గోదా గోవిందగీతం : మనసు నొప్పించు విరుపులొద్దు

Goda Govinda Geetham 2.వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు

By M Sridhar
Published on : 17 Dec 2022 2:00 AM

గోదా గోవిందగీతం : మనసు నొప్పించు విరుపులొద్దు

వైయత్తు వాళ్వీర్గాళ్ నాముమ్ నమ్బావైక్కు

శెయ్యుమ్ కిరిశైగళ్ కేళీరో, పాఱ్కడలుళ్

పైయ త్తుయిన్ఱ పరమ నడిపాడి,

నెయ్యుణ్ణోమ్ పాలుణ్ణోమ్ నాట్కాలే నీరాడి,

మైయిట్టెళుదోమ్ మలరిట్టు నాముడియోమ్

శెయ్యాదన శెయ్యోమ్ తీక్కురళై చ్చెన్ఱోదోమ్,

ఐయముమ్ పిచ్చైయు మాన్దనైయుమ్ కైకాట్టి,

ఉయ్యుమాఱెణ్ణి ఉగన్దేలో రెమ్బావాయ్

భావార్థ గీతిక

వినుడు సౌభాగ్యసుదతులార, ఇది ఇడుముల బెట్టువ్రతముకాదు

పరమానందబ్రహ్మము చేర్చునోము నియమాలు తెలియరండి

పాలకడలి నాథుడి పాలు మనము, వేరు పాలు మనకేలమగువలార

కృష్ణయ్య నెయ్యము సాధింప నెయ్యి మానుదాము పూబోడులార

తెల్లారి స్నానాలు కద్దు, పూలు కాటుకల సొబగులొద్దు

చేయరాని పనులు వద్దన్న చేయకుండుటె మేలు, చాడీలు,

మనసు నొప్పించు విరుపులొద్దు, హితవులు వినడమే మనకు మంచి

దానధర్మాలతో నడచి దామోదరుని చేరుటే మన తిరునోము దారి.

హరికథలు అనే పాలు పెరుగు ఉంటే వేరే పాలు పెరుగు ఎందుకడుగుతారు. తొలి గీతం లో గోపికలను పిలిచిన గోదమ్మ రెండో గీతంలో మొత్తం అందరనీ పిలుస్తున్నారు.

అర్థం : 'వైయత్తు వాళ్ వీర్ గాళ్', ఈ భూమిమీద ఆనందంగా ఉండాలనుకుంటే రండి. 'నాముం నంపావైక్కు..' ఈ వ్రతం కష్టపెట్టడానికి కాదు, 'శెయ్యుం కిరిశైగళ్ కేళీరో..' ఏంచేద్దామో వినండి.. 'పాఱ్కడలుళ్ పైయత్తు యిన్ఱ పరమనడిపాడి...' పాలకడలి లో సుకుమారంగా శయనించి ఉన్న వైకుంఠ నాథుడి పాదాలను పట్టుకుందాం

'నెయ్యుణ్ణోం పాలుణ్ణోం' నెయ్యీ వద్దు, పాలూ వద్దు. 'నాట్కాలే నీరాడి'తెల్లారుజామున స్నానం చేద్దాం. 'మైయెట్టుళుదోం మలరిట్టు నాం ముడియోమ్...' కనులకు కాటుక పెట్టుకోం కొప్పులో పూలు ముడవం...విలాసాలువదిలేద్దాం. 'శెయ్యాదన శెయ్యోం' చెయ్యకూడదని పెద్దలుచెప్పినవి చెయ్యం. 'తీక్కుఱళైచ్చెన్ణోదోమ్' మరొకరి మనసు కష్టపెట్టే పుల్లవిరుపు మాటలు మాట్లాడం, 'ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి', చేతనైనంత వరకు దానాలు చేస్తాం. 'ఉయ్యమాఱెణ్ణి ఉగంద్ ..' ఈ పనులన్నీ ఆనందంతో చేస్తాం..

- మాడభూషి శ్రీధర్

Next Story