ఏపీ ప్రభుత్వ లోగోని రాత్రికి రాత్రే మార్చేశారా ?

By రాణి  Published on  1 Jan 2020 11:06 AM GMT
ఏపీ ప్రభుత్వ లోగోని రాత్రికి రాత్రే మార్చేశారా ?

ఆంధ్ర ప్రదేశ్ అధికారిక చిహ్నం రాత్రికి రాత్రే మార్చేశారంటూ వాట్సాప్ లో ఒక మేసేజ్ వైరల్ అవుతోంది. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న జగన్ ప్రభుత్వం క్రైస్తవ ప్రభుత్వమని, ఇదివరకూ అధికారిక చిహ్నంలో ఉన్న పూర్ణ ఘటాన్ని తొలగించి చర్చీలలో పవిత్ర జలాలు ఉంచే పాత్రను చిహ్నంలో జోడించారంటూ ఉన్న మెసేజ్ ప్రచారం పొందుతోంది.

నిజ నిర్ధారణ :

రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత, తెలంగాణ ప్రభుత్వం, 2014లోనే రాష్ట్రనికి కొత్త చిహ్నాన్ని ఏర్పాటు చేసింది, కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నవంబర్ 2018 వరకూ సమిష్టి ఆంధ్ర రాష్ట్ర చిహ్నాన్నే వాడింది. నవంబర్ 2018 లో, రాష్ట్ర రాజధాని అమరావతి అయినందున, అమరావతి శిల్ప కళ స్ఫూర్తితో కొత్త చిహ్నాన్ని తీర్చిదిద్దారు. ఇందులో చుట్టూ త్రిరత్నాలు, మధ్యన అందంగా ఉన్న ఆకులు, రత్నాలతో అలంకరించిన ధమ్మ చక్క (ధర్మ చక్రం) ఉంటుంది. క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో ధాన్య కటక మహా చైత్యానికి విధికుడు అనే చర్మకారుడు బహూకరించిన పున్న పూర్ణఘటం చిహ్నం మధ్యలో ఉంటుంది. పూర్ణఘటం చుట్టూ ఉన్న మూడు వృత్తాలు వరుసగా 48, 118, 148 ముత్యాలతో అలంకరించి ఉంటాయి. పూర్ణఘటం కింద జాతీయ చిహ్నమైన అశోక స్తంభం పై నాలుగు సింహాల బొమ్మ ఉంటుంది.

Fact Check 1

https://telugu.samayam.com/latest-news/state-news/andhra-pradesh-government-gets-a-new-official-state-emblem-with-dhamma-chakka/articleshow/66630046.cms

https://www.ndtv.com/andhra-pradesh-news/andhra-pradesh-gets-a-state-emblem-with-dhamma-chakka-1947646

https://m.ap7am.com/lv-302202-ap-govt-new-logo-andhra-pradesh-state-emblem-2018.html

పాత చిహ్నంలో 'ఆంధ్రప్రదేశ్' అనే పేరు పై భాగంలో ఇంగ్లీష్‌లో.. కింద తెలుగు, హిందీ భాషల్లో ఉంటుంది. కొత్త చిహ్నంలో మాత్రం పైన తెలుగులో.. కింద హిందీ, ఆంగ్ల భాషల్లో ఉంటుంది. పాత చిహ్నంలో కింది భాగంలో ఉన్న ‘సత్యమేవ జయతే’ అన్న వాక్యం హిందీలో ఉండగా.. దాన్ని ఇప్పుడు తెలుగులోకి మార్చారు. ఇక పాత చిహ్నంలో ఉన్న మాదిరిగానే.. పూర్ణ కుంభం మధ్యలో ఉంది. దాని కింద నాలుగు సింహాలు ఉన్నాయి. వీటితోపాటు ఇతర స్వల్ప మార్పులతో కొత్త లోగోను రూపొందించారు.

పాత చిహ్నంలో ఉన్న పూర్ణ కుంభానికి కొత్త చిహ్నంలో ఉన్న పూర్ణకుంభం విభిన్నంగా ఉన్నప్పటికీ అదికూడా పూర్ణ కుంభమే. ఇది చర్చీలలో పవిత్ర జలాన్ని ఉంచే కుండ కాదు. చిహ్నంలో మార్పులు జరిగిన మాట నిజమే అయినా, అది జరిగి సంవత్సరం దాటి పోయింది. 2018వ సంవత్సరం నవంబర్ లో దీనిని మార్చారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది మే 30, 2019 రోజున. అయితే, చిహ్నంలో ఈ మార్పులు జరిగింది చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగు దేశం పార్టి హయాంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, రాత్రికి రాత్రే అధికారిక చిహ్నంలో మార్పులు జరిగాయి అన్న ప్రచారం అబద్ధం. క్రితం సంవత్సరమే ఈ మార్పు జరిగింది. పాత వార్తను తీసుకొని మతపరమైన విద్వేషాలు సృష్టించడానికి అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయి.

Next Story