15 నుంచి పూర్తి స్థాయిలో బస్సులు

By సుభాష్  Published on  13 Oct 2020 3:41 AM GMT
15 నుంచి పూర్తి స్థాయిలో బస్సులు

ఏపీలో ఈనెల 15వ తేదీ నుంచి 28 వరకు పూర్తి స్థాయిలో బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ 6రిజర్వేషన్‌ సదుపాయం కలిగిన సర్వీసులన్నింటినీ అందుబాటులో ఉంచాలని అధికారులు పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌కు ముందు తెలంగాణ, తమిళనాడు మినహా రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, బెంగళూరుకు కలిపి ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ సదుపాయం ఉన్న 2,028 సర్వీసులను నిత్యం నడిపేవారు. వాటన్నింటినీ అందుబాటులోకి తీసుకురానున్నారు. అన్ని సర్వీసుల్లో ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు పూర్తయితే ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని డీఈ బ్రహ్మనందం ఆదేశాలు జారీ చేశారు.

అయితే కరోనా తర్వాత ఏపీ-తెలంగాణ మధ్య నిలిచిపోయిన ఆర్టీసీ బస్సుల రాకపోకలను ఈ దసరా సీజన్‌ నుంచి ప్రారంభించనున్నారు. కిలోమీటర్ల విషయంలో తెలంగాణ ప్రతిపాదనలకు ఏపీ అంగీకరించిన నేపథ్యంలో మిగిలిన అంశలపై టీఎస్‌ఆర్టీసీ సడలింపు ఇస్తుందని భావిస్తున్నారు. దీంతో కీలకమైన పండగ దసరా సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు తిరిగి ప్రారంభం కానున్నాయి. పండగ సీజన్‌లో ఇరు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు వాటి స్థానంలో ప్రైవేటు బస్సులు కూడా రంగంలోకి దిగి ఆదాయం కొల్లగొట్టడమే కాకుండా ప్రయాణికులపై అధిక ఛార్జీలు మోపే అవకాశం ఉంది.

Next Story
Share it