గోదా గోవిందగీతం: పుడమి జీవరాశి బ్రతుక జీవధారలిచ్చు
Goda Govinda Geetham -4. ఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
By M Sridhar Published on 19 Dec 2022 5:05 AM GMTఆళిమళైక్కణ్ణా ! ఒన్రు నీకై కరవేల్
ఆళియుళ్ పుక్కు ముగున్దు కొడార్తేరి
ఊళిముదల్వ నురువమ్పోల్ మెయికరుత్తు
పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్
ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు
తాళాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్
వాళవులగినిల్ పెయ్ దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్ !
భావార్థ గీతిక
క్షార జలధి నావరించి అలల జలము పీల్చి గగనమెక్కి
జగత్కారకుడు, కాల స్వరూపుడు నల్లనయ్య రంగురాసి
గంభీర జలదము, మహనీయ సుందర బాహుదండుడైన
పద్మనాభు కుడిచేతి సుదర్శన చక్రంపు మెరుపు మెరిసి
స్థిరమైఎడమ దక్షిణావర్త పాంచజన్యంపు పిడుగులుమిసి,
ఆలసించక విష్ణు శార్ఞమ్మువిడిచిన శరపరంపరల విసిరి
పుడమి జీవరాశి బ్రతుక జీవధారలిచ్చు పర్జన్యదేవుమ్రొక్కి
మార్గళినోము స్నానాలు జేతము లేచి రారండు లేమలార.
చక్రమువలె మెరసి, శంఖమువలె ఉరిమి, శార్జ్గ్ మనే విడిచే బాణముల వర్షం లోకమంతా సుభిక్షంగా ఉండేట్టు మార్గశీర్ష స్నానము చేసేట్టు గా వర్షాన్ని కురిపించు
అర్థం : ఆళి = సముద్రంల వలె గంభీరస్వభావంగల, మళైక్కణ్ణా = వర్షాలకు అధిపతియైన వరుణదేవా, నీ ఒన్రు = నీవు ఇసుమంతైనా, నీ = నీవు, కై కరవేల్ = దాచుకోవద్దు, ఆళియుళ్ = సముద్రంలోపల, పుక్కు = చొరబడి, ముగున్దు కొడు = అక్కడున్న నీటిని, ఆర్తు = మేఘ గర్జనలుచేస్తూ, ఏఱి =ఆకాశంలో వ్యాపించి, ఊళిముదల్వన్ = కాలము వంటి అనేక చరాచర పదార్థాలకు కారణ భూతుడైన నారాయణుని యొక్క, ఉరువమ్పోల్ = శరీరం వలె, మెయికరుత్తు= శ్యామవర్ణ శరీరంగా, పాళియందోళుడైయ = మహనీయమూ, మనోహరమూ అయిన భుజస్కందాలు కలిగిన వాడు, పర్పనాబన్ కైయిల్ = పద్మనాభుని దక్షిణ హస్తమందున్న, ఆళిపోళ్ మిన్న =చక్రాయుధం వలె మెరుపులు మెరిపించి, వలమ్బురి పోల్ = దక్షిణావర్త శంఖమైన పాంచజన్యం వలె, నిన్రదిరిన్దు =స్థిరంగా నిలిచి ఘోషించి, తాళాదే = ఆలస్యం చేయకుండా, శార్ జ్ఞ్గ =పరమాత్ముడి విల్లైన శాజ్ఞ్గమ్, ముదైత్త శరమళైపోల్ =వేగంగా కురిపించి బాణముల వర్షం వలె, వాళవులగినిల్ = విశ్వంలోని సకల జీవరాశి జీవించడానికి, నాంగళుమ్ = వ్రతాన్ని ఆచరించే మేమూ, మగిళిన్దు = సంతోషంతో, మార్గళి నీరాడ = మార్గళి స్నానం చేయడానికి, పెయ్ దిడాయ్ = వర్షాన్ని కురిపించాలి.
- మాడభూషి శ్రీధర్