మూడు రాజధానుల ముచ్చటైన వ్యూహం

By Newsmeter.Network  Published on  29 Dec 2019 7:15 AM GMT
మూడు రాజధానుల ముచ్చటైన వ్యూహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రకటించగానే తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. విశాఖపట్నాన్ని పరిపాలనకోసం, అమరావతిని శాసనసభావ్యవహారాలకోసం, కర్నూలు నగరాన్ని జుడిషియరీ క్యాపిటల్ గా మార్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న విషయం తెలియగానే వివిధ రాజకీయ పార్టీలనుంచి, ప్రజలనుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యింది.

వాస్తవానికి అంచనాలను తలకిందులు చేస్తూ శుక్రవారంనాడు మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అన్నట్టుగానే మంత్రివర్గ సమావేశంలో దీని గురించి చర్చ జరిగింది. రాష్ట్రప్రభుత్వం ఈ ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటించారు.

రాష్ట్రానికి ముందే నిధుల్లేవు. కానీ గత ప్రభుత్వం రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలన్న శివరామకృష్ణన్ కమిటీ సిఫారసును బుట్ట దాఖలు చేసి అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. దాన్ని అత్యున్నతస్థాయి అంతర్జాతీయ నగరంగా మలిచేందుకు పెద్ద ఎత్తున ప్రణాళికలు రచించింది.

తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పి.ఎన్.రావ్ కమిటీ సూచించిన విధంగా ప్రత్యామ్నాయం గురించి ఆలోచన చేసింది. గత ప్రభుత్వం తలపెట్టిన అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూనే మరో ముఖ్యమైన నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనకు ప్రాణం పోసింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు చేయడమే దీని వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం పి.ఎన్.రావ్ కమిటీని అధ్యయనం కోసం మళ్లీ తెరమీదికి తీసుకొచ్చింది.

రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది

ఈ కమిటీ అధికారాన్ని వికేంద్రీకరించడం ద్వారా, మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల్ని ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పూర్తి స్థాయిలో అమరావతిని మాత్రం అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు వెనకబడిపోతాయనీ, ఇప్పటికే అమరావతి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉండడంవల్ల దానిమీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మిగతా ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందని పి.ఎన్.రావు కమిటీ తన నివేదికలో పేర్కొంది.

మొత్తంగా అమరావతిని మాత్రమే అభివృద్ధి చేయడంవల్ల రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపుగా లక్షకోట్ల రూపాయల భారం అదనంగా పడుతుందని పి.ఎన్.రావ్ కమిటీ అభిప్రాయపడింది. ఈ దశలో రాష్ట్రప్రభుత్వం అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ కు కూడా ఇదే విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా బాధ్యతను అప్పజెప్పింది. వచ్చే నెలలో ఈ సంస్థ తన నివేదికను సమర్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

పి.ఎన్.రావ్ కమిటీ నివేదికను, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికను బేరీజు వేసి సరైన అంచనాలను నివేదించడానికి, అదే విధంగా ఓ యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించింది.

చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన అమరావతి నిర్మాణాన్ని కొనసాగించడానికి, అమరావతిని అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలు ఏమిటో సామాన్యులకు ఇప్పటికీ స్పష్టంగా అర్థంకాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది.

అందరూ చంద్రబాబు బినామీలే

గత ప్రభుత్వం తలపెట్టిన అమరావతి కేవలం కొందరు వ్యక్తులకు మాత్రమే, కొన్ని రాజకీయ శక్తులకు మాత్రమే ఉపయోగం కలిగించేదిగా ఉందనీ, అమరావతిలో పూర్తిగా అందరూ చంద్రబాబు బినామీలేననీ వై.సి.పి ప్రభుత్వం వ్యక్తం చేసిన అభిప్రాయాలకుకూడా జనసామాన్యంలో అంతగా ఆదరణ లభించలేదు.

ఈ నేపధ్యంలో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలిపారు. అమరావతిని తరలించేందుకు, అభివృద్ధిని అడ్డుకునేందుకు వీలులేదంటూ తీవ్ర స్థాయిలో తమ అభ్యంతరాలను వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముచ్చటగా మూడు రాజధానుల ప్రతిపాదనపై కచ్చితమైన నిర్ణయాన్ని వెలిబుచ్చడానికి వీల్లేని పరిస్థితి స్పష్టంగా కనిపించింది.

సౌతాఫ్రికాను నమూనాగా తీసుకుని అక్కడి మూడు రాజధానుల కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకోవాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం ఉన్నపళంగా అప్పటికప్పుడు తెరమీదికి వచ్చింది కాదనే చెప్పాలి. చంద్రబాబు అమరావతి మోడల్ కి ఈ ప్రభుత్వం ముందునుంచీ వ్యతిరేకంగానే ఉందన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కొత్త ప్రభుత్వం పనిచేయడానికి అమరావతిలో వచ్చిన ఇబ్బంది ఏంటో ప్రజలకు ఏమాత్రం అర్థం కాలేదు.

