ఉద్యమబాటలో ఆస్ట్రేలియా మీడియా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Oct 2019 6:20 PM GMT
ఉద్యమబాటలో ఆస్ట్రేలియా మీడియా..!

ఆస్ట్రేలియాలో మీడియా సంస్థలు ఉద్యమ బాటపట్టాయి. మీడియా స్వేచ్ఛపై ప్రభుత్వ ఆంక్షలకు వ్యతిరేకంగా దేశంలోని ప్రముఖ దినపత్రికలన్నీ ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ తీరును నిరసిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపాయి. పత్రిక మొదటి పేజీపై ఎరుపు రంగుతో సీక్రెట్ అని ముద్రించి, ఆ పేజీలోని వార్తా కథ నాలు కనిపించకుండా నల్లరంగు పులిమి నిరసన వ్యక్తం చేశాయి. మీడియా స్వతంత్రతకు భంగం కలగనివ్వొద్దని, జర్నలిస్టులపై వేధింపులు నిలిపేయాలని డి మాండ్ చేశాయి.

ఆఫ్ఘనిస్థాన్‌లో ఆస్ట్రేలియా ప్రత్యేక బలగాల యుద్ధ నేరాలను బయటపెడుతూ ఇద్దరు ఏబీసీ విలేకరులు వార్తాకథనాలు రాశారు. ఇక, దేశ పౌరులపై నిఘా పెట్టే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందంటూ స్మిథర్స్ జర్నలిస్టు ఒక వార్తా కథనం ప్రచురించారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిపై క్రిమినల్ అభియోగాలు మోపడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఏబీసీ ప్రధాన కార్యాలయం, న్యూస్ కార్ప్ జర్నలిస్టు అన్నికా స్మెథర్స్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడులపై ఆసీస్ మీడియా భగ్గుమంది. మీడియా స్వేచ్చపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందని నిప్పులు చెరిగింది. కొన్ని చట్టాల విషయంలో ప్రభుత్వం రహస్యంగా వ్యవహరిస్తోందని, అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మీడియా సంస్థలు ప్రశ్నిస్తున్నాయి. ప్రజలకు, జర్నలిస్టులకు చెప్పలేనంత సీక్రెట్ ఏముంటుందని నిలదీశాయి.

మీడియా సంస్థల ఆందోళనపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ స్పందించారు. పత్రికా స్వేచ్చకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఐతే, జర్నలిస్టులు చట్టాలకు అతీతం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో కొన్ని రహస్యాలుంటాయని, వాటిని అందరికీ చెప్పలేమన్నారు.

Next Story