14 రోజులు ఏపీ లాక్ డౌన్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 March 2020 3:24 PM GMT
14 రోజులు ఏపీ లాక్ డౌన్

కరోనా వైరస్ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ మొత్తాన్ని 14 రోజుల పాటు లాక్ డౌన్ చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..14 రోజుల పాటు రాష్ట్రాన్నిలాక్ డౌన్ చేస్తున్న సందర్భంగా తెల్లరేషన్ కార్డు దారులకు ఫ్రీ రేషన్ బియ్యంతో పాటు కిలో కందిపప్పును ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఏప్రిల్ నాల్గవ తేదీన రూ.1000 నిత్యావసర సరుకులు ఇవ్వనున్నట్లు జగన్ వెల్లడించారు.

సరిహద్దులు మూసివేత, ట్రాన్స్ పోర్ట్ బంద్

కరోనాను కట్టడి చేసేందుకు ఒక్కరోజు జనతా కర్ఫ్యూ పాటిస్తే సరిపోదని జగన్ అభిప్రాయపడ్డారు. అలాగే ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ లాక్ డౌన్ తో పాటు..రాష్ట్ర సరిహద్దులన్నింటినీ మూసివేస్తున్నట్లుగా ప్రకటించారు. నిత్యావసర వస్తువులు (పాలు, కూరగాయలు, అక్కడక్కడా జనరల్ స్టోర్లు, మెడిసిన్) మినహా అన్ని దుకాణాలను మూసివేయాల్సిందిగా ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చిన వారు తక్షణమే వైద్యులకు సమాచారం ఇవ్వాలని కోరారు. 14 రోజులపాటు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.

గోడౌన్లు, కార్యాలయాలు, ఫ్యాక్టరీలన్నీ పరిమిత సిబ్బందితో నడపాలని సీఎం జగన్ ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప..మిగతా సమయాల్లో ప్రజలు బయటికి రాకూడదని సూచించారు. వీలైనంత వరకూ ఇళ్లకే పరిమితమవ్వాలని తెలిపారు. ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిని పోలీసులు గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.

ధరలు పెంచితే కఠిన చర్యలు

రాష్ట్రంలో నిత్యావసర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జగన్ హెచ్చరించారు. ఏఏ వస్తువులు ఏయే ధరలకు విక్రయించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు.

ప్రజల అవసరాలను దళారులు ఆసరా చేసుకుంటే వారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తామన్నారు. అలాగే రోజువారి కార్మికులు కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బయట తిరగరాదని సూచించారు. ఏపీలో ఇప్పటి వరకూ 6 కరోనా కేసులు నమోదవ్వగా..నెల్లూరులో గుర్తించిన తొలి కరోనా బాధితుడు కోలుకున్నాడని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ సుభిక్షంగానే ఉందన్నారు. అయినప్పటికీ స్వీయ నిర్భంధాన్ని పాటించడం ద్వారా కరోనా వైరస్ ను ప్రబలకుండా ఆపగలమని తెలిపారు. కాగా..తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Next Story