ఇవన్నీ ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో అమరావతి అభివృద్ధికి రూ.500 కోట్ల నిధుల్ని కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన చాలా పనులకు రివర్స్ టెండరింగ్ పేరుతో గండి పడింది. ఆ దశలో మూడు రాజధానుల ఏర్పాటు అనే విచిత్రమైన ప్రతిపాదన తెరమీదికి వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం తాను అనుకున్న రీతిలో ముందుకెళ్లడానికి నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకుంటోందన్న వాదనలూ లేకపోలేదు.

అమరావతి గ్రాండ్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ని నిర్మించేందుకు

ప్రస్తుతానికి ఇంకా మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం ఇదమిద్ధంగా ఒక నిర్ణయానికి రాలేదు. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఛానెల్ సాక్షిలో ఈ విషయం గురించి చాలా సేపు మాట్లాడారు. అమరావతి గ్రాండ్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ని నిర్మించేందుకు పూర్తి స్థాయిలో నిధుల్ని కేటాయించడం కుదిరేపని కాదని చెప్పుకొచ్చారాయన.

అంత అనుభవం ఉన్న, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన ఘనత వహించిన చంద్రబాబు నాయుడు సంవత్సరానికి కేవలం ఆరువేల కోట్ల రూపాయలకు మించి ఏర్పాటుచేయలేకపోయారంటూ సెటైర్లు కూడా వేశారు. అలాంటప్పుడు అసలు ఐదేళ్లలో లక్ష కోట్ల రూపాయలను సమీకరించడం ఎలా సాధ్యమంటూ చంద్రబాబుని ఎత్తిపొడిచారు. అంత ఘనత వహించిన చంద్రబాబుకే ఆ పని సాధ్యంకానప్పుడు అనుభవం లేని జగన్మోహన్ రెడ్డి ఎలా సాధించగలరంటూ సున్నితంగా హాస్యస్ఫోరకమైన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజాసంక్షేమంకోసం మాత్రమే నిధులను ఖర్చుపెడుతుందనీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం మాత్రమే కృషి చేస్తుందనీ పేర్ని నాని చెప్పుకొచ్చారు. అలా ఖర్చుపెట్టాల్సిన నిధులను రాజధాని నిర్మాణం పేరుతో దుర్వినియోగం చేయాలని తాము అనుకోవడంలేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యల్నిబట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని వైజాగ్ కి, జుడిషియరీ క్యాపిటల్ ను కర్నూలుకూ తరలించాలన్న కృతనిశ్చయంతో ఉన్నారన్న విషయం అర్థమయ్యింది. ఈ నేపధ్యంలో ప్రత్యేక అధ్యయన కమిటీల ఏర్పాటు ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే యాక్షన్ ప్లాన్ ని సిద్ధం చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు కూడా తెరమీదికి వచ్చింది.

చంద్రబాబు అమరావతి నిర్మాణం కలను నెరవేరనివ్వకుండా ఏదో ఒక విధంగా అడ్డుకునేందుకు ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్న విషయం ఈ అంశాలద్వారా తేటతెల్లమవుతోందని చెప్పొచ్చు. అమరావతిలో బినామీ పేర్లతో చంద్రబాబు లాభపడే ప్రయత్నం చేశారని ఆరోపణలు చేస్తూ ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో సవిస్తరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబుకు రాజకీయంగా, వ్యక్తిగతంగా దగ్గరైనవాళ్లు పెద్ద ఎత్తున అమరావతిని రాజధానిగా ప్రకటించడానికంటే ముందే ముందస్తు వ్యూహంతో చుట్టుపక్కల భూములు కొన్నారని బుగ్గన నేరుగా ఆరోపణాస్త్రాలను సంధించారు.

జి.ఎన్.రావ్ రిపోర్ట్

అలాగే అమరావతి నిర్మాణంలో కాంట్రాక్టర్ల దోపిడీ అనే అంశంపై ఈ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు, మోపుతున్న అభియోగాలు, అనుసరిస్తున్న రీతి అన్నీ ముందస్తు వ్యూహం ప్రకారం జరుగుతున్నవే తప్ప అప్పటికప్పుడు అనాలోచితంగా చేసిన నిర్ణయాలేం కావివి అని ఘంటాపథంగా చెప్పొచ్చు. జి.ఎన్.రావ్ రిపోర్ట్ కూడా ఈ కోవలోకే వస్తుంది.

మూడు రాజధానుల కాన్సెప్ట్ ని తెరమీదికి తీసుకొచ్చి తన రాజకీయ ప్రత్యర్థులైన తెలుగుదేశం పార్టీవారిని అభద్రతలోకి నెట్టడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ విధంగా ముందుగా చంద్రబాబు అమరావతి నిర్మాణంలో తన స్వార్థం చూసుకున్నారనీ, అందులో అవినీతి బాగా జరిగిందనీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు. దానిద్వారా ప్రజల మనసులను మార్పుకోసం సంసిద్ధం చేస్తారు. కచ్చితంగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరమీదికొచ్చింది అందుకే.

