పాక్ జైల్లో పదేళ్లు ఉన్న ఒక క్రైస్తవురాలి దీన గాథ

By అంజి  Published on  5 Feb 2020 3:32 AM GMT
పాక్ జైల్లో పదేళ్లు ఉన్న ఒక క్రైస్తవురాలి దీన గాథ

ఒక వైపు దేశంలో పౌరసత్వ సవరణ చట్టంపై వివాదాలు కొనసాగుతున్న సమయంలోనే పాకిస్తాన్ లోని కరకు క్రూర చట్టాలు మైనారిటీ క్రైస్తవులను ఎలా అత్యాచారాలకు, అణచివేతకు గురి చేస్తున్నాయో తెలిపే ఒక సంచలనాత్మకమైన పుస్తకం విడుదలైంది. కేవలం వీధి కుళాయి వద్ద తగాదా కారణంగా ఒక క్రైస్తవ మహిళ పై దైవ దూషణ చట్టం కింద కేసు వేసి, ఆమెని ఉరి కంబం దాకా తీసుకెళ్లిన కథను ఎన్ ఫిన్ లిబ్రే అన్న పేరిట ఫ్రెంచ్ రచయిత్రి అన్నా ఇసాబెల్లా టోలెట్ వ్రాశారు. ఇప్పుడు ఆ పుస్తకం “ఫైనల్లీ ఫ్రీ” (చివరికి స్వాతంత్ర్యం పొందాను) అన్న పేరిట విడుదలైంది.

ఆసియా బీబీ అనే క్రైస్తవ దళిత మహిళపై దైవ దూషణ నేరం మోపి, ఆమెను జైలు పాలు చేశారు. ఇది 2010లో జరిగింది. దీనిపై అంతర్జాతీయంగా గగ్గోలు చెలరేగింది. మానవ హక్కుల సంఘాలు, మత స్వేచ్ఛ కోసం పోరాడే సంస్థలు దీనిపై పాకిస్తాన్ ను తీవ్రంగా విమర్శించాయి. పాక్ కోర్టులు ఆమెకు ఉరిశిక్ష కూడా విధించాయి. దీనిని అప్పటి పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై పాకిస్తాన్ లోని ఇస్లామిక్ మతోన్మాద శక్తులు భగ్గుమన్నాయి. గవర్నర్ తసీర్ అంగరక్షకుడు ఖాద్రీ ఆయనను కాల్చి చంపేశాడు. మతోన్మాద శక్తులు ఖాద్రీని ఒక మహా వీరుడిగా, ముజాహిద్ గా చిత్రించాయి. చివరికి అంతర్జాతీయ ఒత్తిడికి లొంగి పాకిస్తాన్ 2018 ఓ ఆసియా బీబీని పాకిస్తాన్ నుంచి అమెరికాకు పంపించేసింది. ప్రస్తుతం ఆమె కెనడాలో అజ్ఞాత జీవనం గడుపుతోంది. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతం ఇప్పుడు పుస్తక రూపంలో వచ్చింది.

జైలులో ఒంటరి గదిలో ఉన్నప్పుడు కన్నీళ్లే ఆసియా బీబీకి ఏకైక సహచరులు. ఆమెను జైలులో సంకెళ్లతో బంధించి ఉంచారు. తోటి ఖైదీలు, అధికారులు ఆమెను నిత్యం వేధించేవారు. నిత్యం సంకెళ్లతో బంధించి ఉంచడంతో మణికట్టు తీవ్రమైన మంటగా ఉండేదని, ఆ బరువు మోయడం చాలా కష్టంగా ఉండేదని ఆసియా చెప్పింది.

పౌరసత్వ సవరణ చట్టంలో క్రైస్తవ శరణార్థులకు కూడా పౌరసత్వం కల్పిస్తూ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీని వల్ల మత స్వేచ్ఛ లేకుండా మగ్గుతున్న పలువురు క్రైస్తవులకు కూడా ఊరట లభిస్తుంది. పాకిస్తాన్ లో క్రైస్తవులు అత్యంత దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. యూసుఫ్ యొహానా వంటి సుప్రసిద్ధ క్రికెటర్ సైతం మతం మార్చుకుని మహ్మద్ యూసుఫ్ గా మారిపోయాడు.

Next Story