రాశిఫలాలు డిసెంబర్ 1 నుంచి 7 వరకు

By అంజి  Published on  2 Dec 2019 2:45 PM GMT
రాశిఫలాలు డిసెంబర్ 1 నుంచి 7 వరకు

మేష రాశి :

ఈ రాశివారికి సప్తమంలో కుజ బుధులు ఆలోచనలను భిన్నం చేస్తూ ఉంటారు. ఒకరు చెడుకి ఒకరు మంచికి అన్నట్టుగా దారితీసి ఆందోళనలో పెడతారు . అష్టమ మందున్న రవి ఆరోగ్యాన్ని సరి చూసుకోమని హెచ్చరిస్తూనే ఉంటాడు. అయితే భాగ్యంలో శుక్ర కేతు గురుశనులు కలయిక ఒక విధంగా మంచి చెడుల ఆందోళన నుండి బయటకు పడేసే ప్రయత్నం చేస్తారు. స్వక్షేత్ర అధిపతి గనుక కుజుడు అంతో ఇంతో మేలు చేస్తాడు అని అశించాలి. కాలసర్ప దోషం వీరికి బాగా వర్తిస్తుంది. అందుకే వీళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. నిందారోపణలను ఎదుర్కోవలసి వస్తుంది. అశ్వని వారికి కలల రూపంలో భయం వెంటాడుతుంది. శకునములు నమ్మేవారికి ఈ వారం అనుకూలంగా లేనట్టు ముందే తెలుస్తుంది. అశ్వని వారికి ఈ వారం అనుకూలత తక్కువ భరణి వారికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కృత్తికా ఒకటో పాదం వారికి చిన్న అనారోగ్యం సూచిస్తుంది.

పరిహారం : మంగళవారం నియమాలు పాటించండి. ఆంజనేయస్వామిని, 2 వతేదీ సుబ్రహ్మణ్య షష్ఠి స్వామిని పూజించండి సత్ఫలితాలు వస్తాయి.

వృషభరాశి :

ఎవరు ఏం మాట్లాడినా తన గురించి అన్నట్టుగా భావిస్తారు. ఎక్కువగా మిత్రుల మీద ఆధారపడతారు. ఆరోగ్య విషయంలో బాగా దెబ్బ తిన్నారు.ఈ రాశివారికి అష్టమంలో శుక్రుడు ధన స్థానంలో రాహు మేలు చేసినా చేస్తాడు. వీరికి గురు బలం, దైవబలం రెండూ కొద్దిగా తగ్గింది. తగు ప్రయత్నంతో కోర్టు వ్యవహారాల్లో మాత్రం కొంత విజయం చూడగలరు. కాలసర్ప యోగం వల్ల వీరికి ఎటువెళ్లినా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కృత్తికా మూడు పాదాల వారికి జన్మ తార కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. రోహిణి వారికి పరమ మిత్రతార అనుకూల్యత ఉంది.మృగశిర రెండు పాదాల వారికి మిత్రతార తో వారం ప్రారంభం కనుక బాగున్నది.

పరి హారం : సూర్యనమస్కారాలు, యోగ సాధన మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఉలవలు నానబెట్టి ఆవుకు తినిపించండి.

మిథున రాశి :

ఈ రాశివారికి లగ్నంలో రాహువు సప్తమంలో ఉన్న గురు శుక్రులు కొంత మేలును చేకూరుస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. పుణ్య కార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. అలా చేయడం వల్ల రాహు దోషం కూడా తగ్గుతుంది. పంచమంలో ఉన్న కుజుడు పిల్లల ఆరోగ్యం పట్ల హెచ్చరికలు సూచిస్తున్నాడు. మీ మాటకి పదునెక్కువ గనుక బంధు వర్గాలతోనూ స్నేహితులతోనూ ఆచితూచి మాట్లాడండి. వ్యాపారాలకు కొద్దిగా అనుకూలత తక్కువగా ఉంది. ఆలోచించి అడుగు వేయండి గురువులతో దైవసమానులతోను వాగ్వాదనలు చేయకండి. మృగశిర రెండు పాదాల వారికి చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. ఆర్ద్ర వారికి నైధన తారయింది. కావున ఈ వారం అన్ని విధాలా చెడు ఫలితాన్ని చవి చూసి నిందారోపణలు ఎదుర్కొంటారు. పునర్వసు వారు మాత్రమే మంచి ఫలితాల్ని చూడగలుగుతారు.

పరిహారం : సుబ్రహ్మణ్య షష్టి రోజు బ్రాహ్మణులకు ఎర్రని వస్త్రము, కందులు దానం చేయండి ఉపశమనం లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి.

