ఏపీలో మూడు రాజధానులపై భిన్నాభిప్రాయాలు

By రాణి  Published on  18 Dec 2019 6:42 AM GMT
ఏపీలో మూడు రాజధానులపై భిన్నాభిప్రాయాలు

ముఖ్యాంశాలు

  • గుంటూరు జిల్లాలో రైతుల దీక్ష
  • జగన్ పై దుమ్మెత్తిపోస్తున్న మహిళలు

అమరావతి : ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రకటనపై రాష్ర్టంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ, కర్నూల్ లలో రాజధానులు ఏర్పాటు చేయడంపై ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తుంటే, అమరావతి పరిసర ప్రాంతాల వాసులు మాత్రం జగన్ ప్రకటనపై మండిపడుతున్నారు. ఈ ఏడుపేదో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఏడ్చుంటే అసలు జగన్ అసెంబ్లీకి ఎలా వెళ్లేవాడో చూసేవాళ్లమంటున్నారు రాజధాని ప్రాంత మహిళలు. ఆఖరి రోజు ఆఖరి నిమిషంలో మూడు రాజధానుల ప్రకటన చేసి సీఎం జగన్ దొంగలా పారిపోయాడని విమర్శిస్తున్నారు. వెంటనే జగన్ చేసిన మూడు రాజధానుల ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే తాము పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని మహిళా రైతులు రోడ్డెక్కారు. నిరసనలు జరుగుతాయని ముందే ఊహించిన పోలీసులు భద్రత పెంచడంతో మహిళల ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.

మరోవైపు భూములిచ్చిన రైతులు జగన్ ధోరణి పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, రాయపూడి, కిష్టాయపాలెం, మందడంలో రైతులు ధర్నా చేపట్టారు. రాజధాని ఏర్పాటు కోసం చంద్రబాబు హయాంలో వేలకు వేల భూములు తమ వద్ద నుంచి తీసుకున్నారని, ఇప్పుడు మూడు రాజధానులు చేస్తే తాము చేసిన భూ త్యాగానికి ఏం విలువ ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు రాజధానులు చేయాలనుకుంటే తమ వద్ద తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేయాలని, లేకపోతే ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులున్నాయని, ఇక్కడ కూడా మూడు రాజధానులు పెట్టాలనుకోవడం సబబు కాదంటున్నారు. సౌత్ ఆఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నా అక్కడ పెద్దగా అభివృద్ధి జరగలేదన్నారు. జగన్ వైఖరిలో రాష్ర్టాభివృద్ధి అంధకారంలో పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్ కోసం భూములు త్యాగం చేస్తే జగన్ తన స్వార్థం కోసం ఇలా చేయడం న్యాయం కాదని ఆరోపిస్తున్నారు.

Next Story
Share it