ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్స్‌లో చైనాకు ప్రాతినిధ్యం వహించే వారే లేరు..!

న్యూ ఢిల్లీలో ఇవాళ్టి నుండి మొదలవనున్న సీనియర్ ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ లో చైనాకు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లే లేరు. దీంతో భారత మహిళా రెజ్లర్లకు ఇది కాస్త అనుకూలంగా మారనుంది. దీనిపై ప్రభుత్వాల నుండి ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు. సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 40 మంది ఉన్న చైనా బృందం వీసాల కోసం దరఖాస్తు చేసుకుందని తెలుస్తోంది. చైనాలో విపరీతంగా కోవిడ్‌ వైరస్ ప్రబలడంతో చైనా బృందానికి వీసా అప్రూవల్ ఇవ్వలేదని అంటున్నారు. చైనా బృందం వస్తే ఇతర దేశాల ఆటగాళ్లకు వైరస్ సోకే అవకాశం ఉందని పలువురు భయాన్ని వ్యక్తం చేశారు.. దీంతో ఆరోగ్య పరంగా రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేకనే చైనా బృందానికి అనుమతి నిరాకరించామని డబ్ల్యూఎఫ్ఐ అధికారులు చెబుతున్నారు.

టోర్నమెంట్ మొదలవ్వడానికి ముందు నుండే ఇతర దేశాలకు చెందిన బృందాలు ‘చైనా టీమ్’ వస్తోందా అంటూ వాకబు చేశాయంటే వారు ఎంతగా భయపడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చని డబ్ల్యూఎఫ్ఐ అధికారులు చెబుతున్నారు. చైనీస్ రెజ్లర్లు వచ్చినా వారికి దూరంగా ఉండాలంటూ పలు దేశాల అథ్లెట్లకు సూచనలు వచ్చాయట..! దీంతో ఇక చేసేదేమీ లేక వారిని చైనా రెజ్లర్లను పోటీలకు దూరంగా ఉంచినట్లు డబ్ల్యూఎఫ్ఐ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో ఎటువంటి వివాదాలు లేవని.. కేవలం ఆరోగ్య రీత్యానే ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతున్నారు. రెజ్లర్ల ఆరోగ్యంతో ఎటువంటి రిస్కు తీసుకోలేమని.. క్రీడలు అంటేనే ఫిట్నెస్ తో ముడిపడి ఉంటుందని అన్నారు డబ్ల్యూఎఫ్ఐ అధికారులు.

యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కూడా దీనిపై ఎటువంటి అభ్యంతరాలు ఇప్పటి వరకూ చెప్పలేదని అంటున్నారు. ఈ విషయంపై స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు కూడా స్పందించారు. చైనా ఆటగాళ్లను అనుమతించకపోవడానికి ముఖ్య కారణం ఆరోగ్యం గురించేనని చెబుతున్నారు. పాకిస్థాన్ జట్టు కూడా మంగళవారం నాడు భారత్ కు చేరుకోనుందని.. కేవలం ఆరోగ్యం విషయంలో మాత్రమే తాము చైనా రెజ్లర్లకు అనుమతిని ఇవ్వలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా ‘వరల్డ్ నంబర్ 2’ రెజ్లర్ భజరంగ్ పూనియా నిలవనున్నాడు. భారత్ కు ఒలింపిక్స్ లో తప్పకుండా పతకం సాధిస్తాడని ఆశిస్తున్నారు. 65 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో పూనియా తలపడనున్నాడు. ఈ టోర్నమెంట్ లో భజరంగ్ పూనియా రాణించడం చాలా అవసరం.. ఇక్కడి ఫలితాలను బట్టి ఒలింపిక్ క్వాలిఫయర్లలో మంచి సీడింగ్ లభించనుంది. కె.డి. జాదవ్ స్టేడియంలో ఆరు రోజుల పాటూ ఈ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. గ్రీకో-రోమన్ స్టైల్ లో 55కేజీ, 63కేజీ, 87కేజీ, 130 కేజీల విభాగంలో పోటీలు నిర్వహించనున్నారు.

మార్చి 27 నుండి 29 మధ్యన ఆసియన్ ఒలింపిక్ క్వాలిఫైయర్లు చైనాలోని జియాన్ ప్రావిన్స్ లో నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చైనా ఈ పోటీలను నిర్వహించడం అసాధ్యం. దీంతో మంగోలియా, కజకిస్థాన్, భారత్ లలో ఈ పోటీలు నిర్వహించే అవకాశం ఉంది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.