కర్కాటక రాశి :

ఈ రాశి వారికి గురు బలం తక్కువగా ఉంది ఎవరితో మాట్లాడినా కార్య సఫలత తక్కువవుతుంది. ఆత్మస్థైర్యం మనోధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది . తల్లిదండ్రులతో విరోధం తెచ్చుకోకండి . ఈ వారంలో మీ శ్రమకు తగ్గ ఫలితం కనిపించకపోవచ్చు. అనవసరమైన వ్యయములు జరగడం వల్ల మీకు అందవలసిన రాబడి కూడా అందక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. కానీ ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు ఆదుకుని మిమ్మల్ని గట్టెక్కిస్తారు. పునర్వసు వారికి ఫలితాలు బాగున్నాయి పుష్యమి వారికి ప్రత్యక్ తార తో వారం ప్రారంభం గనుక అనుకూల ఫలితాలు తక్కువ. ఆశ్రేష వారికి మాత్రమే అనుకూలమైన రోజులు అని చెప్పొచ్చు మీరు అనుకున్న పని దిశగా అన్ని ప్రయత్నాలు తెరిచిన ద్వారాల్లా కనిపిస్తాయి.

పరిహారం: దేవీ సూక్త పారాయణ లేదా దేవి స్తోత్రాలు మీకు మంచి బలాన్ని ధైర్యాన్ని ఇస్తాయి.

సింహ రాశి :

ఈ రాశివారికి కొంత అనుకూలత ఉన్నట్లు చెప్పాలి తృతీయ మందు కుజ బుధులు మేలు చేస్తారు తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. స్వక్షేత్రంలో గురుడు మేలు చేయగా శత్రు క్షేత్రంలో ఉన్న శుక్రుడు అదే స్థాయిలో వ్యతిరిక్తంగా ప్రవర్తించే అవకాశం ఉంది కాబట్టి ఏ ఆలోచనైనా నిదానంగా చేయండి. పిల్లలు విషయంలో కొంచం జాగ్రత్త వహించండి. అలాగే లాభస్థాన రాహువుపై గురు దృష్టి చక్కగా పనిచేసి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారం వీరికి సృహా సృహ మిశ్రమం అని చెప్పొచ్చు. పంచమంలో కేతువు పిల్లల్లో భక్తి భావాన్ని నెలకొల్పి వారి సమస్య వారే పరిష్కరించినట్టు చదువులో ఒక అడుగు ముందుకు వేసే అవకాశం ఉంది .మగవారికి ఈ వారం విపత్తార తో ప్రారంభమవుతుంది వెనుక కొంచెం ప్రతికూల వాతావరణం నుండి అదే పువ్వు వారికైతే వాహన యోగము లేదా ధన యోగం ఉంది ఉత్తర ఒకటో పాదం వారికి మాత్రమే జన్మతార అయ్యింది కనుక శుభాశుభ మిశ్రమ ఫలితాలు వర్తిస్తాయి.

పరిహారం : వీరు మన్యుసూక్త పారాయణ లేదా ఆంజనేయ దండకం పట్టించడం వల్ల అశుభ ఫలితాలు తగ్గుతాయి .

కన్యా రాశి:

ఈ రాశివారికి చిత్రంలో ఉన్న గురుడు స్వక్షేత్ర వర్తి మేలుని చేస్తున్నాడు .ఆర్థికంగా లాభం పొందే అవకాశం ఉంది. చతుర్థ స్థానం స్థిరంగా ఉండటం వల్ల వీరి ఆలోచనలన్నీ స్థిరంగా ఉంటాయి. ఏ చిన్న పని చేసినా దానికి భవిష్యత్తులో మంచి ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. పుణ్యక్షేత్ర సందర్శనం చేయొచ్చు లేదా వ్రతములు ఉద్యాపన లలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది.ఒక విధంగా మంచి రోజులు రాబోతున్నాయి. ఇదిచక్కని పరిణామానికి శుభవార్తకి అవకాశం ఇస్తుంది.

ద్వితీయ మందున్న కుజ బుధులు వీరికి వీరి ఆలోచనలకి కూడా స్థిరత్వాన్ని కలిగింప చేస్తారు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి అననుకులం. హస్త వారికి మాత్రం కొంచెం అనుకూలత కనిపిస్తోంది. చిత్త ఒకటి రెండు పాదాల వారికి మంచి ఫలితాలు చేకూరనున్నాయి .

పరిహారం: వీరు రామ నామాన్ని జపించినా, శంకరుని స్తోత్రం జపించిన చక్కని ఫలితాల్ని చూడగలుగుతారు .

