ఇకపై ఏపీఎస్ఆర్టీసీ పేరు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్ మెంట్..!!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2019 5:05 PM GMT
ఇకపై ఏపీఎస్ఆర్టీసీ పేరు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్ మెంట్..!!

అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ పేరు మారుస్తున్నట్లు రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావొచ్చిందన్నారు. ఉద్యోగులకు వేతనాలు ఎంత ఉండాలి, వారికి ఏ స్థాయి కల్పించాలి, పాలనా యంత్రాంగం ఎలా ఉండాలనే దానిపై అధ్యయనానికి ఆరుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీ వేసింది. దీనికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా ఉంటారు. ఆర్ధికం, సాధారణ పరిపాలన, పబ్లిక్‌ ఎంటర్‌ ప్రైజెస్ , న్యాయశాఖల ముఖ్య కార్యదర్శులను కమిటీలోకి తీసుకున్నారు. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.

ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం తరువాత కొత్త పేరును అధికారికంగా అమల్లోకి తీసుకువస్తామన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ విలీనంతోపాటు సంస్థపై భారం తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఇందులో భాగంగా విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టేందుకు ఆలోచనలు చేస్తున్నారు. విలీన కమిటీ దీనిపై అధ్యయనం కూడా చేస్తుంది. కార్మికుల విలీనంతో పాటు, ఆర్టీసీ బిజినెస్ రూల్స్‌లో మార్పులు, శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతభత్యాలపై ఈ కమిటీ నివేదిక సమర్పించనుంది. వచ్చే నెలాఖరుకు నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది..

Next Story