రాశి ఫలాలు డిసెంబర్ 22 నుంచి 28 వరకు

By జ్యోత్స్న  Published on  22 Dec 2019 5:46 AM GMT
రాశి ఫలాలు డిసెంబర్ 22 నుంచి 28 వరకు

మేష రాశి :

ఈ రాశివారికి సప్తమంలో కుజ చంద్రులు ఉండటం వల్ల కొద్దిపాటి మనశ్శాంతి లభిస్తుంది. కానీ తొమ్మిదవ ఇంట్లో ఇరవై ఐదవ తేదీన కలవనున్న ఆరు గ్రహముల ప్రభావం చేత మనశ్శాంతి తగ్గుతుంది. ఆలోచనలు ఎక్కువవుతాయి. తృతీయ మందున్న రాహువు కొంత మనశ్శాంతిని కలిగించినా సంపూర్ణ సూర్య గ్రహణ ప్రభావం వీరిపైనా కూడా ఉంటుంది. దానివల్ల ఈ వారంలో వీళ్లు అనుకొన్న పనులను సులభంగా సాధించలేరు. అతి వ్యయ ప్రయాసలతో వారాంతంలో కాస్తంత శుభ ఫలితాలని పొందుతారు. ఏదిఏమైనా ఈ రాశివారికి మిత్ర క్షేత్రంలో చంద్రుడు సంచరించి నప్పుడు మాత్రమే అనగా వారం మధ్యలో కొంత మేరకు మేలు జరుగుతుంది . వాక్ స్థానాధిపతి అయిన శుక్రుడు దశమంలో ఉన్నందు వల్ల కుటుంబపరంగా ధన పరంగా పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు. సంతానానికి అనారోగ్య సూచనలు ఉన్నాయి. పితృస్థానం కూడా అనుకూలంగా లేదు. కుటుంబ ఆరోగ్య విషయాలు గమనించండి .అశ్వని వారికి దైవ కృప పనిచేస్తుంది. భరణి వారికి కార్యసాధన యోగం ఉంది .కృత్తిక ఒకటో పాదానికి వ్యతిరేక ఫలాలు చాలా ఎక్కువగా ఉన్నాయి .

పరిహారం : సూర్య నమస్కారాలు చేయండి. యోగ సాధన చేయండి. ఆదివారం నియమాన్ని పాటించండి.

వృషభ రాశి :

ఈ రాశివారికి సప్తమంలో ఉన్న చంద్రుడు కుటుంబ చిక్కులను మానసిక అశాంతిని కలిగిస్తున్నాడు. 8 వ ఇంట్లో ఇరవై ఐదో తేదీన కలవనున్న రవి గురు చంద్ర శని కేతు బుధులు ప్రభావం వీరి అనారోగ్యాన్ని సూచిస్తున్నాయి . దీర్ఘ రోగులకు ఔషధ సేవ చేసినా ఇబ్బందికరమైన పరిస్థితి. కుటుంబ వ్యవహారాల్లో కూడా కలత చెందుతారు. అనవసర వ్యయం జరగనున్నది. ఒక శుభవార్త మిమ్మల్ని ఆనందపడ చేయవచ్చు. లగ్నాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్న కారణంగా కొద్దిపాటి ధన లాభం లేదా సామాన్య ఉద్యోగ లాభం పొందుతారు. కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధన తారతో వార ప్రారంభం అవడం వల్ల వ్యతిరేక ఫలాలు ఎక్కువ. రోహిణి వారికి మిత్రతారతో వారం ప్రారంభ మవడం వల్ల చాలా శుభ ఫలితాలు పొందనున్నారు. మృగశిర ఒకటి రెండు పాదాలు వారికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి.

పరిహారం : ఈ వారంలో విష్టు సహస్త్రనామ పారాయణ లేదా ఖడ్గమాల పారాయణ ఉపకరిస్తాయి శుక్రవారం నాడు లేదా మంగళవారం అమ్మవారికి ఎర్రని కుంకుమతో పూజ చేయించండి ఉపకరిస్తాయి.

