రాశి ఫలాలు 06-10-2019 నుంచి 12-10-2019

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Oct 2019 1:53 PM GMT
రాశి ఫలాలు 06-10-2019 నుంచి 12-10-2019

మేష రాశి:

ఈ రాశి వారికి ఈ వారం కాస్త శుభదాయకంగా ఉంటుంది. 6వ ఇంట్లో రవి, కుజుల వలన వృత్తి రీత్యా బాగుండును. సప్తమంలో బుధ గురుల వలన సంగీత సాహిత్యములలో అభిలాష. అష్టమ గురువు వలన తండ్రితో , గురువుతో కాస్త విభేదాలు. అశ్విని నక్షత్రం వారికి ధన విషయంలో బాగుండును. కార్యజయం. భరణి నక్షత్రం వారికి కాస్త అనారోగ్య సూచన. ధన విషయంలో సామాన్యంగా ఉంటుంది. కృత్తికా నక్షత్రం వారికి స్నేహితులతో సామాన్యమైన ఇబ్బందులు. మొత్తమ్మీద ఈ రాశివారు ఈ వారంలో ఏ కార్యక్రమం తలపెట్టినా జయప్రదం అవుతుంది.

పరిహారం:

ఈ రాశి వారికి అష్టమ గురుడు కావున పరమేశ్వరుని పూజించుట మంచిది. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ ఉపయుక్తము.

వృషభ రాశి:

ఈ రాశి వారికి పంచమంలో రవి, కుజుల వలన విద్య, సంతానం వలన చిరాకులు. విశేష శుభగ్రహాలైన శుక్రుడు 6వ ఇంట ఉండడంవల్ల శత్రువులకు విజయం కలుగుతుంది. అందుకే కోర్టు వ్యవహారములు వాయిదా వేయడం మంచిది. గృహమునందు ఆర్థికంగా చిరాకులు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామి నుంచి తగిన సహాయ సహకారాలు లభించును. కృత్తికా నక్షత్రం వారికి ఈ ఫలితములు సామాన్యంగా వర్తించును. రోహిణి నక్షత్రం వారికి కాస్త ఇబ్బందులు తప్పవు. మృగశిర నక్షత్రం వారికి సామాన్య శుభ ఫలితములు వర్తించును. మొత్తంమీద ఈ రాశివారికి ఈ వారమంతా అనుకూలం తక్కువ.

పరిహారం:

శరన్నవరాత్రులు గనుక దుర్గా దేవి ఆరాధన వలన శుభ ఫలితాలు ఇచ్చును. తెలుపు రంగు అదృష్టాన్ని ఇస్తుంది . తూర్పు దిక్కుకు ప్రయాణం లభించును.

మిధున రాశి:

ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం జీవిత భాగస్వామితో చికాకులు, ప్రయాణ నష్టం, కుటుంబ సభ్యులతో మాటలు పడుట జరుగును. విదేశీ ప్రయాణానికి అనుకూలత తక్కువ. రక్త సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చతుర్ధ కుజుని వలన వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. కనుక జాగ్రత్త వహించుట మంచిది. పంచమాన శుక్రుడు వలన సంతాన సౌఖ్యం, సంతానంతో ఆనందం, విద్యలో పురోగతి బుద్ధికుశలత ఉండును. షష్ఠ గురుని వలన ప్రతి పనిలోనూ కాలయాపన జరుగును. అష్టమ చంద్రుని వలన గర్భకోశ వ్యాధుల సూచన. మృగశిర నక్షత్రం వారికి అనారోగ్యము, వాహన ప్రమాదములు ఉండును. ఆరుద్ర నక్షత్రం వారికి కాస్త వ్యసనములయందు ఆసక్తి కలుగును. సప్తమంలో శని స్థితి అవయోగాన్ని సూచించును. పునర్వసు నక్షత్రానికి బుద్ధికుశలత, సంతానం వలన సంతోషము. మొత్తంమ్మీద ఈ రాశివారికి ఈ వారం సామాన్యముగా ఉండును.

పరిహారం:

శని, రాహు కేతు దోషం కావున గణపతి, సుబ్రహ్మణ్య స్వామిని అర్చించుట మంచిది. మంగళ వారం దుర్గాదేవి అర్చన ఉపయుక్తంగా ఉంటుంది .

