ వెరీ సింపుల్… గర్ల్ నెక్స్ట్ డోర్ లా ఉంటుంది. ప్ర‌తి ఒక్కరికీ క‌నెక్ట్ అవుతుంది.

హారర్ సినిమాలో మొదటిసారి నటించారు క‌దా! ఎలా అనిపించింది?

నేను ఒంటరిగా హారర్ ఫిల్మ్స్ అసలు చూడను. ఒకవేళ చూసినా.. పక్కన ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ ఉంటేనే చూస్తాను. అలాంటిది ఓంకార్ నాకు ఈ హారర్ కథ చెబుతున్నప్పుడే టెన్షన్ పడ్డాను. కానీ కథలో మంచి కామెడీ ఉంటుంది. కథ వింటున్నంత‌సేపు నేను నవ్వుతూనే ఉన్నాను.

పోస్టర్ లో మీ లుక్ చూస్తుంటే చాలా భయం కలిగించేలా ఉంది..? మీకెలా అనిపించింది..?

పోస్టర్ లో చూసినప్పుడు నాకు మామూలుగానే అనిపించింది. అయితే... ఆ లుక్ లో నన్ను చూసి మా పేరెంట్స్ షాక్ అయ్యారు. కానీ కథ తెలిసాక మళ్ళీ కామ్ అయ్యారు.

ఈ సినిమాలో బాగా ఆకట్టుకునే అంశాలు ఏమిటి ?

ఈ సినిమాలో కామెడీ చాల కొత్తగా అలాగే అద్భుతంగా ఉంటుంది. సినిమా చూస్తూ ఉన్నంత సేపూ కామెడీని మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాం. అలాగే సినిమాలో డైలాగ్స్ అండ్ మ్యూజిక్ ఇలా అన్ని బాగుంటాయి. ఒక్క మాటలో ప్రేక్షకులకు కావలసిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మూవీతో ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటాం.

తెలుగు డైలాగ్స్ మీకు అర్ధం అవుతాయా ?

అర్థం అవుతాయి కానీ.. త్వరగా మాట్లాడలేను.

తమన్నా చేయాల్సిన పాత్రను మీరు చేశారు. నటనలో ఆమెతో పోల్చి చూస్తారనే టెన్షన్ ఉందా ?

లేదు అండి. ఏ క్యారెక్టర్ అయినా దాన్ని ఎవరు చేసినా దర్శకుడి అభిరుచికి తగ్గట్లే చేస్తారు. కాకపోతే, ఎవరి శైలి వారిది. నా వరకూ నేను ఈ సినిమా కోసం సిన్సియర్ గా వర్క్ చేశాను. అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ..?

బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాను. అలాగే హిందీలో సీరియ‌ల్స్ లో కూడా చేస్తున్నాను. ఇక నుండి తెలుగులో ఎక్కువ సినిమాలు చేయాల‌నుకుంటున్నాను.

Next Story
Share it