గోదా గోవింద గీతం : కీచకీచు పక్షుల కిలకిలల కలకలల తెల తెల్లవారు
Goda Govinda Geetham 6.పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
By M Sridhar
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
భావార్థ గీతిక
కీచకీచు పక్షుల కిలకిలల కలకలల తెల తెల్లవారు
గోపురశిఖరాల శంఖారావములు జనుల పిలుచు
మాయమాత పూతన స్తనవిషప్రాణముల పీల్చినాడు
కాలుజాడించి తన్ని శకటాసురుని లీల గూల్చినాడు
క్షీరసాగరశయను యోగనిద్రలో లోకాల కల్పించినాడు
యోగిహృధ్యానగమ్యు మునుల మనములమనెడువాడు
ఎక్కడకదులునోనయని ఎడదపట్టి రుషులు లేచినారు
భక్తితాపసుల హరిహరి ధ్వనులు వినుడు మేలుకొనుడు
ఆరునుంచి 15 దాకా పదిమంది గోపికలను, ఆళ్వారుల ప్రతీకలుగా భావించి మేలుకొలుపుతున్నారు. పెద్దలు తపస్వులు ఆలోచించిన కొద్దీ కొత్త కోణాలు ఆవిష్కారమయ్యే అద్భుత కవితలు గోదా పాశురాలు.
అర్థం : పుళ్ళుం =పక్షులు కూడా, శిలమ్బిన కాణ్ = కూయుచున్నవి కదా, పుళ్ళరైయన్ =గరుడవాహనుని, కోయిలిల్ =కోవెలలో, వెళ్ళై =తెల్లని, విళి శంగిన్ =ఆహ్వానిస్తూమోగే శంఖపు, పేరరవం= పెద్ద శబ్దమును కూడా, కేట్టిలైయో=వినబడడం లేదా, పిళ్ళాయ్! =ఓ చిన్నారీ, ఎళుందిరాయ్ = లేవమ్మా, పేయ్ =పూతన యొక్క, ములై =స్తనములోని, నంజుండు= విషము తీసుకుని, కళ్ళచ్చగడం =కృత్రిమ శకటపు, కలక్కళియ =కీళ్లు విరిగేట్టు, క్కాలోచ్చి=కాలుచాచి ధ్వంసం చేసి, వెళ్ళత్తరవిల్ = పాల సముద్రంలో శేష శయనంపై, తుయిల్ అమరంద =యోగనిద్రలో అమరియున్న, విత్తినై = జగత్కారణ భూతుడైన, ఉళ్ళత్తు క్కొండు= తమ మనసులో ధ్యానించి, మునివర్గళుం =మునివరులు, యోగిగళుమ్ = యోగి వరులు, మెళ్ల = మెల్లగా, ఎళుందు =లేచి అరి ఎన్ఱ = హరి హరి హరి అనే, పేరరవం= పెద్దధ్వని, ఉళ్ళం పుగుందు =మాలో ప్రవేశించి, కుళిరుందు =చల్లబరిచింది.
- మాడభూషి శ్రీధర్