ఆస్ట్రేలియా క్రికెటర్ భావోద్వేగ పోస్ట్

By రాణి  Published on  3 Jan 2020 5:46 AM GMT
ఆస్ట్రేలియా క్రికెటర్ భావోద్వేగ పోస్ట్

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కొనసాగుతోంది. ఆగ్నేయ ప్రాంతంలో అడవులు కాలిపోతూనే ఉన్నాయి. అయినా సరే నూతన సంవత్సరం వేడుకలు చేసుకుందామని కొందరు పర్యాటకులు ప్రయత్నించారు. అయితే వారందరు మంటల తాకిడికి సమీపంలోని బీచ్‌లకు పారిపోవాల్సి వచ్చింది. న్యూ సౌత్‌వేల్స్, విక్టోరియా రాష్ట్రాలకు మంటలు వ్యాపించడంతో సమీపంలోని బీచ్‌లకు దాదాపు 4 వేల మంది పారిపోయి వచ్చారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాలో కొన్ని నెలలుగా అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి. పొగ దట్టంగా వ్యాపిస్తోంది. దీంతో విమానాల ద్వారా నిఘా, వాటర్‌ బాంబ్‌లను ఉపయోగిస్తున్నట్లు న్యూసౌత్‌ వేల్స్‌ గ్రామీణ అగ్నిమాపక యంత్రాంగం తెలిపింది. ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చాలా రోజులుగా హెచ్చరిస్తూనే ఉన్నామన్నారు.

మరోవైపు ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చుపై ఆ జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ భావోద్వేగ పోస్టు చేశాడు. ఆ దావానలాన్ని చూసి తానింకా షాక్ నుంచి తేరుకోలేదని అన్నాడు. వార్నర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలో ఓ వ్యక్తి నది ఒడ్డున కూర్చుని కార్చిచ్చును చూస్తున్నాడు. అతడి పక్కన ఓ శునకం కూర్చుని ఉంది. తానిప్పుడే ఈ ఫొటోను చూశానని పేర్కొన్న వార్నర్.. తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానని పేర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జీవించి ఉన్నామంటే మనం ఎంత అదృష్టవంతులమో ఎప్పటికీ మర్చిపోలేమన్నాడు. మాటలకందని ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారే అసలైన హీరోలని క ప్రశంసించాడు. ఆస్ట్రేలియా లో ఈ దావానలం కారణంగా ఇప్పటికి 18 మంది మృతి చెందారు.

Next Story