ఏపీకి మూడు క్యాపిటల్స్ సాధ్యమేనా?

By రాణి  Published on  18 Dec 2019 5:33 AM GMT
ఏపీకి మూడు క్యాపిటల్స్ సాధ్యమేనా?

ముఖ్యాంశాలు

  • ముచ్చటగా మూడు రాజధానుల కాన్సెప్ట్
  • అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం
  • జుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు నగరం
  • అధికార వికేంద్రీకరణద్వారా అభివృద్ధికి యత్నాలు
  • సీఎం జగన్ మూడు రాజధానుల ఏర్పాటు కల
  • కొత్త రాజధానుల ఏర్పాటుకు కేంద్రం అనుమతి తప్పనిసరి

అమరావతి : అధికార వికేంద్రీకరణ ద్వారానే నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ దిశగా ఆయన రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే బావుంటుందనే బలమైన ఆలోచనలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ చట్టం ప్రకారం హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆగమేఘాలమీద పరుగెత్తుకొచ్చి చంద్రబాబు ఏర్పాటు చేసిన అమరావతిని తప్పించి కొత్తచోట రాజధాని ఏర్పాటు చేసే అవకాశం లేదన్న విషయం ఎటూ తేలిపోయింది కనుక ఇక ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. కేంద్రం విడుదల చేసిన కొత్త మ్యాపుల్లో కూడా అమరావతి కనిపించడంతో దీనిపై ఒక స్పష్టత వచ్చింది.

ఏపీ లో సౌతాఫ్రికా మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రేరణ

ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగానే అడుగులు వేస్తోంది. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నట్టుగా నవ్యాంధ్రకు కూడా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. కర్నూల్ ను జ్యుడిషియల్ రాజధానిగా, విశాఖను అడ్మినిస్ట్రేటివ్ రాజధానిగా చేస్తే అమరావతితో కలుపుకుని ముచ్చటగా మూడు రాజధానుల రాష్ట్రమవుతుందని ఆయన కలలు కంటున్నారు. ఆ కలలను సాకారం చేసుకోవడానికి ఉన్న అవకాశాలను గురించి ఆయన అనుక్షణం ఆలోచిస్తున్నారు. “పరిపాలన అంటే ఇలా ఉండాలి అని చేసి చూపిస్తాను” అని శపథం చేసి మరీ రాజుగారి కుర్చీలో కూర్చున్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డికి అనేక విధాలైన ఒత్తిడులను ఎదుర్కొని పరిపాలన సాగించాల్సి వస్తోంది. ముందున్న ప్రభుత్వం చేసిన అప్పులు ఒక పక్క, చేతిలో ఆదాయం లేకపోవడంతో హామీ ఇచ్చిన పథకాల అమలు మోయలేనంత బరువు మరో పక్క ఉన్నాయి. ఇన్ని ఒత్తిడులను అధిగమించి నవ్యాంధ్రప్రదేశ్ ని స్వర్ణభూమిగా మార్చాలి.

పోనీ అలా విపరీతమైన పోరాటం చేసి గట్టిగా నిలబడి రాష్ట్రాన్ని నిలబెట్టడానికైనా చాలా తక్కువ సమయమే ఉన్నట్టు చెప్పాలి. ఇప్పటికి గడిచింది కేవలం ఆరు నెలలే అయినా, సాధించాల్సిన లక్ష్యాలను బట్టి చూస్తే మిగతా నాలుగున్నరేళ్లుకూడా ఈ ప్రభుత్వానికి కత్తిమీద సామే అవుతుంది. ఆరు నెలల పాలనలో చేసిన హామీలను నిలబెట్టుకునే దిశగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రగతిపథంలో సాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్న మంచిపేరు ప్రజల్లో ఇప్పటికే వచ్చేసింది. ఏ వంకా లేకపోతే నెలవంకను చూపించమన్నట్టుగా ప్రతిపక్షాలు రకరకాల అంశాలను తెరమీదికి తీసుకొస్తూ కేవలం మంచైనా సరే, చెడైనా సరే విమర్శించడమే మా పని అన్నట్టుగా ముందుకు సాగుతున్నాయితప్ప సద్విమర్శ ఒక్కటీ కనిపించడంలేదు.