కర్కాటక రాశి:

ఈ రాశివారికి తృతీయమునందు పాపగ్రహములు. హృదయ స్థానంలో శుభగ్రహం, విద్యా స్థానంలో గురు గ్రహము కలవు. రిపు స్థానంలో శని కేతు స్థితి లగ్నాధిపతి సప్తమంలో ఉండటం అన్ని విధాలా యోగ దాయకంగా ఉండును. విద్య, ఉద్యోగ, వృత్తి, వ్యాపార సమస్త కార్యాలలో విజయం. ఆరోగ్యం బాగుండును. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం. గర్భవతులకు పుత్ర సంతాన ప్రాప్తి. స్థలము ,గృహసంబంధ పనులకు అనుకూలము. తోడబుట్టిన వారితో సఖ్యత. కోర్టు తగాదాల్లో ఉన్నవారికి పరిష్కారం లభించును. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, నక్షత్ర జాతకులకు స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ మూడు నక్షత్రముల వారికి గ్రహబలం బాగుండుట చేత సర్వ కార్య సిద్ధి.

పరిహారం:

పంచమ గురు స్థితి వలన గురు సంబంధిత దేవతలు అనగా శ్రీకృష్ణుడు, షిరిడి సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయుడు మొదలగు దేవతలను పూజించుటకు మంచిది. తెల్ల ఆవాలు, బెల్లం ఆవుకి తినిపిస్తే విశేష శుభాన్ని పొందుతారు.

సింహరాశి:

ఈ రాశివారికి వాక్ స్థానము లో రవి, కుజులు స్థితి వలన మాటలో కఠినత్వం ఏర్పడును. నేత్ర సంబంధిత వ్యాధులు, కుటుంబ సభ్యులతో విభేదాలు, ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉండును. తోడబుట్టిన వారితో మాట పట్టింపు ఏర్పడును. హృదయ స్థానంలో గురు స్థితి వలన తల్లి సహాయ సహకారములు ఉండను. పంచమంలో శని, కేతు ల వలన విద్యలో బుద్ధిహీనత ఉండును. షష్ఠచంద్రుని వలన మానసికంగా బలహీనత ఏర్పడును. సప్తమ చంద్రుని వలన జీవిత భాగస్వామితో వివాదాలు, జల సంబంధిత అనారోగ్యం అంటే జలుబు, సైనసైటిస్ కు అవకాశం ఉంది. లాభ రాహువు వల్ల గొప్ప ధైర్యం, సాహసం, ఉత్తేజం ఉండును. అయినప్పటికీ ఈ వారంలో ముఖ్యమైన పనులు వాయిదా వేయుట, అనారోగ్యం వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం మంచిది. మఖా నక్షత్ర జాతకులకు వాక్కు యందు కటుత్వం తగ్గును. పుబ్బ నక్షత్రం వారికి స్వల్ప ఇబ్బందులు, ఉత్తరా నక్షత్రం వారికి నేత్ర సంబంధం అనారోగ్యములు కలుగును.

పరిహారం:

మహావిష్ణువును, సూర్యుని పూజించుట మంచిది. ఉత్తర-దక్షిణ దిశలో ప్రయాణం అనుకూలించును.

కన్యా రాశి:

ఈవారం ఈ రాశి వారికి కాస్త అనారోగ్యాలు ఉండును. రక్తానికి సంబంధించిన వ్యాధులు ఉండును కానీ, భాగ్య రాజ్యాధిపతులైన బుధ, శుక్రులు కుటుంబ స్థానంలో స్థితి వలన ధనమునకు లోటు ఏర్పడదు. మాట చెలాయింపు ఉండును. మనోవాంఛలు నెరవేరును. ఆర్థికంగా దినదినాభివృద్ధి. తృతీయ స్థానంలో గురు స్థితి వలన సోదరసోదరీ సహకారం లభించును. ధైర్యసాహసములు ఉండును. ఆహార విషయంలో మితంగా ఉండే మంచి నియమాలు పాటిస్తారు. మాతృ స్థానంలో శని, కేతువు స్థితి వలన తల్లికి కాస్త అనారోగ్యం. పంచమంలో చంద్రుని వల్ల స్థిరమైన నిర్ణయాలు తీసుకొనుటకు వెనుకంజ వేస్తారు. షష్ఠ చంద్రుని వలన స్త్రీ విరోధము సూచన కలదు. ఉత్తరా నక్షత్ర జాతకులకు మిత్రులతో మైత్రి బాగుండును. హస్తా నక్షత్ర జాతకులకు సంకల్పసిద్ధి, చిత్తా నక్షత్ర జాతకులకు కాస్త అనారోగ్య సూచన.

పరిహారం:

శివకేశవుల అర్చన మంచిది. రావిచెట్టు ప్రదక్షిణ శుభఫలితాలనిస్తుంది. పశ్చిమ దిశా ప్రయాణం శుభకరం.

