'అరకు' లోయకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు

By Newsmeter.Network  Published on  24 Dec 2019 7:25 AM GMT
అరకు లోయకు ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు

ముఖ్యాంశాలు

  • ఆరకు లోయకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
  • ఫలించిన ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త వ్యూహం
  • విశాఖ నుంచి బయలుదేరే స్పెషల్ సర్వీసులు
  • ఉదయం 6 గం.లకు లంబసింగికి చేరే బస్సులు
  • టూరిస్టుల నుంచి వెల్లువెత్తుతున్న స్పందన
  • త్వరలోనే మరికొన్ని సర్వీసుల ఏర్పాటు
  • సీజనల్ సర్వీసుల వల్ల లాభాలు

ఆక్యుపెన్సీ రేటును పెంచుకునేందుకు, సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ఎపీఎస్ ఆర్టీసీ మొదటి నుంచీ సరికొత్త విధానాలను అనుసరించడంలో ముందుంటుంది. పండగల సీజన్ లో ప్రత్యేక సర్వీసులను నడపడం, సెలవుల్లో ఎంపిక చేసిన టూరిస్ట్ ప్రదేశాలకు కొత్త సర్వీసులు వేయడం లాంటి ప్రయోగాలు ముందునుంచీ సంస్థకు అండగానే నిలుస్తున్నాయి.

ఈసారి ఇలాంటి మరో సరికొత్త ఆలోచనకు ఏపీఎస్ ఆర్టీసీ విశాఖ రీజియన్ శ్రీకారం చుట్టింది. అరకు లోయ అందాలను చూసేందుకు వచ్చే టూరిస్టుల కోసం ఇప్పుడు ప్రత్యేకమైన సర్వీసుల్ని ప్రవేశపెట్టింది. ఉదయం ఆరు గంటలకల్లా ఈ ప్రత్యేక సర్వీసులు యాత్రికులను లంబసింగికి తీసుకెళ్తాయి.

నులివెచ్చని సూర్యకిరణాలు తాకుతుండగా, ప్రకృతి అందాలను చూసి పులకరించాలనుకునే యాత్రికులు, ప్రకృతి ప్రేమికులు ఎవరైనా సరే ఈ ప్రత్యేక సర్వీసులను ఎంచుకుంటే చాలు, వాళ్లకు కావాల్సిన సంతోషం కూతవేటు దూరంలో ఉన్నట్టే. ఈ అరుదైన అనుభూతిని సొంతం చేసుకునేందుకు యాత్రికులు ఇప్పుడు పోటీలు పడుతున్నారు. రద్దీ విపరీతంగా ఉండడంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్న విశాఖ రీజియన్ ఆర్టీసీ ఉన్నతాధికారులు మరికొన్ని సర్వీసులను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు.

లంబసింగనుంచి బయలుదేరి పూర్తిగ అరకు వ్యాలీ అంతా చుట్టివచ్చే ఈ సర్వీసుల గురించి విస్తృతంగా ఇప్పుడు టూరిస్టులకు తెలిసిపోవడంతో అంతకంతకూ రష్ పెరుగుతోందని విశాఖ రీజియన్ మేనేజర్ చెబుతున్నారు. నెలరోజులుగా ఈ సర్వీసులకు వచ్చిన రెస్పాన్స్ ని చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం ఆర్టీసీ విశాఖనుంచి లంబసింగికి అల్ట్రా డీలక్స్ సర్వీసుల్ని నడుపుతోంది. వారాంతాల్లో విశాఖ ఏజెన్సీ అందాలను చూసి ఆనందించాలనుకునే యాత్రికుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండడంతో అధునాతన సౌకర్యాలతో కూడిన హైటెక్ బస్సుల్నికూడా ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.

లంబసింగికి వెళ్లే సర్వీసులు ద్వారకా బస్ స్టేషన్ లో తెల్లవారుజామున మూడు గంటలకే బయలుదేరుతాయి. నేరుగా అరకు వెళ్లే బస్సులు ఇదే బస్టాండ్ నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతున్నాయి. లంబసింగికి వెళ్లే సర్వీసులు మార్గమధ్యంలో ఉన్న కొత్తపల్లి వాటల్ ఫాల్స్, మోదమాంబ ఆలయం, మత్స్యగుండంలో ఉన్న కాఫీ ప్లాంటేషన్స్ ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాయి. అలాగే అరకు వెళ్లే ప్రత్యేక సర్వీసులు దమకు వ్యూ పాయింట్, బొర్రా గుహలు, గాలి కొండ వ్యూ పాయింట్, ట్రైబల్ మ్యూజియమ్ , చాపరై వాటర్ ఫాల్స్, పద్మపురం గార్డెన్స్ ని కవర్ చేసుకుంటూ వెళ్తున్నాయి.

ఆక్యుపెన్సీ రేషియో

లంబసింగికి వెళ్లే సర్వీసుల్లో కనీసం నూట పదమూడు నుంచి నూట ఇరవై మంది ప్రయాణికులు ఎక్కుతున్నారని అధికారులు చెబుతున్నారు. అరకు బస్సులో నూట పదిహేను నుంచి నూట పాతిక మంది ప్రయాణికులు ఎక్కుతున్నారంటున్నారు.

లంబసింగి సర్వీసులకు కిలోమీటర్ కు రూ.49.09 ఆదాయం వస్తోందట. నలభై రూపాయలు కిలో మీటర్ కి వస్తే లాభం వచ్చినట్టే. ఈ సర్వీసులవల్ల తమ డిపోకు చక్కటి ఆదాయం సమకూరుతుందని విశాఖ రీజియన్ మానేజర్ చెబుతున్నారు. సంక్రాంతి సెలవుల్లో ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుందంటున్నారాయన.

ఏపీఎస్ ఆర్టీసీ ఈ ప్రత్యేక సర్వీసులకు ఆన్ లైన్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. అరకు, పాడేరు, పంచరాముల ప్రాంతాలకు కార్తీక మాసంలో విపరీతమైన డిమాండ్ ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఇంతుకోసం ప్రత్యేకంగా కార్తీక మాసం సర్వీసుల్నికూడా ఈ రీజియన్ నడిపింది. తద్వారా అప్పుడుకూడా మంచి ఆదాయాన్ని పొందగలిగింది.

Next Story
Share it