ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రే న్యాయ కార్యాలయాలను కర్నూల్ కు తరలిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. అర్థరాత్రి సంచలన ప్రకటనతో ఏపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణను అధికారికంగా మొదలుపెట్టింది. ఏపీ పాక్షిక న్యాయవిభాగమైన విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ చైర్మన్ సభ్యులకు సంబంధించిన కారయాలయాలను తరలిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ ఈ రెండు కార్యాలయాలు వెలగపూడిలోని సచివాలయంలో ఉన్నాయి. ప్రభుత్వ కీలక నిర్ణయంతో ఇప్పుడివి కర్నూల్ కు వెళ్లిపోతున్నాయి. ఈ మేరకు అవసరమైన భవంతులను ఏర్పాటు చేయాలని ఆదేశిస్తూ కర్నూల్ కలెక్టర్ కు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

కాగా..హైకోర్టు అనుమతి లేనిదే ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని అమరావతి నుంచి తరలించరాదని గతంలో హెచ్చరించినప్పటికీ..ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. పాలనా సౌలభ్యం కోసమంటూ..కార్యాలయాలను తరలిస్తూ నిర్ణయం ప్రకటించింది. కాగా..జ్యుడిషియల్ క్యాపిటల్ గా కర్నూల్ ను చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించగా…అర్థరాత్రి తీసుకున్న సంచలన నిర్ణయం అది ఆచరణలోకి వస్తుంది.

జగన్ కు దమ్ముంటే…అంతా మెలకువగా ఉన్నప్పుడు ప్రకటన చేయాలి గాని…ఎవరూ లేనప్పుడు ఇలా కార్యాలయాలను తరలిస్తూ నిర్ణయం తీసుకోవడమేమిటని రాజధాని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అసెంబ్లీలో రాజధానుల ప్రకటన కూడా ఆఖరి రోజు ఆఖరి నిమిషంలో చేసి ఎవరికీ కనిపించకుండా సీఎం జగన్ దొంగలా పారిపోయాడని విమర్శిస్తున్నారు. జగన్ పిరికివాడు కాబట్టే అర్థరాత్రి ప్రకటన చేశాడని దుయ్యబడుతున్నారు. ధైర్యం, నిజాయితీ గల నాయకుడైతే ప్రజల మధ్యలో ఉండి..తన నిర్ణయాలను చెప్పాలంటున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.