అసమాన దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం 'అటల్ జీ'
By సుభాష్ Published on 25 Dec 2019 8:29 PM ISTఅసమాన దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం అటల్ బిహారీ వాజపేయ్. రాజకీయాల్లో వికసించిన కమలం లాంటి వ్యక్తి ఆయన. ఎన్నోపదవులు చేపట్టి రాజకీయ నేతల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నో రచనలు, ఎన్నో పదవులు, ఎన్నో అవార్డులు అందుకున్న ఆయన రాజకీయాల్లో తిరుగులేని వ్యక్తిగా నిలిచాడు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశంలో ఎన్నో మార్పులను తీసుకువచ్చిన వ్యక్తి ఆయన. నిరుపేదలకు అండగా నిలుస్తూ ముందుకు సాగారు. రాజకీయంగా, పాలనపరంగా తనదైన ముద్రవేసుకున్నారు అటల్‌జీ. ఇన్ని రోజులుగా మన మధ్య లేకుపోయినా అందరిలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
అటల్ బిహారీ వాజపేయి. 1924 డిసెంబర్ 24న జన్మించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో జన్మించిన యన భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. మొదటిసారిగా రెండువ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్ సభలకు తప్పించి 14వ లోక్‌సభ ముగిసే వరకు పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1968 నుంచి 73 వరకు జన సంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా, 1980 నుంచి 86 వరకు బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పని చేశారు. 1996లో మొదటిసారిగా ప్రధానమంత్రి పదవీ యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో సారి ప్రధానిగా 13 మాసాలు పాలన కొనసాగించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నాడు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. 2015 మార్చిలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వాజపేయికి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానం చేశారు. అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం కావడంతో వాజపేయికి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతి ఆయన నివాసానికే వెళ్లి అందించారు.
విద్యాభ్యాసం:
ఎంతో ప్రతిభావంతుడైన వాజపేయి గ్వాలియర్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో విద్యనభ్యసించారు. గ్వాలియర్ విక్టోరియా కళాశాలలో చేరి హిందీ, ఇంగ్లీష్, సంస్కృతంలో అత్యంత ప్రతిభావంతునిగా పట్టభద్రుడయ్యారు. వాజపేయ్ రాజనీతి శాస్త్రంలో ఎంఏ పట్టాను కార్పూరులోని దయానంద ఆంగ్లో వైదిక కాలేజీ నుంచి పొందారు. ఎంఏ డిగ్రీని ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు.
రాజకీయ జీవితం:
1942 నుంచి వాజపేయ్ రాజకీయ జీవితం మొదలైంది. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన తన అన్నప్రేమ్ తోకలిసి 22 రోజుల పాటు అరెస్టు అయిన సందర్భంగా రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. 1975, 1977 ల మధ్య, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన ప్రధాని, ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన ఎమర్జన్సీ కాలంలో అనేకమంది విపక్ష నాయకులతో పాటు అరెస్టు అయ్యాడు. 1977 లో సంఘసంస్కర్త జయప్రకాశ్ నారాయణ్, కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడటానికి, అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు, వాజపేయి జనసంఘ్‌ను క్రొత్తగా ఏర్పడిన సంకీర్ణ కూటమి, జనతాపార్టీలో విలీనం చేశాడు. 1977 సార్వత్రిక ఎన్నికలలో జనతా పార్టీ విజయం తరువాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశాడు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్యసమితి యొక్క సర్వప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయే నాటికి వాజపేయి, స్వతంత్రంగా గౌరవప్రథమైన రాజకీయవేత్తగా, అనుభవజ్ఞుడైన నాయకునిగా ఎదిగాడు. 1979లో మొరార్జీదేశాయ్ ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన కొద్దిరోజులకే జనతాపార్టీ కూడా విఛ్ఛిన్నమైపోయింది. జనసంఘ్ నాయకులు జనతాపార్టీని సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నించినా, జనతాపార్టీలోని వివిధ వర్గాల మధ్య అంతర్గత విభేదాలవల్ల విసిగిపోయి సంకీర్ణంలోనుండి బయటకు వచ్చింది.
వాజపేయి, జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ల నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్.కె.అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980 లో భారతీయ జనతా పార్టీని ఏర్పరచి, మొట్టమొదటి అధ్యక్షునిగా పనిచేసాడు. జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రెసు ప్రభుత్వానికి బలమైన విమర్శకునిగా అవతరించాడు.
భారతీయ జనతాపార్టీ, పంజాబ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న వేర్పాటువాద తీవ్రవాదాన్ని వ్యతిరేకించినా, ఆ పరిస్థితికి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ యొక్క "విభజన, అవినీతి రాజకీయాలు జాతీయ సమైక్యత, సమగ్రతలకు ఫణంగా పెట్టి, తీవ్రవాదాన్ని ప్రోత్సహించాయి" అని ఆరోపించింది. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ బ్లూ స్టార్ను వ్యతిరేకించింది. 1984 లో ఇద్దరు సిక్కు అంగరక్షకులచే ఇందిరాగాంధీ హత్యకు గురైన తదుపరి ఢిల్లీలో సిక్కుల పై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించింది. 1984 ఎన్నికలలో బీపేపీ లోక్‌సభలో రెండు సీట్లను మాత్రమే పొందింది. ఆ కాలంలో వాజపేయి బి.జె.పి అధ్యక్షునిగా, విపక్ష నాయకునిగా కొనసాగాడు.
వ్యవస్థాపక అధ్యక్షుడిగా..
1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారు. అలాగే 1980 నుంచి 86 వరకు బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పని చేశారు. 3వ, 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసే వరకు ప్రాతినిధ్యం వహించారు.
రాజకీయాలకు దూరం..
2005 డిసెంబర్‌లో ముంబైలోని శివాజీపార్కులో జరిగిన బీజేపీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో వాజపేయ్ క్రియాశీల రాజకీఆల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించుకున్నారు. ఆయన అనారోగ్యం కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలకు దూరం అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.
భారతరత్నతో సహా వరించిన అవార్డులు వాజపేయి దేశానికి చేసిన విశేష సేవలకు గాను మోదీ నాయకత్వంలో భారత సర్కార్ 2014, డిసెంబర్ 24న భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. వాజపేయ్ పుట్టిన రోజు డిసెంబర్ 25ను సుపరిపాలన దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇక అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితమైన వాజపేయ్ 2018 ఆగస్టు 16 కన్నుమూశారు. ఆయన పానల, ఆయన సేవలు చిరస్థాయిగా గుర్తుండిపోయాయి. ఆయన మరణంతో పార్టీ నాయకులే కాకుండా ఇతర రాజకీయనేతలు కూడా జీర్ణించుకోలేకపోయారు.
అందుకున్న అవార్డులు
1992 - పద్మవిభూషణ్
1993- కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డీలిట్ గౌరవ పురస్కారం
1994- లోకమాన్య తిలక్ పురస్కారం
1994 - ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు
1994 - భారతరత్న గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు
2014 : భారతరత్న