తుల రాశి:

ఈ రాశివారికి లగ్నమందు బుధ ,శుక్రులు ఉండటం వలన, ధన స్థానంలో గురుడు ఉండటం వలన విశేష కీర్తి లభించును. కొత్త పరిచయాలు ఏర్పడును. నూతన వస్తు వాహన లబ్ధి కలుగును. బంధు మిత్రుల సహకారం లభించును. భాగ్య రాహువు వలన పుణ్య క్షేత్ర దర్శనం. కానీ వ్యయమందు రవి, కుజుల వలన నాయకత్వ లక్షణాలు తగ్గును. చిత్తా నక్షత్రం వారికి ఈవారం నైధన తారతో ప్రారంభం కావున కాస్త ఇబ్బందిగా ఉండును. స్వాతి నక్షత్రం వారికి విశేష ఖ్యాతి లభించును, ఆర్థికంగా బాగుండును. విశాఖ నక్షత్రం వారికి ప్రత్యేక తారతో ప్రారంభం కావున ప్రతి పనిలో ప్రతిబంధకం ఏర్పడినప్పటికీ కార్యజయం. మొత్తం మీద ఈ రాశి వారికి లగ్నము నందు రవి ,బుధ, శుక్ర స్థితి వలన ఈ వారం సాఫీగానే ఉండును.

పరిహారం

బుధుడు లగ్నము నందు స్థితి వలన ఉదర సంబంధ వ్యాధులకు అవకాశం. మీరు దక్షిణామూర్తిని అర్పించుట. అర్చన సమయంలో తెలుపు, పచ్చ పుష్పములను ఉపయోగించడం మంచిది. పశ్చిమ, తూర్పు దిశలు ప్రయాణానికి అనుకూలం.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారికి ఏలినాటి శని, జన్మ గురుడు, వ్యయము నందు శుభ గ్రహములు ఉండుట అనేక రకాలైన ఇబ్బందులు సూచించును. కాని.. ఈ లగ్నమునకు రాజయోగ కారకులైన రవి, కుజులు లాభము నందు ఉండుటవలన సమయానికి తగిన సహాయం లభించును. ఈ నెలంతా దైవ బలం ఉండును. లాభము నందు రవి స్థితి వలన సమస్త దోషాలు పరిహారం జరుగును. ఏలినాటి శని వలన ఫలితం సిద్ధించినా ఏదో ఆందోళన కనిపించును. ఈ రాశివారికి ఈ వారం నందే కాక నవంబరు 5 వరకు ఇవే ఫలితములు సూచించును. ఆ తర్వాత క్రమేపీ బాగుండును. విశాఖ నక్షత్ర జాతకులకు ప్రత్యక్తారతో ప్రారంభం కావున కాస్త ప్రతి బంధకం. అనురాధ నక్షత్ర జాతకులకు సర్వం శుభమే కానీ ఏలినాటి శని వలన కాస్త ఆందోళన. జేష్ఠ నక్షత్రం వారికి మిశ్రమ ఫలితం.

పరిహారం

శని గురుల స్థితి బాగోలేదు గనక శివాలయ దర్శనం. రుద్రాభిషేకం, శనికి తైలాభిషేకం మంచిది.

ధనూరాశి:

ఈ రాశి వారికి ఈ వారం అభిజిత్ లగ్నం అవుట విశేషం. వ్యయ గురులు, ఏలినాటి శని ఉన్నప్పటికీ స్వల్ప శుభములు సూచించును. గతంలో ఉండే ఇబ్బందుల నుంచి కాస్త ఊరట కలుగును. ఆరోగ్యం కుదుట పడును. కానీ లగ్న శని ,కేతు సంయోగం వలన నరాలకు సంబంధించిన వ్యాధులను సూచించును. లాభమందు శుక్రుని వలన విలాసము, దుష్టులతో స్నేహం, స్నేహితుల వలన కాస్త ఇబ్బందులు ఉండును. మూలా నక్షత్రం వారికి ఆర్థికంగా బాగుండును. పూర్వాషాఢ నక్షత్రం వారికి జన్మతారతో ప్రారంభం కావున స్వల్ప అనారోగ్యం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి పరమమిత్ర తారతో ప్రారంభం కనుక మిత్ర సహకారం లభించును.

పరిహారం

ఈ రాశి వారి గ్రహ స్థితి బాగా లేనందున దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శించుట మంచిది. బ్రాహ్మణులకు స్వయంపాకం, వస్త్ర దానము చేయాలి. అతిథి, అభ్యాగతులను పూజించుట మంచిది.

