ముఖ్యాంశాలు

  • ఢిల్లీలో వారం రోజులుగా ఇద్దరు డాక్టర్ల మిస్సింగ్
  • మిస్సింగ్ డాక్టర్ల కుటుంబాల ఆందోళన
  • డా. హిమబిందు, డా.దిలీప్ మిస్సింగ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన హిమబిందు భర్త సుధీర్
  • డా. సుధీర్ ఎయిమ్స్ లో రెసిడెంట్ డాక్టర్
  • పరీక్ష కౌన్సిలింగ్ కోసం పాండిచ్చేరీ వెళ్లిన దిలీప్
  • చండీఘడ్ కి తిరిగివెళ్తూ ఢిల్లీ వచ్చిన దిలీప్
  • సుధీర్ ఇంట్లో కొంతసేపు విశ్రాంతికోసం ఆగిన దిలీప్

డాక్టర్ హిమబిందు ఢిల్లీలో నివాసం ఉంటున్న ఏపీ డాక్టర్. డాక్టర్ దిలీప్ సత్య ఢిల్లీలో నివాసం ఉంటున్న చండీఘడ్ డాక్టర్. వారం రోజులుగా ఇద్దరూ కనిపించకుండా పోయారు. కారణాలు తెలియరాలేదు. వాళ్ల కుటుంబాలు ఢిల్లీలో వాళ్లకోసం తిరగని ప్రదేశం లేదు. అనుమానాస్పద స్థితిలో ఈ ఇద్దరు డాక్టర్లూ డిసెంబర్ 25వ తేదీనుంచి మాయమయ్యారు.

డిసెంబర్ 25వ తేదీన హిమబిందు ప్రాణ స్నేహితుడు దిలీప్ సత్య జెఐపిఎమ్ఇఆర్ పరీక్ష కౌన్సిలింగ్ కోసం పాండిచ్చేరీ వెళ్లి తిరిగి చండీఘడ్ వెళ్లే సమయంలో కొంతసేపు ఢిల్లీలో గడిపాడు. ఆ సమయంలో ఎయిమ్స్ లో డ్యూటీలో ఉన్న డాక్టర్ సుధీర్ డాక్టర్ హిమబిందు ఇంట్లోనే ఉందని, కొంచెంసేపు ఇంటికివెళ్లి విశ్రాంతి తీసుకోమని దిలీప్ కి చెప్పాడు. కొంచెం సేపటి తర్వాత డాక్టర్ హిమబిందు సుధీర్ కి ఫోన్ చేసి తను దిలీప్ తో పాటు కలసి దగ్గర్లో ఉన్న చర్చ్ కి వెళ్లొస్తానని చెప్పింది.

ఇద్దరూ కనిపించడంలేదని ఫిర్యాదు

ఆ రోజున మధ్యాహ్నంనుంచీ ఇద్దరు డాక్టర్ల జాడ తెలియలేదు. డాక్టర్ సుధీర్ తన భార్య హిమబిందు ఫోన్ కి చాలాసార్లు ఫోన్ చేసినా సమాధానం రావడంలేదు. వెంటనే కంగారుగా సుధీర్ దగ్గర్లో ఉన్న చర్చ్ లన్నింటికీ వెళ్లి వెతికి చూశాడు. ప్రయోజనం కనిపించకపోవడంతో వెంటనే తను దగ్గర్లోని పోలీస్టేషన్ కి వెళ్లి ఇద్దరూ కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడు.

నేరుగా పోలీస్టేషన్ నుంచి ఇంటికెళ్లిన సుధీర్ ఇటు హిమబిందు బంధువులకు అటు దిలీప్ బంధువులకు, తన బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. హుటాహుటిన అందరూ వాళ్లను వెకతడంలో సుధీర్ కి సాయం చేసేందుకు ఢిల్లీకి చేరుకున్నారు.

పోలీసులు సుధీర్ బుక్ చేసిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ని విచారించారు. తను పికప్ లొకేషన్ కి వెళ్లాననీ, సుధీర్ అక్కడికి రాకపోవడంతో తన మానాన తాను వెనుతిరిగి వెళ్లిపోయాననీ ఆ డ్రైవర్ చెప్పాడు. ఇద్దరినీ వెతికేందుకు అన్ని ప్రయత్నాలూ చేసి ప్రయోజనం లేక విసిగిపోయిన కుటుంబసభ్యులు వాళ్లిద్దరికీ ఏదైనా జరిగిందేమోనని భయపడుతున్నారు.

వాళ్లిద్దర్నీ ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారేమోనని, బహుశా డబ్బుకోసం డిమాండ్ చేసి, వాళ్ల దగ్గర డబ్బు లేకపోవడంతో ప్రాణాలు తీసేసి ఉంటారేమోనని కుటుంబసభ్యులు భయపడుతున్నారు. వాళ్లిద్దరూ ఇంకెక్కడికైనా వెళ్లి ఉంటారనుకోవడానికి ఇద్దరి దగ్గరా డబ్బుకూడా లేదని సుధీర్ చెబుతున్నాడు.

డాక్టర్ హిమబిందుది పొద్దుటూరు. ఎయిమ్స్ లో రెసిడెంట్ డాక్టర్ గా పనిచేస్తున్న సుధీర్ ది నెల్లూరు. దిలీప్ సత్య హిందూపూర్ కి చెందినవాడు.ప్రస్తుతం తను చండీఘడ్ లో తన భార్య దివ్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. పాండిచ్చేరీలో పరీక్ష కౌన్సిలింగ్ కి హాజరయ్యేందుకు వెళ్లి తిరిగి చండీఘడ్ కి వెళ్లిపోతూ మధ్యలో తన మిత్రుడు సుధీర్ ఇంట్లో కొద్దిసేపు ఆగాడు.

హిమబిందు ఆమె భర్త సుధీర్ ఢిల్లీలో ఆరేళ్లుగా నివసిస్తున్నారు. త్వరలోనే తమ సొంతగూటికి చేరుకోవాలన్న ఆలోచనతో దానికి తగిన ఏర్పాట్లుకూడా చేసుకుంటున్నారు. దాదాపుగా పన్నెండేళ్లుగా వీళ్లిద్దరికీ దిలీప్ తో స్నేహం ఉంది. వీళ్లద్దరూ పెళ్లి చేసుకోవడానికి దిలీప్ సహాయం చేశాడని సుధీర్ చెబుతున్నాడు.

అనేక విధాలైన ప్రయత్నాలు చేసిన తర్వాత ఏదారీ కనిపించక వారి కుటుంబసభ్యులు మీడియాను ఆశ్రయించారు. ఈ వార్త దేశంలో అన్నివైపులా పాకితే కనీసం తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో అన్న విషయాన్నైనా, వాళ్లకు ఏమయ్యిందో అన్న విషయాన్నైనా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నది వాళ్ల భావన.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.