నిజానికి మూడు రాజధానుల ఏర్పాటు ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదు. అలాగని పూర్తిగా అలా జరగదనీ చెప్పలేం. ఎందుకంటే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టానికి మళ్లీ సవరణలు చేసిన తర్వాతే మరో రెండు రాజధానులను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. ఇక కర్నూలును జ్యుడిషియల్ రాజధానిగా మార్చాలన్న ఆలోచన మంచిదే అయినప్పటికీ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే విషయంలో సర్వాధికారాలు సుప్రీంకోర్టుకే ఉంటాయి. హైకోర్టుల ఏర్పాటు, తరలింపునకు సంబంధించిన పూర్తి స్థాయి విధివిధానాలన్నీ సుప్రీంకోర్టుకు సంబంధించిన వ్యవహారాలే తప్ప కేంద్రం ఇందులో జోక్యం చేసుకోదు.

సౌతాఫ్రికాలో మూడు రాజధానులు. కేప్ టౌన్ (లెజిస్లేటివ్), ప్రిటోరియా (అడ్మినిస్ట్రేటివ్), బ్లోమ్ ఫోంటీన్ (జ్యుడిషియల్) – వై.ఎస్.జగన్, ఏపీ సీఎం

జగన్ కల నెరవేరాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి. ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 2014కు సవరణ చేస్తేనే కొత్త రాజధాని ఏర్పాటునకు అవకాశం కలుగుతుంది. ఈ చట్టం కింద హైదరాబాద్ రెండు రాష్ట్రాలకూ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఏపీకి అడ్మినిస్ట్రేటివ్, జ్యుడిషియల్ కొత్త రాజధానుల విషయంలో కేంద్రం అస్సలు ఆలోచించనేలేదు. మొదట కొత్త ఇండియా మ్యాప్ లో అమరావతి కనిపించకపోవడానికి కారణం కేంద్రం ఏపీ రీ ఆర్గనైజేషన్ చట్టాన్ని పరిగణనలోకి తీసుకోవడమే. హైకోర్టుల ఏర్పాటు, తరలింపునకు సంబంధించిన విధివిధానాల విషయంలో పూర్తి అధికారాలు సుప్రీంకోర్టువే.

ఈ నేపధ్యంలో మరో రెండు కొత్త రాజధానుల్ని ఏర్పాటు చేయాలన్న తలంపు కాస్త సాహసంతో కూడుకున్న నిర్ణయమే అవుతుంది. సరే అలా కొత్త రాజధానులను ఏర్పాటు చేయడంవల్ల కలిగే లాభం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమయినప్పుడు పాజిటివ్ సమాధానమే వస్తుంది.

మొత్తంగా ఏకపక్షంగా హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేస్తూ వచ్చినందువల్ల రాష్ట్ర విభజన సందర్భంలో ఏపీకి ఎంత అన్యాయం జరిగిందో తెలియనిది కాదు. అలా మళ్లీ మళ్లీ భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే, కేవలం అభివృద్ధి ఒక్కచోట మాత్రమే నిలబడిపోకుండా ఉండాలంటే, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానుల కాన్సెప్ట్ సరైందే అవుతుంది. అలాగని మరో రెండు రాజధానులను ఏర్పాటు చేయడం వల్లే అలా అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ జరగడం సాధ్యం అనుకోవాల్సిన అవసరమూ లేదు. అమరావతిని అడ్మినిస్ట్రేషన్ కేంద్రంగా చేసుకుని మిగతా ఇతరత్రా అభివృద్ధిని రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు విస్తరింపజేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులు ఏమీ లేవు.

ప్రత్యేకంగా మరో రెండు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నిస్తే మాత్రం దానికి సంబంధించిన చట్టపరమైన విధి విధానాలను అనుసరించాల్సి ఉంటుంది. దానికి కేంద్రం అనుమతి కావాల్సి ఉంటుంది. రీ ఆర్గనైజేషన్ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.

Next Story