మకర రాశి:

ఈ రాశి వారికి దశమ, లాభ స్థానాలలో శుభ గ్రహముల వలన వృత్తిరీత్యా బాగుండును. ఏ కర్మ చేసినా ఫలితం సిద్ధించును. లాభమునందు గురుడు వలన దైవ బలం బాగుండును. ధన కారకుడు లాభము నందు ఉండటం వల్ల ఆర్థికంగా బాగుండును. కానీ రాశ్యాధిపతి వ్యయంలో ఉండుటవలన అనారోగ్య సూచన. భాగ్య మందు రవి, కుజులు స్థితి వలన స్త్రీలకు భర్త తరపు వారితో, పురుషులకు తండ్రి తరఫు వారితో చిరాకు ,,వాగ్వివాదములుండును . లగ్నమందు చంద్ర స్థితి వలన శరీరంలో నీటి శాతం తగ్గి అన్న పానీయములు హితము కావు. ఈ వారం కాస్త నీరసంగా ఉంటారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు స్నేహితులతో మైత్రి బాగుండును. శ్రవణా నక్షత్ర జాతకులకు పితృ వర్గంతో ఇబ్బందులు ఉండును. ధనిష్టా నక్షత్ర జాతకులకు నైధనతారతో ప్రారంభము, ద్వాదశము నందు చంద్రుని వలన కార్య విఘ్నములు ఏర్పడును.

పరిహారం:

అమ్మవారికి కుంకుమార్చన ,సువాసినులను వస్త్రాభరణాలతో పూజించుట మంచిది. ఈ రాశివారికి ఆగ్నేయ, దక్షిణ దిశా ప్రయాణాలు అనుకూలం. ఆగ్నేయ కంటే దక్షిణదిశా ప్రయాణం ఉత్తమం.

కుంభరాశి:

ఈ రాశి వారికి లగ్నాధిపతి లాభస్థానం, రాజ్య గురుడు భాగ్యంలో బుధ శుక్రుల స్థితి వలన వృత్తిరీత్యా స్థిరత్వం బాగుండును. స్త్రీలకు భర్త తో అనుబంధం, పురుషులకు తండ్రితో అనుబంధం బలంగా ఉండను. యశోవృద్ధి, పాత బాకీలు వసూలు, పెండింగ్ పనులను పరిష్కారము. అష్టమ రవి కుజుల వల్ల గర్భస్రావం, సంతానానికి ఇబ్బందులు ఏర్పడవచ్చు. వాహన ప్రమాదములు అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండవలెను. ఇతర విషయాలలో అభివృద్ధి బాగుండును. ధనిష్టా నక్షత్రం వారికి వాహన ప్రమాదము లకు అవకాశము శతభిషా నక్షత్రం వారికి అధిక శుభము. పూర్వాభాద్ర నక్షత్రం వారికి ప్రతిబంధకములు ఉన్నప్పటికీ కార్య జయము.

పరిహారము:

విజయ దశమినాడు సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం నియమములు పాటించుట, కందులు దానం చేయుట వలన ప్రయాణాలలో ఇబ్బందులు తగ్గును. పశ్చిమ తూర్పు దిశలు అనుకూలం. తూర్పుదిశా ప్రయాణం అత్యంత యోగ దాయకం.

మీన రాశి:

ఈ రాశి వారికి అష్టమంలో బుధ, శుక్రులు, సప్తమంలో రవి, కుజులు ఉండటం అనారోగ్య సూచన. ఇతరులతో సంభాషణ విషయంలో ఇబ్బందులు. ప్రయాణములు కలిసి రావు. అష్టమంలో బుధ, శుక్రుల వలన బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చును. సప్తమం లో కుజుని వలన దుష్ట సహవాసం కలుగును. దశమంలో శని కేతుల వలన వృత్తిరీత్యా ఇబ్బందులు, క్రింది స్థాయి వారితో మాటలు పడుట, పై అధికారుల నుంచి ఒత్తిడి ఉండును. మొత్తం మీద వృత్తి, ఆరోగ్యములలో అనుకూలం తక్కువ. పూర్వభాద్ర నక్షత్రం వారికి అవయోగములు ఉండును. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి స్వల్ప శుభఫలితాలు, రేవతి నక్షత్రం వారికి విపత్తులు ఏర్పడవచ్చును.

పరిహారం:

హనుమకు తమలపాకులతో అర్చన, నింబ(నిమ్మకాయల) ఫల మాలలు సమర్పించుట, సింధూర తిలక ధారణ శుభ ఫలితములను ఇచ్చును. దక్షిణ దిశా ప్రయాణం కాస్త అనుకూలం.

Next Story