ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని, ఈ ఎన్నికలు ఫిబ్రవరి నెలలో ఉండే అవకాశం ఉందని పురపాలక శాఖ మంత్రి బోత్స సత్యనారాయణ అన్నారు. నగరపాలక సంస్థ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆయన.. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న అంశాలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను టిడ్కో ద్వారా పూర్తి చేయాలని తెలిపారు. అలాగే కార్యదర్శుల పోస్టుల ఖాళీలపై అధికారులు దృష్టి సారించాలని సూచించారు. వచ్చే నెల నుంచి లబ్దిదారులకు ఇళ్లకే వలంటీర్లు వెళ్లి పింఛన్‌ అందించేలా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. వచ్చే నెల 3వ తేదీన ఓటర్ల జాబితాను ఆయా వార్డుల్లో విడుదల చేయాలని అన్నారు. జాబితాల్లో ఏమైన పొరపాట్లు ఉంటే రిటర్నింగ్‌ అధికారి అభ్యంతరాలను స్వీకరిస్తారన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.