స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌.. ఏపీలో ఏర్పాటుకానున్న‌ 25 జిల్లాలు ఇవే..?

By Newsmeter.Network  Published on  26 Dec 2019 12:59 PM GMT
స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌.. ఏపీలో ఏర్పాటుకానున్న‌ 25 జిల్లాలు ఇవే..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో స‌రికొత్త ప్ర‌తిపాద‌న ఒక‌టి తెర‌మీద‌కు వ‌చ్చింది. రాష్ట్రంలో మొత్తం 25 జిల్లాలు ఏర్పాటు కానున్నాయ‌న్న‌ది ఆ ప్ర‌తిపాద‌న సారాంశం. జిల్లాల పున‌ర్విభ‌జన చేసే ఆలోచ‌న‌లో భాగంగానే జ‌గ‌న్ స‌ర్కార్ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణ‌యాన్ని తీసుకుంద‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల భోగ‌ట్టా.

కాగా, సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తిని శాస‌న నిర్వాహ‌క‌, క‌ర్నూలును న్యాయపాల‌న, అలాగే విశాఖ‌ను కార్య‌నిర్వాహ‌క రాజ‌ధానులుగా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. జ‌గ‌న్ చేసిన ఈ ప్ర‌క‌ట‌న‌కు మేథావివ‌ర్గంతోపాటు రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌లు రాగా, ప్ర‌తిప‌క్ష పార్టీల నుంచి నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి.

మ‌రోవైపు అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లిస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో జ‌గ‌న్‌పై ఆ ప్రాంత రైతుల ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంటోంది. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేసిన నాటి నుంచి నిర‌స‌న‌లు, రిలే నిరాహార‌దీక్ష‌లు, ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌ను వారు కొన‌సాగిస్తూనే ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలుగా మార‌నున్నాయంటూ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగానే సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ‌యం తీసుకున్నార‌ని, అన్ని ప్రాంతాల స‌మానాభివృద్ధే ల‌క్ష్యంగా జ‌గ‌న్ పాల‌న కొన‌సాగిస్తూ ముందుకెళుతున్నార‌న్నారు.

నిత్యం ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ప‌ర‌మావ‌ధిగా ఆలోచించే వ్య‌క్తుల్లో సీఎం జ‌గ‌న్‌ది ప్ర‌థ‌మ స్థాన‌మ‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. జ‌గ‌న్ తీసుకున్న ఈ 25 జిల్లాల ఏర్పాటు నిర్ణ‌యం చ‌రిత్ర‌లో నిలిచిపోతుంద‌న్నారు. అందులో భాగంగానే 13 జిల్లాల‌ను కాస్తా.. 25 జిల్లాలుగా మార్చేందుకు జ‌గ‌న్ పూనుకున్నార‌న్నారు.

అయితే, జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర స‌మ‌యంలో వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఒక్కో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక్కో జిల్లా చేస్తాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదాలో నాడు ఇచ్చిన హామీ మేర‌కు సీఎంగా నేడు 25 జిల్లాల ఏర్పాటుకు సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం. ఈ మేర‌కు విజ‌య‌సాయిరెడ్డి చేసిన వ్యాఖ్య‌లు 25 జిల్లాల ఏర్పాటుకు ఖాయ‌మ‌న్న రాజ‌కీయ‌వ‌ర్గాల స‌మాచారానికి మ‌రింత బ‌లం చేకూరుస్తుంది.

రాజ‌కీయ‌వ‌ర్గాల విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు జ‌గ‌న్ స‌ర్కార్ ఇప్ప‌టికే 13 జిల్లాలను పున‌ర్విభ‌జించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేసింద‌ని, ఆ మేర‌కు కొత్త‌గా ఏర్పాటు కానున్న మ‌రో 12 జిల్లాల జాబితా ఇదేనంటూ ప‌లువురు చెప్పుకొస్తున్నారు. ఆ 12 జిల్లాల పేర్లు ఇలా ఉన్నాయి.

హిందూపురం, అన‌కాప‌ల్లి, అమ‌లాపురం, అర‌కు, న‌ర‌సాపురం, విజ‌య‌వాడ‌, తిరుప‌తి, రాజ‌మండ్రి, న‌ర‌సరావుపేట‌, బాప‌ట్ల, రాజంపేట‌, నంద్యాల‌

ఇలా 12 జిల్లాల ఏర్పాటుతోపాటు విశాఖ‌కు అనుకుని ఉండే అర‌కు, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల‌ను క‌లుపుతూ మ‌రో కొత్త జిల్లాను ఏర్పాటు చేయాల‌న్న ఆలోచ‌న‌లో సీఎం జ‌గ‌న్ ఉన్నార‌ని ఆ పార్టీ శ్రేణుల నుంచి విన‌వ‌స్తున్న స‌మాచారం. ఏదేమైనా జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై సీఎం జ‌గ‌న్ నుంచి అధికారిక‌ ప్ర‌క‌ట‌న వ‌స్తేనే అంద‌రిలోని క‌న్ఫ్యూజ‌న్ కాస్తా క్లారిటీ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story