ఏపీలో శరవేగంతో విస్తరిస్తున్న 'ఆక్వా కల్చర్'

By Newsmeter.Network  Published on  29 Dec 2019 1:44 PM GMT
ఏపీలో శరవేగంతో విస్తరిస్తున్న ఆక్వా కల్చర్

ముఖ్యాంశాలు

  • రాష్ట్రంలో శరవేగంతో విస్తరిస్తున్న ఆక్వా కల్చర్
  • పంట పొలాలను ఆక్వా ఫామ్స్ గా మార్చేస్తున్న రైతులు
  • ఆక్వా ఉత్పత్తుల అమ్మకాలవల్ల విపరీతమైన లాభాలు
  • అక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీదే అగ్రస్థానం
  • భవిష్యత్తులో ప్రమాదాలు ఎదురవుతాయని సూచనలు
  • ఆక్వావల్ల నేల నిస్సారమైపోతుందంటున్న నిపుణులు
  • భవిష్యత్తులో పంటలు పండే అవకాశం లేదని హెచ్చరిక

రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మెల్లమెల్లగా దేశానికి ఫిష్ బౌల్ గా మారిపోతోంది. పంట పొలాల్ని అక్వా ఫామ్స్ ఎలా ఆక్రమిస్తున్నాయో ఉపగ్రహ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. నిజానికి ఆక్వారంగంవల్ల రైతులకు తాత్కాలిక లాభాలు వచ్చి వాళ్లకు మేలు కలుగుతున్నా భవిష్యత్తులో దానివల్ల చాలా అనర్థాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ చేపలు, ఇతర మెరైన్ ఉత్పత్తుల ఎగుమతులు రూ. 16,372 కోట్ల రూపాయల్ని దాటిపోయాయి.

మంచినీళ్లతో వ్యవసాయం చేసే విధానం రాష్ట్రంలో డెబ్భయ్యవ దశకంలో మొదలయ్యిందని చెప్పొచ్చు. ఎనభయ్యో దశకంలో అంటే దాదాపుగా పదేళ్ల తర్వాత ఆక్వా ప్రారంభమయ్యింది. ఈ రోజున ఆశ్చర్యం కలిగించే రీతిలో 4000 టన్నుల మెరైన్ ఉత్పత్తులతో రాష్ట్రం దేశంలోనే అక్వా ఉత్పత్తి రంగంలో అగ్రస్థానంలో నిలవడం విశేషం.

విద్యుత్తును తక్కువ రేటుకే అందిస్తానంటూ వరమిచ్చారు

ఆక్వా రంగానికి చేయూత ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వె.ఎస్.జగన్మోహన్ రెడ్డి విద్యుత్తును తక్కువ రేటుకే అందిస్తానంటూ వరమిచ్చారు. ఇతరత్రా వాణిజ్య అవసరాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న యూనిట్ ధర రూ.7 అయితే సీఎం హామీ ఇచ్చిన దాని ప్రకారం ఆక్వా రైతులు యూనిట్ కు చెల్లించాల్సిన ధర కేవలం రూపాయిన్నర మాత్రమే.

కానీ ఆక్వా రంగం విస్తృత స్థాయిలో విస్తరిస్తున్న నేపధ్యంలో దాని ప్రతికూల ఫలితాల గురించికూడా ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు కలుగుతోంది. సాధారణ పంటలు పండించే నేలను చేపల చెరువులుగా మార్చడంవల్ల ఆ చెరువుల్లో వాడే రకరకాల రసాయనాలు భూమిలోకి ఇంకడంవల్ల అనతికాలంలోనే భూమి పూర్తిగా సారాన్ని కోల్పేయ పరిస్థితి తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు.

దీనివల్ల పూర్తి స్థాయిలో భవిష్యత్తులో అదే నేలలో పంటలు పండే అవకాశం లేకుండా భూమి పూర్తిగా నిస్సారమై పోతుందంటున్నారు. అదిమాత్రమే కాక వ్యవసాయంమీద ఆధారపడ్డ సాధారణ రైతుకూలీలకు ఉపాధి కరవవుతుందన్న వాదనకూడా సత్యమే.

ఆక్వా క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరుపడ్డ భీమవరం రాష్ట్రంలో ఆక్వా రంగానికి ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ అనేక విధాలైన మెరైన్ ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలు విస్తృత స్థాయిలో విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఆక్వా రంగంపై స్థానిక రైతుల్లో అవగాహన పెరిగాక, వివిధ రకాల కొత్త యాజమాన్య పద్ధతుల గురించి వారికి తెలిశాక పరిస్థితి మరింత ఆశాజనకంగా మారింది.

