అంచనాలు పెంచేసిన 'అశ్వథ్థామ'
By Newsmeter.Network Published on 23 Jan 2020 2:59 PM GMTనాగశౌర్య, మెహ్రీన్ లు హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు రమణతేజ తెరకెక్కించిన చిత్రం 'అశ్వథ్థామ'. జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ను దర్శకుడు పూరీ జగన్నాధ్ గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. "రాక్షసుడిని.. భగవంతుడిని చూసిన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతాయి" అంటూ విలన్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఆరంభం అవుతుంది. ఈలెక్కన ఆ విలన్ ను చూసిన ప్రతి ఒక్కరిని చంపేస్తాడన్న మాట.
ఇక ట్రైలర్ ప్రకారం అమ్మాయిల మిస్సింగ్‌తో పాటు, వారిని దారుణంగా చంపుతున్న వారికోసం హీరో వేట మొదలు పెడతాడు. అయితే వీళ్లందరినీ ఆడిస్తున్న ప్రధాన సూత్రధారిని పట్టుకోడానికి హీరో తన ప్రయత్నాలు చేస్తుంటాడు. ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉంది. యాక్షన్ సీన్లను ఈ ట్రైలర్ లో హైలైట్ గా చెప్పుకోవచ్చు. శౌర్య మ్యాన్లీ లుక్ లో కనిపిస్తున్నాడు. నేపథ్య సంగీతం, సస్పెన్స్ ఎలిమెంట్స్ అన్నీ బాగున్నాయి. రొటీన్ కమర్షియల్ సినిమా లాగా కాకుండా ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీల్ కలిగిస్తోంది. శౌర్య లవర్‌బాయ్ ఇమేజ్ నుంచి ఒక్కసారిగా మాస్ యాంగిల్‌లో కనిపించడం కాస్త కొత్తగా ఉన్నా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్ చివరలో శౌర్య విజిల్ వేసుకుంటూ కనిపించే సీన్ అభిమానులతో ఈల వేయించేట్లు కనిపిస్తోంది. మొత్తానికి అశ్వథ్థాముడు ట్రైలర్ తో అంచనాలు పెంచేశాడు .