''ఏపీ దిశ యాక్ట్''కు మంత్రివర్గ ఆమోదం

By రాణి  Published on  11 Dec 2019 12:27 PM GMT
ఏపీ దిశ యాక్ట్కు మంత్రివర్గ ఆమోదం

ఏపీలో మహిళల భద్రత కోసం రూపొందించిన ఏపీ క్రిమినల్ లా (సవరణ) బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం సాయంత్రం రాష్ర్ట మంత్రి వర్గంతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ర్టంలో మహిళల భద్రత కోసం చేసిన ఏపీ క్రిమినల్ లా (సవరణ) గురించి చర్చించి, దానికి ఆమోదం తెలిపారు. రాష్ర్టంలో ఏ ఆడపిల్లపై అయినా, మహిళలపై అయినా అఘాయిత్యాలు జరిగితే 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, 21 రోజుల్లో నేరం రుజువైతే తీర్పు ఇచ్చేలా కొత్త చట్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ చట్టానికి ''ఏపీ దిశ యాక్ట్'' గా నామకరణం చేశారు. ఇకపై అత్యాచార కేసులకు సంబంధించిన విచారణ జరిపేందుకు ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. యాసిడ్ దాడులు, అత్యాచారం కేసులు, సోషల్ మీడియాలో మహిళలను కించపరచడం వంటివి ''ఏపీ దిశ యాక్ట్'' కేసుల కింద నమోదు చేయబడుతాయని తెలిపారు.

గత నెల 27వ తేదీన తెలంగాణలో జరిగిన దిశ హత్యోదంతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చాలా మంది అత్యాచార బాధితులు తమకు న్యాయం చేయాలని మీడియాలో, సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తులు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళల భద్రత కోసం ''ఏపీ దిశ యాక్ట్'' చట్టాన్ని తీసుకొచ్చారు. సోషల్ మీడియాలో మొదటిసారి తప్పుగా పోస్టింగ్ పెడితో రెండేళ్ల పాటు జైలు శిక్ష, రెండోసారి పెడితే నాలుగేళ్లు జైలు శిక్ష, చిన్నారులను లైంగికంగా వేధిస్తే ఏడేళ్లు జైలు శిక్ష, అత్యాచారానికి పాల్పడితే ఉరి శిక్ష అమలు చేస్తామని జగన్ పేర్కొన్నారు.

Next Story
Share it