మ‌రోమారు మద్యం ధరలు పెంచిన ఏపీ ప్ర‌భుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 May 2020 10:51 AM GMT
మ‌రోమారు మద్యం ధరలు పెంచిన ఏపీ ప్ర‌భుత్వం

ఏపీ ప్రభుత్వం మందుబాబులకు మ‌రోమారు షాక్ ఇచ్చింది. సోమ‌వారం నాడు 25 శాతం పెంచిన ధరలతో మ‌ద్యం అమ్మకాలు ప్రారంభించింన ఏపీ ప్ర‌భుత్వం.. ఒక్క రోజు వ్యవధిలోనే మరోసారి మద్యం ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మద్యం ధ‌ర‌లు 50 శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది. పెరిగిన మ‌ద్యం ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చేలా చర్యలు చేపట్టింది. దీంతో ఏపీలో నేడు గంట ఆలస్యంగా మ‌ద్యం అమ్మకాలు ప్రారంభమ‌య్యాయి.

పెరిగిన ధ‌ర‌ల ప్ర‌కారం.. రూ. 120 ఉన్న‌ బ్రాండ్ మద్యంపై క్వార్టర్ కు రూ. 40 పెంచ‌గా.. హాఫ్ బాటిల్‌పై రూ. 80, ఫుల్ బాటిల్ పై రూ. 160 పెంచింది. అలాగే.. రూ. 120-150 ధరలు ఉన్న మద్యంపై క్వార్టర్‌కు రూ. 60, హాఫ్ పై రూ. 120, ఫుల్ పై రూ. 320 పెంచింది. ఇక‌ రూ.150 కంటే ఎక్కువ ఉన్న మద్యం బ్రాండ్స్ పై క్వార్టర్ పై రూ.120, హాఫ్ పై రూ. 240 ఫుల్ పై రూ. 480 పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఇక‌పోతే.. మినీ బీర్లపై రూ.40, బీర్ బాటిల్ పై రూ. 60 పెంచుతూ ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌భుత్వం అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ టాక్స్ పేరిట మద్యం ధరలు పెంచుతూ జీవో జారీ చేసింది.

ఇదిలావుంటే.. ఏపీలో లాక్‌డౌన్ నిబంధనలు సవరించడంతో సోమవారం మద్యం దుకాణాలు తెరిచారు. దీంతో మందుబాబులు వైన్ షాపుల ముందు బారులు తీరారు. భౌతిక దూరం పాటించకుండా తోసుకుంటూ లాక్‌డౌన్ నిబంధ‌న‌లు గాలికి వ‌దిలేశారు. ప‌రిస్థితిని సమీక్షించిన సీఎం జగన్.. మరోమారు మద్యం ధరలు పెంచుతూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీపున్నారు. దీంతో ఏపీలో రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌ద్యం ధ‌ర‌లు 75 శాతం పెరిగాయి.

Next Story
Share it