గోదా గోవింద గీతం : నిశ్చింతగా మఱ్ఱాకుమీద తేలు నీలి మణి వర్ణుడా

Want Paramatma not his Weapons.మాలే మణివణ్ణా మార్-గళి నీరాడువాన్

By M Sridhar  Published on  10 Jan 2023 1:54 AM GMT
గోదా గోవింద గీతం : నిశ్చింతగా మఱ్ఱాకుమీద తేలు నీలి మణి వర్ణుడా

మాలే మణివణ్ణా మార్-గళి నీరాడువాన్

మేలైయార్ శేయ్-వనగళ్ వేండువన కేట్టియేల్

ఞాలత్తై యెల్లాం నడుంగ మురల్వన

పాలన్న వణ్ణత్తు ఉన్-పాంచజన్నియమే

పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడైయనవే

శాలప్పెరుం పఱైయే పల్లాండిశైప్పారే

కోలవిళక్కే కొడియే వితానమే

ఆలిన్-ఇలైయాయ్ యరుళ్-ఏలోర్ ఎంబావాయ్

తెలుగు భావార్థ గీతిక

ప్రళయ కాలమున సాగరమ్ముప్పొంగి ముంచువేళ

నిశ్చింతగా మఱ్ఱాకుమీద తేలు నీలి మణి వర్ణుడా

మార్గళి స్నాన వ్రతానుష్టాన పరికరాలకై వచ్చినాము

జగముగుండెలదరగొట్ట గర్జించుపాంచజన్యము వంటి

ధవళ వర్ణపు శంఖములెన్నొ మాకు కావలయు

పెద్ద ఢక్కివాద్యము, పల్లాండు సెప్పెడి దీపపు సెమ్మెలు

సన్నిధి కోలలును ధ్వజ వితానములు ఎన్నో మేలికట్లు

నెలనోము పూర్తికి వలయు వస్తు సంచయమెల్ల నిమ్ము.

మణివణ్ణా అంటే కొంగు మణి అనీ భక్తులకు కొంగుబంగారమనీ కూడా అర్థం. మాలే మణివణ్ణా అనే మాటద్వారా భగవంతుని ఆశ్రిత వాత్సల్యం అనే సౌశీల్యం తోబాటు కొంగుమణిగా సులభంగా దొరికే సౌలభ్యం కూడా ప్రకటితమైంది.

అర్థం : భక్తులను కాపాడే (మాలే) నీలమణివర్ణుడా (మణవణ్ణన్) ప్రళయకాలంలో మఱ్ఱి ఆకు మీద పవళించినవాడా (ఆలిన్ ఇలైయాయ్) మార్గళి స్నానం చేయడం కోసం (మార్గళి నీరాడువాన్) పెద్దలు (మేలైయార్) చేసే అనుష్టాలకోసం (సేయ్ వనగళ్) కావలసిన ఉపకరణాలు (వేండువన) మీరు వింటే చెబుతాము (కేట్టియేల్) ప్రపంచమంతా (ఞాలత్తైఎల్లామ్) వణికేట్టు (నడుంగ) ధ్వనిచేసే (మురల్వన్) పాలరంగును బోలిన (పాలన్న వణ్ణత్తున్) నీపాంచజన్యానికి తోడైన (ఉన్ పాంచచన్నియయే) శంఖాలను (శంగంగళ్) చాలా విశాలమైన (పోయ్ పాడు ఉడైయన) చాలా పెద్దవయిన (శాలపెరం) డక్కాలు (పఱై) తిరుపల్లాండు పాడే వారు (పల్లాండు ఇశైప్పార్) మంగళ దీపాలను (కోలవిళక్కు), ధ్వజాలను (కొడి) మేలకట్లను (వితానం) మాకు అనుగ్రహించండి (అరుళ్) మాలే అన్న పదప్రయోగం ద్వారా గోదాదేవి, గోపికలకు శ్రీకృష్ణుడిమీద ఉన్న ప్రేమ కన్నా శ్రీకృష్ణుడికి వారిమీద ఉన్న ప్రేమ చాలా రెట్లు ఎక్కువ అని వివరిస్తున్నారు. శ్రీకృష్ణుడు నాలో ఆశ్రిత వాత్సల్యం ఉందని మీరు ఏవిధంగా తెలుసుకున్నారంటే మణిదీపాల కాంతి దీపాలను దాటి దానంతటదే ప్రకాశించినట్టు మీ గుణం ప్రకాశిస్తున్నది మణివణ్ణా శ్రీ కృష్ణా అంటారు.

- మాడభూషి శ్రీధర్

Next Story