ఆర్మీ జవాన్ దంపతుల ఆత్మహత్య..అసలు కారణం ?

By రాణి  Published on  24 April 2020 5:55 PM GMT
ఆర్మీ జవాన్ దంపతుల ఆత్మహత్య..అసలు కారణం ?

కొండంత ధైర్యంతో దేశానికి రక్షణగా నిలబడాల్సిన ఆర్మీ జవాన్ ఆత్మ స్థైర్యాన్ని కోల్పోయాడు. అల్లారుముద్దుగా చూసుకుంటున్న మూడేళ్ల కొడుకు ఇక లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగు చూసింది. స్థానిక ఏఎస్పీ సంజీవ్ వెల్లడించిన వివరాల మేరకు జమ్మూ కాశ్మీర్ రైఫిల్ రెజిమెంట్ లో సుబేదార్ గా విధులు నిర్వహిస్తున్న జితేంద్ర అనే జవాన్ కు భార్య, మూడేళ్ల కొడుకు ఉన్నారు. కొడుకుకి కొద్ది నెలలుగా ఆరోగ్యం బాలేదు. తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్నుమూసిన కొడుక్కి జితేంద్ర గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం కొడుకు లేడన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని ఆ దంపతులిద్దరూ కన్నీరుమున్నీరుగా విలపించారు. కొడుకు మృతదేహాన్ని ఖననం చేశాక ఇంటికి తిరిగొచ్చిన ఆ ఇద్దరూ పచ్చి మంచినీరైనా ముట్టలేదు.

Also Read : మహిళా ఎంపీటీసీ ఆత్మహత్య..కరోనా వల్లేనా ?

లాక్ డౌన్ కారణంగా వచ్చిన అతి కొద్ది బంధువులంతా తిరిగి వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. పక్కింటి వారు వారికి తినేందుకు ఆహారం ఇచ్చారు. సాయంత్రం మరోసారి జవాన్ దంపతులను ఓదార్చేందుకు మళ్లీ వచ్చిన పక్కింటోళ్లు ఎంతసేపు తలుపు తట్టినా తీయలేదు. గట్టిగా పిలిచినా పలుకలేదు. దీంతో చుట్టుపక్కల నలుగురినీ పిలిచి తలుపులు పగలగొట్టించారు. లోపలికి వెళ్లి చూడగా జవాన్ జితేంద్ర, అతని భార్య ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులను పోలీసులు ఆరా తీయగా వారి పెద్ద కొడుకు కూడా గతంలో అనారోగ్యంతో చనిపోయాడని, ఇప్పుడు మరో కుమారుడు కూడా అనారోగ్యంతోనే చనిపోయినట్లు తెలిపారు. ఇద్దరు కొడుకులు చిన్న వయసులోనే మరణించడంతో డిప్రెషన్ లోకి వెళ్లిన జితేంద్ర దంపతులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Also Read : వరుసగా అత్యాచారాలు..తాజాగా గుంటూరులో

Next Story