చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎంలు లేఖాస్త్రం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 1:41 PM GMT
చంద్రబాబుపై ఏపీ డిప్యూటీ సీఎంలు లేఖాస్త్రం

అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏపీ డిప్యూటీ సీఎంలు ఘాటు లేఖ రాశారు. చంద్రబాబు రాసిన లేఖను బహిరంగ లేఖా, బరి తెగింపు లేఖ అంటూ మండిపడ్డారు.రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు కనీవినీ ఎరుగని విధంగా 1.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను , అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలు కూడా కకముందే భర్తీ చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి మీకెందుకండీ అక్కసు అంటూ మండిపడ్డారు.

మీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. గ్రామ సచివాలయ ఆలోచనలు మీకెందుకు రాలేదని చంద్రబాబును ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో అక్కడి యువతకు 1- ఉద్యోగాలు వస్తుంటే ఇక మీరు కాలగర్భంలో కలిసిపోతారనే అభాండాలె వేస్తారా? అంటూ మండిపడ్డారు.

చెత్త వార్తలు, కట్టు కథలు మీ కోసం రాసే మీ తాబేదారు పత్రికలో..గ్రామ సచివాలయాల్లో నియామకాల మీద అబద్దాలు రాయించి..దానికి ఫాలో అప్‌గా మీరే బహిరంగ లేఖలు రాస్తారా? అంటూ డిప్యూటీ సీఎంలు నిప్పులు చెరిగారు.

రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని చదివించిన సగటు కుటుంబాల వారంతా...బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ..పేద, మధ్య తరగతి వారి జీవితాల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగాలు వెలుగులు నింపుతాయని లేఖలో డిప్యూటీ సీఎంలు పేర్కొన్నారు. గ్రామ సచివాలయ పరీక్షల్లో ఏ కేటగిరిని చూసినా బలహీన వర్గాల వారు అగ్రస్థానంలో ఉన్నారన్నారు. ఇది మీరు తట్టుకోలేక పోతున్నారా అని బాబును లేఖలో డిప్యూటీ సీఎంలు ప్రశ్నించారు.

గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన వారంతా..మీ కుమారుడి మాదిరిగా అత్తెసరు చదువు చదుకున్నవారు కాదని లేఖలో బాబుకు డిప్యూటీ సీఎంలు చురకలంటించారు. విదేశీ విద్య కోసం వేరే వారితో లక్షల రూపాయల డొనేషన్లు కట్టించినా..ప్రయోజనంలేని చదువు చదువుకున్నవారు కాదన్నారు. గ్రామ సచివాలయాలకు ఎంపికైంది మంచి చదువులు చదివినా కష్టజీవులన్నారు.

కొత్తగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల వారికి, ఇతర సామాజిక వర్గాల వారికి వారి గ్రామాల్లోనే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్న సమయంలో మీరు ఆనంద పడతారని 40 ఏళ్లుగా మీ బుద్ధి తెలిసిన వారు ఎవరైనా అనుకుంటారా అంటూ డిప్యూటీ సీఎంలు బాబుపై మండిపడ్డారు.

ప్రభుత్వ నిర్వహణ ఎంతో క్లిష్టతరం..సవాళ్లతో కూడిన పని అంటూ మీ అపార అనుభవానికి మీరే భుజాలు చరచుకుంటున్నారు. దోపిడీలో, వెన్నుపోట్లలో, కులపిచ్చిలొ మీకున్న అనుభవం..సమాజాన్ని చీల్చ,డంలో మీకున్న అనుభవం..పచ్చి అబద్ధాలు ఆడటంలో మీకున్న అనుభవం మాకెందుకు అంటూ లేఖలో డిప్యూటీ సీఎంలు అక్షర మంటలు మండించారు.

మీ పరిపాలన అనుభవం ఎంత అందహీనంగా ఉందో ప్రజలకు అర్ధమయింది. కాబట్టి మిమ్మల్ని 23 సీట్లతో కర్రుకాల్చి వాత పెట్టారు. కుక్క తోక వంకరే అన్న పద్ధతిలో మీరు పోవడం బాధకరమన్నారు డిప్యూటీ సీఎంలు. ఏపీపీఎస్సీని అత్యున్నతస్థాయిలో గబ్బు పట్టించిన మీరు దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చంద్రబాబుకు డిప్యూటీ సీఎంలు సూచించారు.

Next Story