మిధున రాశి :

ఈ రాశివారికి సత్ఫలితాలు తగ్గనున్నాయి. ఈ వారంలో స్త్రీలతో సమస్యలను ఎదుర్కోనున్నారు. గురుడు స్వక్షేత్ర వర్తి అవడం వల్ల బుధుడు అదే స్థానం లోకి రావటం వల్ల మేలు జరుగుతుంది . కానీ రవికి గ్రహణం పట్టనున్నది గాన ఆ దగ్గరలో సంచరించే బుధుడికి కూడా దాని ప్రభావం వర్తిస్తుంది. కాబట్టి మీరు అతిజాగ్రత్త పడటం చాలా అవసరం. రుణ బాధలు శత్రు బాధలు కూడా మిమ్మల్ని వారం మధ్యలో ఇబ్బంది పెడతాయి. భోజన సౌఖ్యం కుటుంబ సౌఖ్యము తగ్గుతాయి. మీరు అనుకున్నది సాధించాలనే ప్రయత్నంలో ముందుకు సాగినా ఎటువంటి సత్ఫలితాలని పొందలేక పోవచ్చు. గ్రహణ ప్రభావం వీరిపైనా కూడా ఉంది.మృగశిర మూడు నాలుగు పాదాలు వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఆర్ద్ర వారికి మాత్రము అనారోగ్య సూచన స్త్రీ కష్టం కూడా ఉంది. పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి మాత్రమే సంపత్తారతో వారం ప్రారంభం కావున శుభ ఫలితాలు చేకూరనున్నాయి.

పరిహారం : నానబెట్టిన పెసలు బుధవారం నాడు ఉదయమే ఆవుకు తినిపించండి. విష్ణుసహస్ర నామ పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది .సూర్యుడి ప్రీతిగా దానధర్మాలు చేయండి .

కర్కాటక రాశి :

ఈ రాశివారికి రాశ్యాధిపతియైన చంద్రుడు నాలుగు రాశుల్లో సంచరించి విశిష్ట ఫలితాల్ని ఇవ్వనున్నాడు. వివాహ యోగ అనుకూలత ఉన్నది. వారాంతంలో శుభ ఫలితాలు ఉన్నాయి . గ్రహణ సమయంలో అతి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం . గురు మూఢం వల్ల వీరికి శత్రుపీడ ధన పీడ ఉన్నాయి . సకాలంలో అనుకున్న పనులు జరగకపోవడం రావలసిన వస్తు ద్రవ్యాలు అందకపోవడం ఉన్నది . మీ ప్రయత్న లోపాలు మీకే తెలుస్తూంటాయి . ఎదురు చూడని సమాధానం మిమ్మల్ని బాధిస్తుంది. ఆరోగ్యం కూడా ఒక విధంగా ఈ రాశివారికి కుడి భాగం ఇబ్బంది కలిగించవచ్చు. మానసిక ధైర్యం ఆత్మస్థైర్యం ఉంటే మాత్రమే మీరు ముందుకు వెళ్లగలరు. పునర్వసు నాల్గవ పాదం వారికి శుభ ఫలితాలు కలుగుతున్నాయి. పుష్యమి వారికి మాత్రము విపత్తారతో వారం ప్రారంభం గనుక వ్యతిరేక ఫలాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఆశ్లేష వారికి మాత్రమే సాధన తారతో వార ప్రారంభం కనుక విశేష ఫలితాలు పొందుతారు.

పరిహారం : ఈరాశి వారు లలితాసహస్ర నామ పారాయణ చేసిన శివునకు అభిషేకం చేసిన మంచి ఫలితాలను చూడగలరు.

సింహ రాశి :

ఈ రాశివారికి ఇంతవరకు పొందిన శుభఫలితాలు ఒక్కసారిగా ఈ వారంలో వ్యతిరేకంగా మారనున్నాయి. ఒక్కసారిగా అధికార రాజకీయ ఒత్తిడులు వీరిని ఇబ్బంది పెట్టనున్నాయి. రాశ్యాధిపతి అయిన రవికి కేతుగ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణం కారణంగా ఇరవై ఆరో తేదీ వీరికి క్లిష్టమైనదిగా చెప్పవచ్చు. పిల్లల ఆరోగ్యాలు చదువు ఉద్యోగం చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరికి షష్ఠంలో ఉన్న శుక్రుడు విస్రృతంగా ఫలితాన్ని ఇస్తాడు. కుటుంబపరమైన ఎడబాటు కొన్నాళ్లు తప్పదు. అష్టమ గురుడు కూడా వ్యతిరేక ఫలితాల్ని ఇవ్వనున్నాడు. అవసరమైతే దూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఇతరుల కోసం శ్రమపడటం తప్పదు. ఏదైనా విలువైన వస్తువును పోగొట్టుకునే అవకాశం లేదా కనిపించకుండా పోయే అవకాశము ఉన్నది. మీ పట్ల మీరు శ్రద్ధ వహించండి. మఘ వారికి ప్రత్యక్తారతో వారం ప్రారంభంగా వ్యతిరేక ఫలితాలు చాలా ఎక్కువ. పుబ్బవారికి మాత్రము సాధన తార గావున కార్య సాధనం చక్కగా జరుగుతుంది. ఉత్తర ఒకటో పాదం వారికి నైధన తారతో వారం ప్రారంభం వ్యతిరేక ఫలితాలు ఎక్కువ .