తులారాశి :

ఇది శుక్రుని క్షేత్రము బుధుడు మిత్రుడు కుజుడు సముడు . వీళ్లిద్దరు ఈ క్షేత్రంలో ఉండటం వల్ల ఏమైనా ఈ రాశివారికి మేలు చేయాలనే ప్రయత్నం చేస్తారు . ధనస్థాన రవి లాభ అధిపతి కాబట్టి ఆర్థికమైన లాభాన్ని పొందుతారు. తృతీయ మందున్న గురుడు కూడా మేలే చేయబోతున్నాడు. గురుని బలంతో ముందుకు సాగుతారు. దైవబలం కూడా వీరికి తోడవుతుంది క్రమక్రమంగా వీరు అభివృద్ధిని పొందే అవకాశం ఈ వారంలో ఉంది . మీకు అందరూ అనుకూలించి మేలు చేయడానికి సహకరించడానికి మానసికంగా శారీరకంగా సంసిద్ధులు అవుతారు . చిత్త మూడు నాలుగు పాదాల వారికి సత్ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. స్వాతి వారికి కొద్దిగా వ్యతిరేకత ఫలితాలు కనిపిస్తాయి. విశాఖ మూడు పాదాల వారికి కార్య సాధన మార్గాలు లభించి ముందుకు సాగుతారు.

పరిహారం: ఎర్ర వస్త్రాన్ని ధరించడము, సుబ్రమణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవడం, సుబ్రమణ్య షష్ఠినాడు విధిగా స్వామి దర్శనం చేసుకోండి మంచి జరుగుతుంది .

వృశ్చిక రాశి :

వీరికి లగ్నంలో రవి ఉండడం కుజ బుధులు కూడా వ్యయ మందుండడం ఈ వారంలో అనారోగ్యం పొడసూపుతోంది . ద్వితీయ ముందున్న గురు శుక్రులు ఆధ్యాత్మిక ఆలోచన ద్వారా, వైదిక ధర్మం ద్వారా, దైవ సంబంధ కార్యాల ద్వారా మీకు ప్రశాంతతను కలుగజేస్తారు. ఇప్పుడిప్పుడే ద్వితీయ శని ప్రభావం తగ్గుతుంది కనుక మరికొంచెం ఉత్సాహం మీలో పెరుగుతుంది .పంచమ అధిపతి అయిన గురుడు స్వక్షేత్రంలో ఉండడం ఇంట్లో కల్యాణ ప్రదమైన కార్యక్రమాలకి అవకాశం ఉంది . సప్తమ అధిపతి అయిన శుక్రుడు శత్రు క్షేత్రంలో ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య కొద్ది అభిప్రాయ భేదాలు ఉంటాయి. పిల్లల విషయంలో జాగ్రత్త వహిస్తారు. ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం . జ్యేష్ట వారికి అనుకున్న పనులన్నీ నెరవేరే అవకాశం ఉంది. విశాఖ వారికి కూడా మంచి ఫలితాలున్నాయి. అనురాధ వారికి ఫలితం మిశ్రమము, అనారోగ్య సూచన .

పరిహారం : రోజూ దైవ దర్శనం చేసుకోవడం అవసరం. శనివారం నాడు శనికి జపం శుక్రవారం శుక్రునకు జపం మంచి ఫలితాన్ని ఇస్తాయి.

ధనూ రాశి:

ఈ రాశివారికి గురుడు స్వక్షేత్ర వర్తి అవడం చాలా సహకరాన్ని ఇవ్వబోతున్నాడు. తను స్థానంలో శని వ్యయస్థానంలో రవి ఉండడం వల్ల వీరికి కానీ వీరి కుటుంబ సభ్యులు గాని అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఎవరో ఒకరు హాస్పిటలైజ్ అయి అవకాశాలున్నాయి. లాభంలో ఉన్న కుజులు వీరి కొంత మేలు చేసినప్పటికీ తను స్థానంలో ఉన్న శని ప్రభావం వీరిపై పనిచేస్తుంది. బుద్దిమాంద్యం అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇలాంటివి ఉంటాయి . దానివల్ల ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంది పుణ్యక్షేత్ర సందర్శనం గాని పూజా కార్యక్రమాల్లో గానీ పాల్గొంటారు . మూలా నక్షత్ర జాతకులకు విపత్తార గనుక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పూర్వాషాఢ వారికి ఉత్తమ ఫలితాలు. ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి అనారోగ్య సూచన ఉంది .

పరిహారం : నిత్యం మీరు చేస్తున్న పూజలతో పాటు దత్తాత్రేయ లేదా షిర్డిసాయి చరిత్ర పఠనం చేయండి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు గురువారం మంచిది .