ప్రత్యేకించి కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో ఆక్వా ఫార్మ్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఈ జిల్లాల్లో పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయనీ, అడుగంటి పోతున్నాయనీ నిపుణులు చెబుతున్నారు. ఆక్వా కల్చర్ కి కేవలం ఒక్క మనిషి సేవలు చాలు కానీ సంప్రదాయ వ్యవసాయానికి చాలామంది సేవలు అవసరమవుతాయి.

కూలీలు పనులు దొరక్క రోడ్డున పడుతున్నారు

ఆ రకంగా సంప్రదాయ వ్యవసాయంవల్ల చాలామంది రైతు కూలీలకు జీవనోపాధి దొరుకుతుంది. ఆక్వా రంగం పూర్తి స్థాయిలో విస్తరించడంవల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఆర్థికంగా వెనకబడిన దళిత వర్గాలకు సరైన ఉపాధి దొరకడంలేదన్న మాట ఇప్పుడు ఈ జిల్లాల్లో అంతటా వినిపిస్తోంది. ఆక్వా రంగం విస్తరించడంవల్ల అసలు భూమే లేని నిరుపేద రైతు కూలీలు పనులు దొరక్క రోడ్డున పడుతున్న విషయాన్నీ ఈ సందర్భంగా చెప్పుకుని తీరాల్సిందే.

కోస్టల్ అగ్రికల్చర్ అధారిటీస్ ఏర్పాటు చేసిన నిబంధనలను, నియమాలు, సలహాలను రైతులు పూర్తి స్థాయిలో పాటిస్తున్నారు. ఈ కారణంగా సంప్రదాయ వ్యవసాయానికి ఇప్పుడు ఎన్నో విధాల లాభాలు కలుగుతున్నాయి. రైతులు కూడా చాలా తక్కువ సమయంలోనే ఆ ఫలాలను అందుకుంటున్నారు. సరిగ్గా ఈ విధానమే దీర్ఘకాలంలో వాతావరణ పరిస్థితుల్ని తట్టుకుని నిలబడేందుకుగానీ లాభాలు ఆర్జించేందుకు ఉపయోగపడుతుంది.

కానీ రైతులు ఇప్పుడు ఆక్వామీద ప్రేమతో పూర్తిగా పొలాల్లో గట్లుకూడా కొట్టేస్తున్నారు. ఆ భూముల్ని చేపల చెరువులుగా మార్చేస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయం ఎప్పటికీ నిలచి ఉండేది. దాన్నెవరూ కాదనలేరు. కానీ ఆక్వా రంగం కేవలం కొన్ని మెరుపులు మెరిపించి తర్వాత ఏదైనా తేడా వస్తే మొత్తంగా పుట్టినే ముంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అలాగని పూర్తిగా ఆక్వామీద అపనమ్మకాన్ని, అయిష్టతను పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ సంప్రదాయ రైతులు స్థిరంగా ఉంటే, ఆక్వా రైతులు విధిని నమ్ముకుని వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ తమ జీవితంతో తామే ఆటలాడుకోవాల్సిన పరిస్థితి దీర్ఘకాలంలో ఎదురుకావొచ్చు. అలాంటి అవరోధాలను ఎదుర్కోవడానికి మొదటినుంచీ సంసిద్ధంగా ఉండడమే మంచిది.

కాకినాడలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ ప్రిన్సిపల్ పి.కోటేశ్వరరావు చెబుతున్నదాన్నిప్రకారం చాలామంది రైతులు ఆక్వా కల్చర్ కి సంబంధించిన మార్గదర్శకాలను తుంగలోతొక్కుతున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని తిప్పలు తప్పవని ఆయన ముందే హెచ్చరిస్తున్నారు.

పంట పూర్తైన తర్వాత వచ్చే వ్యర్థాలను చాలామంది రైతులు స్థానిక చెరువుల్లో కలిపేయడంద్వారా ఆ చెరువులు పూర్తి స్థాయిలో కలుషితం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన దీనికి అడ్డుకట్ట వేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

2019 ఫిబ్రవరి నెలలో కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ భీమవరంలోని తుండూరు గ్రామంలో గోదావరి మెగా ఫుడ్ పార్క్ కి శ్రీకారం చుట్టారు. చేపలు మరియు ఇతర మెరైన్ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కోసం రాష్ట్రంలో ఏర్పాటైన మొట్టమొదటి అతిపెద్ద పెద్ద ఫుడ్ పార్క్ ఇదే కావడం విశేషం.

సెప్టెంబర్ నెలలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సూచనల మేరకు ఈ పార్క్ పై చర్యలు చేపట్టాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సూచనలు చేసింది. జరుగుతున్న అభివృద్ధి ఇతరుల అభివృద్ధిని శ్రేయస్సునీ అడ్డుకునేదిగానూ, నష్టపరిచేదిగానూ ఉందాలేదా అన్నదే ఇక్కడ గమనించాల్సిన ప్రధానమైన అంశం.

Next Story
Share it