మంధాన మెరుపులు.. అయినా.. త‌ప్ప‌ని ఓట‌మి

By Newsmeter.Network  Published on  12 Feb 2020 1:53 PM IST
మంధాన మెరుపులు.. అయినా.. త‌ప్ప‌ని ఓట‌మి

ముక్కోణ‌పు టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు విజేత‌గా నిలిచింది. మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్‌లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు పై 11 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా మ‌హిళ‌ల‌ జట్టు ఘన విజయం సాధించి టైటిల్‌ కైవసం చేసుకుంది.

అంత‌క‌ముందు టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మ‌హిళ‌ల జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్ బెత్‌ మూనీ(71 నాటౌట్; 54 బంతుల్లో 9పోర్లు) రాణించ‌డంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేసింది. మెగ్‌లానింగ్‌(26), ఆష్లే గార్డ్‌నర్‌(26) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టి కంగారూలను కట్టడి చేశారు.

అనంత‌రం 156 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి భార‌త్‌కి శుభారంభం ద‌క్క‌లేదు. ఓపెన‌ర్ షఫాలి వర్మ(10; 9బంతుల్లో 1పోర్, 1సిక్స‌ర్‌) జ‌ట్టు స్కోరు 11 ప‌రుగుల వ‌ద్ద వెనుదిరిగింది. అయిన‌ప్ప‌టికి మ‌రో ఓపెన‌ర్ స్మృతి మంధనా(66: 37 బంతుల్లో 12 ఫోర్లు) ధాటిగా బ్యాటింగ్ చేసింది. ఓ ఎండ్‌లో మంధాన విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడిన‌ప్ప‌టికి మ‌రో ఎండ్‌లో ఆమెకు స‌హ‌క‌రించేవారు క‌రువ‌య్యారు. 115 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్‌గా మంధాన పెవిలియ‌న్ చేరింది. ఈ ద‌శ‌లో ఆస్ట్రేలియా బౌల‌ర్లు వ‌రుస‌గా వికెట్లు ప‌డ‌గొట్ట‌డంతో టిమిండియా 20 ఓవ‌ర్ల‌లో 144 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఆసీస్‌ బౌలర్లలో జెస్‌ జొనాసేన్‌ ఐదు వికెట్లు పడగొట్టి కంగారూల విజయంలో కీలక పాత్ర పోషించింది.

మహిళల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫిబ్రవరి 21 ప్రారంభం కానుంది. పైన‌ల్ మార్చి 8 న జ‌ర‌గ‌నుంది.

Next Story