మకర రాశి :

ఈ రాశివారికి ఈ వారంలో వ్యతిరేక ఫలాలు రావడానికి కారణం ఒకటి ఏలినాటి శని ప్రభావము రెండు కాలసర్ప యోగ దోషం . చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి సప్తమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉండటం వల్ల నాలుగు రోజుల వరకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత ప్రతి పని వెనుకబడటం తలపెట్టిన ప్రతి కార్యంలోనూ వ్యతిరేక ఫలాన్ని పొందనున్నారు. ఏ విషయంలో కూడా తొందరపడకుండా ఆలోచించనిదే ముందుకు వెళ్లకండి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఏవీ లేవు. మీరు పోగొట్టుకున్న సంపదలు కూడా ఈ సమయంలో వచ్చే అవకాశాలు చేజార్చుకున్నారు. దైవారాధన తప్ప మీకు ఇంకో శరణ్యం లేదు. ఎవరిని పట్టుకున్న వారు మీ పట్ల వ్యతిరేక భావాన్ని చూపిస్తారు . మొత్తం మీద ఈ రాశివారికి హెచ్చరికలు ఎక్కువగా ఉంటాయి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి అనారోగ్య సూచన. శ్రవణం వారికి ఏదైనా లబ్ధిపొందే అవకాశం ఉంది. ధనిష్ట వారికి చాలా అనుకూలమైనటువంటి సుఖ ఫలితాలు కనిపిస్తాయి .

పరిహారం : ప్రతిరోజూ శివుని ఆరాధన చేయండి. రెండవ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి ఆయన ప్రీతిగా క్షీరాభిషేకం తేనెతో అభిషేకం గాని జరిపించండి మంచి ఫలితాలు పొందుతారు శనికి జపం తప్పనిసరి .

కుంభ రాశి :

ఈ రాశివారికి చాలా శుభ ఫలితాలు ఆసన్నమవుతాయని చెప్పొచ్చు . అందులో మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అన్ని వ్యవహారాలు చక్క బరుచుకునే అవకాశం కనిపిస్తోంది. మంచి ఫలితాలని చేజిక్కించుకోవడమే మీ అదృష్టంగా భావించవచ్చు. ఎన్నాళ్ళనుండో పరిష్కారం కాకుండా ఉండిపోయిన చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలైతే ఉన్నాయి . మీరు ఎక్కువగా ఆలోచించక్కర్లేదు. మీ గురించి మీ నాయకత్వాన్ని గూర్చి చాలా మంది ఎదురుచూస్తుంటారు. మీకు ఏ సహాయం చేయగలమా అని కూడా చూసిన వాళ్లున్నారు . అయితే మానసిక ఆందోళన మాత్రం నాలుగు రోజుల వరకు తప్పదు. గురువారం నుండి బాగుంటుందని చెప్పొచ్చు. ధనిష్ఠ పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి శుభఫలితాలు కనిపిస్తున్నాయి. శతభిషం వారికి మాత్రమే వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి.

పరిహారం : దధి చంద్ర దానం (పెరుగు వెండి చంద్రుని) బ్రాహ్మణునికి దానం ఇవ్వండి . స్వయం పాకం దానం బ్రాహ్మణునికిస్తే మంచి జరుగుతుంది. ఈ రెండు పనులు సోమవారం నాడు చేయండి .

మీన రాశి :

ఈ రాశివారికి చాలా మంచి రోజులు ఉన్నాయి. కానీ కాలసర్ప దోషం మాత్రం వర్తించ బోతోంది. భాగ్యంలో రవి మేలు చేస్తాడు. రాజ్యంలో గురుశనులు కూడా వీరికి మేలు చేయబోతున్నారు. శుక్రుడు శత్రు క్షేత్రంలో ఉండటం మాత్రమే కొంచెం ఇబ్బందికి కారకం. రాశ్యాధిపతి గురుడు స్వక్షేత్ర వర్తి కావున మేలు చేయబోతున్నాడు. మంచి విషయాలు వింటారు ఉద్యోగంలో గాని వృత్తి వ్యాపారాల్లో గాని చురుగ్గా పనిచేస్తారు . అప్పుడప్పుడు చిన్న ఇబ్బందులు కలిగిన పర్వాలేదని చెప్పచ్చు . శారీరక శ్రమ మాత్రం ఎక్కువగా ఉంటుంది . మానసిక ఆందోళన కొద్దిగా తగ్గే అవకాశాలున్నాయి. అష్టమ కుజుడు మాత్రం అమూల్య వస్తువుని లేదా మంచి మిత్రుణ్ని దూరం చేసుకునే అవకాశం కనిపిస్తోంది . మీ మాట్లాడే తీరు బాగుంటే మీ తీరు బాగుంటుంది . ఆచితూచి మాట్లాడండి మంచి పనులపై దృష్టి పెట్టండి . దైవచింతన కలిగి ఉండండి . పూర్వాభాద్ర ,రేవతి వారికి శుభ ఫలితాలు ఎక్కువ .ఉత్తరాభాద్ర వారికి శుభాశుభ మిశ్రమం .

పరిహారం : గురువారం గురుచరిత్ర పారాయణ శుభంకరం. నానబెట్టిన బబ్బుర్లు బెల్లం శుక్రవారం ఆవులకు తినిపించండి.

Next Story