గోదా గోవింద గీతం : వేదాలు చదివి సాధించిన మహిళ గోద
Goda Govinda Geetham 1.తెలుగు కన్నడ మలయాళ భాషల సముదాయాన్ని ద్రవిడ భాషలన్నారు.
By M Sridhar Published on 16 Dec 2022 10:11 AM ISTతెలుగు కన్నడ మలయాళ భాషల సముదాయాన్ని ద్రవిడ భాషలన్నారు. దక్షిణాన ఎనిమిదో శతాబ్దం లేదా అంతకుముందు అంటే క్రీస్తు శకము ఆరో శతాబ్దంనుంచి తమిళ ఆళ్వారులు భక్తి ఉద్యమ నాయకులుగా ఉన్నారు. స్త్రీలు, శూద్రులు, అస్పృశ్యులు వేదాలు చదువుకోవడానికి వీల్లేదనే పద్ధతులను కాదని నిర్ద్వంద్వంగాచెప్పిన ఉద్యమం భక్తి ఉద్యమం. అందులో అగ్రగామి గోదాదేవి, ఆండాళ్ అనికూడా అంటారు. అందరికీ సులభంగా అందడమే భగవంతుడిన సార్వజనీన లక్షణమనీ ఆళ్వార్లు, గోదాదేవి, రామానుజులు చాటిచెప్పారు.
భక్తి సిద్ధాంతం ఇదివరకే ఉందనీ, అసలు సూత్రం అదేనని, తరువాత వచ్చిన విభేదాల వల్ల ఆ సిద్దాంతాన్ని రామానుజుడు బసవేశ్వరుడు వంటి ఆచార్యులు ప్రత్యేకంగా చెప్పవలసి వచ్చిందని అంటారు. భక్తి ఉద్యమం చాందస బ్రాహ్మణులపైన విప్లవం కాదని, అగ్రవర్ణాలపై యుద్దం కాదని, సంస్కృత భాషపైన ద్వేషం కాదని షెల్డన్ పోలాక్ అంటారు.
ముఫ్ఫయ్ పాశురాలనే ఎనిమిది పాదాల కవితలలో వేద సారాన్ని ఆమె చాలా అలతి పదాల్లో నింపారు గోద. రామాయణ భాగవత కథాంశాలను జోడిస్తూ శ్రీవిల్లి పుత్తూరు అనే తన సొంత ఊరిని, ద్వాపర యుగం నాటి వ్రేపల్లెగా భావించి తానే రాధ గా మారి శ్రీ కృష్ణప్రేయసి గా మారి వటపత్రశాయి అర్చా మూర్తి ద్వారా శ్రీరంగనాథ అర్చామూర్తి రూపంలో ఉన్న నారాయణుని చేరడానికి తిరుప్పావైని నిచ్చెనగా మార్చుకున్నారు.
గోదాదేవి తన పిన్న వయసులోనే భక్తి సాగరంలో ఓలలాడి, తండ్రి పెరియాళ్వార్ నుంచి భక్తిని వారసత్వంగా పొందినట్టు పూమాలలతో పామాల (పాశురాల మాల)లతో కైవల్యానికి బాటలు వేసుకున్న భక్తురాలు.
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందొళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్
భావార్థ గీతిక
మార్గశీర్షపు వెన్నెలలోన తెల్లవారకమున్నె యముననీట
భక్తి భాగ్యాల మునిగితేల రారండు, వ్రేపల్లె పడుచులార
వేలాయుధమ్ముదాల్చి నందనందనుడదిగో నిలిచినాడు
వేయికన్నులార్పక కాచు వేలుపతడని తెలియరో కొమ్మలార
యశోద ఒడిలోని కొదమసింగము వాడు, కలువకన్నుల రేడు
కారుమబ్బుమేనివాడు, చంద్రసూర్య చలువకాంతుల జల్లువాడు
వరద వాత్సల్యగుణాభిరాముడు నారాయణుడు, నెల నోము పట్టి
కలిసి భజింతము రండు, పరై వరాల కలిమి కైవల్యమిచ్చునతడు
నారాయణుడే వ్రతం, నారాయణుడే వ్రతఫలం అని చెప్పే పాశురం మార్గళి తొలి గోదా గోవింద గీతం.
అర్థం : ఇది మార్గళినెల (మార్గళి త్తింగళ్) చంద్రుడు పదహారుకళలతో పూర్తిగా వికసించిన మంచిరోజు (మది నిఱైంద నన్నాళాల్) స్నానం చేయదలిచిన వాళ్లు (నీరాడ ప్పోదువీర్) రండి (పోదుమిన్) అందమైన ఆభరణాలు ధరించిన సుదతులారా (నేరిళైయీర్) సిరిసంపదలతో కూడిన (శీర్ మల్గుం) గొల్లపల్లెలోని (ఆయ్ ప్పాడి) భగవదనుగ్రహమనే సంపదను, ధనధాన్యాలనే సంపదను (శెల్వచ్చిఱుమీర్గాళ్) వాడియైన శూలం ధరించి (కూర్వేల్) శ్రీకృష్ణుడికి హాని చేయదలిచిన దుర్మార్గులను క్రూరంగా నిర్జించే (కొడుందోళిలన్) నందగోపుని కుమారుడు (నందగోపన్ కుమరన్) అందమైన నయనాలతో కూడి (ఏరారంద కణ్ణి) తల్లి యశోదకు (యశోదై) సింగపు పిల్లవంటివాడు (ఇళమ్ శింగం) నల్లని మేని రంగు కలిగి (కార్మేని) కెందామరల తో పోలిన కన్నులు (చ్చెంగణ్) ప్రకాశంలో సూర్యుడిని (కదిర్) చల్లదనంలో చంద్రుడిని (మదియం) పోలిన ముఖ బింబము గలవాడు (పోల్ ముగత్తాన్) భగవానుడైన శ్రీమన్నారాయణుడే (నారాయణనే) పఱై అనే వాయిద్యాన్ని మన అభీష్ఠాలను (పఱై) ప్రపంచంలోని ప్రజలంతా (పారోర్) ప్రశంసించే విధంగా (పుగళ ప్పడిందు) ఈ వ్రతంలో పాల్గోనే విధంగా పావై వ్రతాన్ని అనుష్టించడానికి సిద్ధంగా ఉన్నమనకు (ఎమ్బావాయ్ నమక్కే) అనుగ్రహిస్తాడు (తరువాన్).
- మాడభూషి శ్రీధర్