పరిహారం : సూర్య నమస్కారాలు చేయండి. వీలైతే సౌర పారాయణ, శివునకు రుద్రాభిషేకం విష్ణుకి విష్ణుసహస్రనామ పారాయణ చేయడం చాలా అవసరం.

కన్యా రాశి :

ఈ రాశివారికి బుధుడు తాత్కాలికంగా మేలు చేయనున్నాడు. కానీ చతుర్డ స్థానంలోకి వెళ్లినప్పుడు వ్యతిరిక్త ఫలితాలు కనిపించనున్నాయి. వీరికి అర్ధాష్టమ శని దోషం తో పాటు అర్థాష్టమ స్థానంలో సూర్యగ్రహణం కూడా మానసిక ఆందోళనల్ని ఎక్కువగా కలిగించనున్నాయి. వీరికి ఇది ఒక పరీక్షా కాలంగా భావించవచ్చును. అయినా మీరు ఆత్మస్థైర్యం కలవారైతే మాత్రమే చక్కగా కార్యసాధన చేసుకోగలరు. మాతృ పితృ స్థానాలకి అనారోగ్య సూచనలు సమస్యలు ఎదురవనున్నాయి . పిల్లలకు మాత్రం పర్వాలేదు . శాశ్వత ఫలితాలు ఇప్పుడు పొందే అవకాశాలు లేవు. కోర్టు వ్యవహారాలు గాని ఉద్యోగ లాభాలు గానీ పొందలేరు. ఉత్తర రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధన తారతో వార ప్రారంభం కనుక వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. హస్త వారికి మిత్రతార తో వారు ప్రారంభం గనుక కొద్దిపాటి సుమలతలు పొందుతారు చిత్త ఒకటి రెండు పాదాలు వారికి కూడా పర్వాలేదు .

పరిహారం : ధనుర్మాసం గనుక విష్ణు సహస్ర నామ పారాయణ లేదా శ్రీ మహావిష్ణు అర్చన సుదర్శన మంత్ర పఠనం చాలా సత్ఫలితాలను ఇస్తాయి.

తులా రాశి :

ఈ రాశివారికి కష్టాల నుండి బయటపడే సమయం కొద్దిగా ఆసన్నమవుతోంది. వీరికి శుభ ఫలితాలు ఇరవై ఐదో తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. వాక్స్థానాధి పతి ఐన కుజుడు స్వక్షేత్రంలో కి వెళ్ళడం వల్ల అతని ద్వారా ధనము కుటుంబము వాక్కు ఆధిపత్యం పొందనున్నారు.తృతీయ మందున్న ఆరు గ్రహాలు ద్వితీయమందున్న రెండు గ్రహాలు చతుర్ధ మందున్న రెండు గ్రహాలు మొత్తం వీరికి ఎనిమిది గ్రహాలు అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ వారంలో చెప్పలేనంత సౌఖ్యాన్ని ఆనందాన్ని మీరు పొందగలరు. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఇరవై ఆరో తేది మాత్రమే కించిత్ ఇబ్బంది కలగ వచ్చు. చిత్త మూడు నాలుగు పాదాలు వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. స్వాతి నక్షత్రం వారికి జన్మతార తో వారం ప్రారంభం కావున అనారోగ్యమో లేదా అప్పులో ఈ రెండింట్లో ఏదో ఒకటి భాధిస్తుంది.

విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు వారికి సంపత్తార తో వారం ప్రారంభానికి చాలా మంచి ఫలితాన్ని పొందగలరు .

పరిహారం : లలితా సహస్ర నామ పారాయణ గురు చరిత్ర పారాయణ శ్రీరామరక్షా స్తోత్రం మంచి ఫలితాలని శీఘ్ర ఫలితాన్ని ఇస్తుంది.