మరో విషయం ఏంటంటే అమరావతి నుంచి రాజధానిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్న విషయం తెలియగానే ప్రతిపక్షం అతలాకుతలమైపోయింది. విశాఖపట్నం రియల్ ఎస్టేట్ దందాలు చేసుకునేందుకే కొత్త ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేస్తోందనీ, ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందనీ చంద్రబాబు, ఆయన అనుయాయులు దుమ్మెత్తిపోస్తున్నారు.

అందువల్లే వై.ఎస్.ఆర్.సి.పి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అనేక కమిటీలు వేసి, అనేక రిపోర్టులు తీసుకుని తను అనుకున్న ప్లాన్ మంచిదేనని ప్రజలకు అభిప్రాయం కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో చంద్రబాబుకూడా అంతర్జాతీయ కన్సల్టెన్సీలపై ఎక్కువగా ఆధారపడిన విషయంకూడా తెలిసిందే.

రాజధాని నిర్మాణంకోసం 33వేల ఎకరాలు

బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ ని తెరమీదికి తీసుకురావడం ద్వారా జగన్ చంద్రబాబుకి ఆయన భాషలోనే సమాధానం చెబుతున్నారని చెప్పొచ్చు. రాజధాని నిర్మాణంకోసం 33వేల ఎకరాలను ఇచ్చిన రైతుల మనోభావాలు దెబ్బతినకుండా తాము చేయదలచుకున్న పనిని వ్యూహాత్మంగా అంచెలంచెలుగా చేసి తీరాలన్న పట్టుదలతో ఈ ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది.

ఇక్కడి వారికి ఎలాంటి నష్టం కలగదన్న భరోసా కల్పించే రీతిలో మాట్లాడుతూ అమరావతి చుట్టుపక్కల ప్రజల అభద్రతను తొలగించే ప్రయత్నం చేస్తోందీ ప్రభుత్వం. కచ్చితంగా ఏమేరకు అమరావతిని అభివృద్ధి చేయాలో ఆ మేరకు అభివృద్ధి చేసి తీరతామన్న సందేశాన్ని బలంగా వినిపిస్తూ వస్తోంది. అయితే అనవసరమైన చోట అనవసరంగా నిధుల్ని వృథా చేయడంవల్ల ఉపయోగం ఏమాత్రం ఉండదన్న భావనను ప్రజల మనసుల్లోకి బలంగా చొప్పించే ప్రయత్నాలూ మరోవైపున చేస్తోంది.

అమరావతిని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దుతామని మునిసిపల్ శాఖ మంత్రి సత్యనారాయణ ప్రకటించారు. మరో రెండు రాజధానులను ఏర్పాటు చేయడంతోపాటుగా ఇప్పటికే ఉన్న అమరావతిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించడం చాలా ముఖ్యమని అమరావతి ప్రాంతంలో ఉన్న అధికార పార్టీ నాయకులందరూ ఏకాభిప్రాయాన్ని అధిష్ఠానం దగ్గర వ్యక్తం చేసినట్టు వినికిడి.

ఈలోగా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని తరలించడానికి ఏర్పాట్లు చాపకింద నీరులా జరిగిపోతూనే ఉన్నాయి. మూడు రాజధానులు కాన్సెప్ట్ ద్వారా టిడిపిని కోలుకోలేని దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తోందనడంలో ఏమాత్రం సందేహం లేదనే చెప్పాలి.

ఈలోగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను విశాఖపట్నానికి తరలించే ఏర్పాట్లు చాపకింద నీరులా చల్లగా సాగిపోతూనే ఉన్నాయి. టిడిపిని కోలుకోలేనివిధంగా దెబ్బకొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ వ్యూహాలను అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

విశాఖ ప్రాంతానికి చెందిన కొందరు టిడిపి నేతలు తమ పార్టీ అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా ఆశ్చర్యకరంగా విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడంపై హర్షాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఇలా త్రీ క్యాపిటల్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ ఆలస్యం చేసినకొద్దీ ప్రతిపక్షంలో ఉన్న లుకలుకలు బయటపడుతూనే ఉంటాయి. అది అధికారపార్టీకి పూర్తిగా కలసి వచ్చే అంశమే అవుతుంది.

ఈ కారణాలవల్ల ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే మూడు రాజధానుల నిర్ణయాన్ని మంత్రివర్గ సమావేశంలో ఉన్నపళంగా ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తూపోతున్నారు. అమరావతి నుంచి రాజధానిని వై.సి.పి ప్రభుత్వం తరలించడం ఖాయం. కానీ అలా పూర్తిగా తరలించే లోగా ప్రతిపక్ష పార్టీని ఎన్ని విధాలుగా దెబ్బకొట్టాలో అన్ని విధాలుగా దెబ్బకొట్టి పూర్తిగా కుదేలయ్యేలా చేయడమే ఆలస్యం వెనక ఉన్న మాస్టర్ ప్లాన్.

Next Story
Share it