ఆస్ట్రేలియా ప్రధానిపై తగ్గని ప్రజాగ్రహం
By Newsmeter.Network Published on 4 Jan 2020 4:34 AM GMT
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్‌కు దేశ ప్రజల నుంచి కొత్త అనుభవం కాదు కాదు చెత్త అనుభవాలు ఎదురవుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియాలోని అడవుల్లో కార్చిచ్చు అంటుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 18 మంది కార్చిచ్చుకు బలి అవ్వగా, అందులో దేశ పౌరులు, పలువురు ఫైర్ ఫైటర్స్, వాలంటీర్లు ఉన్నారు. అయితే ప్రధాని స్కాట్ మోరిసన్ గురువారం న్యూ సౌత్‌వేల్స్‌లోని కోబార్గో పట్టణంలో పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లారు.
గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో కార్చిచ్చు చుట్టుముడుతుంటే నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న ప్రధాని స్కాట్ మారిసన్‌ను బాధితులు చుట్టుముట్టారు. ప్రధానితో కరచాలనం చేసేందుకు అక్కడి అగ్నిమాపక ఉద్యోగి నిరాకరించారు. అయితే ప్రధాని అతడి చేతిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నించటం, వెంటనే అతడు అక్కడి నుండి లేచి వెళ్లిపోవటం చేశారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు పలువురు ఫైర్ మెన్ అలాగే వ్యవహరించారు. ఒక వైపు చుట్టుముడుతున్న కార్చిచ్చుతో ప్రజలు సతమతమవుతుంటే ప్రధాని కొత్త సంవత్సర వేడుకల్లో బాణసంచా కాల్పుల్లో మునిగిపోవటం, క్రికెట్ చూడమని వ్యాఖానించడం వంటి వాటిపై బహిరంగంగా విమర్శలు గుప్పించారు . 'యు ఇడియట్.. నీకిక్కడ ఎవరి ఓట్లు పడవు' అంటూ ఆ వ్యక్తి బిగ్గరగా కేకలు వేశాడు. అయితే దీనిపై సున్నితంగా స్పందించిన ప్రధాని మారిసన్ ఈ దాడులను తాను వ్యక్తిగతంగా పరిగణించటం లేదని చెప్పారు.