వృశ్చిక రాశి :

ఈ రాశివారికి స్వక్షేత్రంలో కుజుడు ప్రవేశించిన వెంటనే కొద్దిపాటి శుభఫలితాలని చవి చూడనున్నారు. మనః కారుకుడైన చంద్రబలం అదే మనోబలం కొద్దిగా తగ్గుతుంది. మానసిక ధైర్య స్థైర్యాలు తగ్గుతాయి. ద్వితీయ మందున్న గ్రహాలు తాత్కాలిక మిత్రులై అనుకూలించ నున్నాయి. అది తాత్కాలికమైనా శని ప్రభావం తగ్గిన మీదట ఫలితాలు ఎక్కువగా కనపడతాయి. ఋణ బాధలు మానసిక బాధలు కుటుంబ కలహాలు తప్పవు. అనవసరంగా వ్యయం జరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త వహిస్తే శుభ ఫలితం పొందగలరు .

మీకు ఏదో ఒక సమస్య మిమ్మల్ని పట్టి పీడించక తప్పదు .మీ వ్యక్తిత్వమే మిమ్మల్ని కాపాడాలి. మాటను అధీనంలో ఉంచుకోండి. దీనివల్ల సమాజం మీకు అనుకూలంగా మారుతుంది . విశాఖ నక్షత్రం నాలుగవ పాదం వారికి అనుకూలత ఎక్కువ. అనూరాధ వారికి ఈ వారం విపత్తార తో ప్రారంభం గనుక ప్రతి కూలతలే చవిచూస్తారు. జ్యేష్ట వారికి క్షేమ తారు కావున ఈవారం వారు మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పరిహారం : శివారాధన లాభిస్తుంది. సూర్య నమస్కారాలు చేయండి. లక్ష్మివారం నాడు సూర్యోదయం సరికి తెల్ల ఆవాలు బెల్లం కలిపి ఆవుకి తినిపించండి.

ధను రాశి :

ఈ రాశివారికి హెచ్చరికలు చాలా అవసరం. ఆరు గ్రహములు అదే రాశిలో కలవడం ఒకటైతే ఇదే రాశిలో మూలా నక్షత్రంలో చంద్ర సంచారంలో అమావాస్య నాడు కేతు గ్రస్త సంపూర్ణ సూర్య గ్రహణం ఈ రాశివారికి చాలా ఇబ్బందులు సూచిస్తోంది. చాలా విషయాల్లో మీకు ఎదురీత ఫలితాలే కనిపిస్తాయి. ఏ ఒక్కటీ అనుకూలంగా ఉన్నట్టు కాదు. పన్నెండు ఇంట్లో చంద్ర కుజ బుధ సంచారం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. వాహనాలు నడిపేటపుడు చాలా జాగ్రత్త వహించండి. ఇతరులకు మీ విలువైన వస్తువులు ఇవ్వడం అంత మంచిది కాదేమో. మధ్యవర్తిత్వం వహించకండి. సరియైన కారణం లేనిదే మీ పద్ధతులు మార్చుకోకండి. మంచి అయితే ఆచరించండి. మూలానక్షత్రం వారికి ప్రత్యక్ తార గావున ఫలితములు ప్రతికూలంగా ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు సాధన తార గావున కొద్దిపాటి శుభం కనిపించవచ్చు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వారికి నైధన తారతో వార ప్రారంభం కావడం ప్రతికూలతలు ఎక్కువ.

పరిహారం : గురువులను స్మరించండి గురు పాదుకా స్తవం చదవండి. గురు పూజ చేయండి. గురు చరిత్ర లేదా మేధా దక్షణా మూర్తి స్తోత్రము చేయండి .

మకర రాశి :

ఈ రాశి వారికి వ్యయ మందు 6 గ్రహాల సంచారం పూర్తి వ్యతిరేక ఫలితాల్ని సూచిస్తోంది. భాగ్యంలో ఉన్నా కుజుడు మేలు చేసినప్పటికీ వ్యయ మందు ఆరు గ్రహాలు ప్రతికూలంగా పనిచేసి అందునా సూర్యగ్రహణ ప్రభావం వీరిపై కూడా ఎక్కువ గా ఉంది. శని కూడా వ్యయ మందున్నాడు కావున అతని ప్రభావంతో అనారోగ్యము ఉద్యోగంలో మార్పులు లేదా స్థాన చలనము నీచ యోగము నీచ స్నేహం వల్ల ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు .మీకు మేలు చేసే వారి కంటే కీడుచేసే వారే ఎక్కువగా ఉన్నారు. అయినా ఆర్థికబలం లేదా దైవబలం పొంది ముందడుగు వేయాల్సి వస్తుంది. ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారికి నైధనతారతో వారం ప్రారంభం వ్యతిరేక ఫలితాలు ఎక్కువ. శ్రవణ నక్షత్రం వారికి మిత్ర తారతో వార ప్రారంభమే అయినా సూర్య గ్రహణ ప్రభావం వీరిపై ఎక్కువగా చూపించనున్నది. ధనిష్టా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది

పరిహారం : విష్ణు సహస్ర నామ పారాయణ చేయండి. నియమ నిష్ఠలతో దీక్ష వహించి సూర్యనారాయణ స్వామిని ప్రార్థించండి .

కుంభ రాశి :

ఈ రాశివారికి ధనలాభం ఉంది దీన్ని చక్కగా వినియోగించుకుంటే అతి తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో పదిమంది సహకారంతో కొండను ఢీకొట్ట గలిగినంత ధైర్యంతో అనేక రెట్లు లాభాన్ని పొందగలుగుతారు. విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి ఉన్నత స్థానాలు లభిస్తాయి . ఆకస్మిక ధన లాభం కూడా ఉంది . గ్రహణ ప్రభావం అన్ని రాశుల పైన ఉన్నట్లే మీకు ఉన్నప్పటికీ మంచి మాటకారితనంతో మీ పనులను నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ఉద్యోగ ధన లాభాలు స్థిర చర ఆస్తి లాభాలు లేదా కోర్టు వ్యవహారాల్లో విజయం పొందే అవకాశాలు వీరికి మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఫలితాలు కనిపిస్తాయి. ఈ రాశివారికి అందరికంటే ఎక్కువ మేలు జరిగే అవకాశం ఉంది. వద్దనుకున్నా మీకు అన్నీ వచ్చి సమకూరుతాయి .ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు వారికి శుభఫలితాలు ఎక్కువగా ఉన్నాయి శతభిషం వారికి అనారోగ్య సూచన కనిపిస్తుంది .పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారికి సంపత్తార తో వార ప్రారంభం గనుక పలు మంచి ఫలితాలు ఉన్నాయి .

పరిహారం : సూర్యనమస్కారాలు లేదా సౌర పారాయణ చేయండి. ఆదిత్యహృదయ పారాయణ చేయండి శనికి మంత్రజపం చేయండి .

మీన రాశి :

ఈ రాశివారికి అష్టమ కుజుడు అష్టమ చంద్రుడు ఇరవై అయిదో తేదీ వరకు ఇబ్బంది కలిగిస్తారు. భాగ్యరాజ్య లాభాల్లో అనగా తొమ్మిది పది పదకొండు లో ఉన్న గ్రహాలు వీరికి కొంత మేలును చేకూరుస్తున్నాయి. అవి వీరికి ఆర్థిక పరమైన లేదా సామాజిక పరమైన లాభాన్ని ఇచ్చే దిశలో ఉన్నాయి. గ్రహణ ప్రభావం వీరికి కొంత తక్కువనే చెప్పొచ్చు. పది పదకొండు రాశుల్లో ఉన్న ఏడు గ్రహాలు వీళ్లకు మేలు చేయనున్నాయి. ఇలాంటి శుభ ఫలితాలు వీళ్లు ఈ వారంలో చవి చూస్తారు. కానీ వారాంతం మందు మాత్రమ్ మనోవ్యధ మిగలనున్నది. చిన్నపాటి కష్టాన్ని కూడా ఓర్చుకోలేని మానసిక స్థితి ఏర్పడుతుంది. ఆ సమయంలో మిమ్మల్ని ఆదుకునే వారు కూడా కనిపించరు . ఇంటా బయటా కొద్దిపాటి వ్యతిరేకత మిమ్మల్ని మానసికంగా కుంగదీస్తుంది . పూర్వాభాద్ర నాలుగో పాదం వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర వారికి విపత్తార తో వారం ప్రారంభం గనుక శుభఫలితాలు తక్కువ.బ రేవతీ నక్షత్రం వారికి క్షేమ తారతో వార ప్రారంభం కావున చాలా మంచి శుభ ఫలితాలు పొందుతారు.

పరిహారం : శివకేశవులను అర్చించండి . ఆంజనేయస్వామిని దర్శించండి మంచి ఫలితం ఉంటుంది .

Next Story