అచ్చెన్నాయుడుకు రెండు వారాల రిమాండ్‌

By సుభాష్  Published on  13 Jun 2020 5:30 AM GMT
అచ్చెన్నాయుడుకు రెండు వారాల రిమాండ్‌

ఏపీలో రాజకీయ వేడి ఊపందుకుంది. టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కాగా, అనారోగ్యం కారణాల వల్ల ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని ఆదేశించింది. ఇక ముందుగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు విజయవాడ సబ్‌ జైలుకు తరలించగా, అనంతరం అధికారుల అనుమతితో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఇదే కేసులు ఏ1 నిందితుడిగా ఉన్న రమేష్‌ కుమార్ ను రాజమండ్రి సబ్‌జైలుకు తరలించారు.

కాగా, ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో అచ్చెన్నాయుడుపై కేసు నమోదు కావడంతో ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. దీంతో అచ్చెన్నాయుడుకు వైద్య పరీక్షల అనంతరం మంగళగిరి న్యాయమూర్తి నివాసానికి తరలించారు. మాజీ మంత్రితో పాటు ఈ కేసులు ఏ1గా నిందితుడైన రమేష్‌ కుమార్‌ ను అధికారులు జడ్జి ముందు హాజరుపర్చారు. అచ్చెన్నాయుడు, రమేష్‌ కుమార్‌లకు న్యాయమూర్తి రెండు వారాల పాటు రిమాండ్‌ విధించారు.

నిన్న ఉదయం 7.30 గంటలకు అచ్చెన్నాయుడును అరెస్ట్‌ చేయగా, వారితో పాటు రమేష్‌ కుమార్‌, డాక్టర్‌ జనార్ధన్‌, ఎంకేబి చక్రవర్తిలను అరోస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వీరిని శనివారం ప్రత్యేక న్యాయస్థానం ఎదుట హాజరు పరుస్తామన్నారు. కాగా, సుమారు 150 కోట్ల వరకూ అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ అయినట్లు తెలిపారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు వస్తున్న ఆరోపణలు నిర్ధారణ అయినట్లు చెప్పారు. అలాగే ఫేక్‌ ఇన్వాయిస్‌ తో మందులు కొనుగోలు చేసినట్లు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కనీసం ప్రిన్సిపల్‌ సెక్రటరీకి కూడా తెలియకుండా అవినీతికి పాల్పడినట్లు తెలిపారు. విజిలెన్స్‌ రిపోర్ట్‌ పై ప్రభుత్వ ఆదేశాలపై ఏసీబీ కేసు విచారణ చేస్తూనే వీరిని అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు.

Next Story