ముగిసిన వైసీపీ ఎమ్మెల్యేల భేటీ

By రాణి  Published on  26 Dec 2019 1:48 PM GMT
ముగిసిన వైసీపీ ఎమ్మెల్యేల భేటీ

ముఖ్యాంశాలు

  • అమరావతిలో యుద్ధ వాతావరణం..
  • జగన్ ప్రజలను అణచివేస్తున్నారని యనమల ఆరోపణ
  • రాష్ర్టం పోలీసు రాజ్యంగా మారింది

ఏపీ రాజధాని తరలింపు ప్రకటన తర్వాత మొదటిసారిగా రాజధాని ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజధాని తరలింపుపై వ్యతిరేకత, రేపు జరగనున్న కేబినెట్ భేటీలో ఏం చర్చ జరుగుతుందన్న దానిపై ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడారు. భేటీ ముగిసిన అనతరం ఎమ్మెల్యే పార్థ సారథి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉన్నారని ఆయన తెలిపారు.

రాజధానికి రూ.లక్ష 10 వేల కోట్లు కావాలని చెప్పినట్లు పార్థసారథి వెల్లడించారు. అలాగే అమరావతిలో చంద్రబాబు చెప్పినట్లు గ్రాఫిక్స్ అభివృద్ధి కాకుండా రైతులు, కూలీలు సంతృప్తి చెందేలా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. అలాగే రాజధానిపై పెట్టుబడిని తగ్గించి ఇరిగేషన్ ప్రాజెక్టులు, విద్యాభివృద్ధి, మౌలిక వసతులకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ర్టానికి ఎలాంటి పరిశ్రమలను తీసుకొస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందోనని జగన్ సర్కార్ ఆలోచిస్తుందన్నారు. ఏదేమైనా రైతులను సంతోషపెట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పార్థసారథి భరోసా ఇచ్చారు.

మరోవైపు తాడేపల్లిలో వైసీపీ ఎమ్మెల్యేల భేటీ, కేబినేట్ మీటింగ్ లపై టీడీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కేబినెట్ భేటీ పేరుతో 29 గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ర్టాన్ని పోలీస్ రాజ్యంగా, అమరావతిని పోలీస్ మయంగా మార్చారని దుయ్యబట్టారు. వేలాది మంది పోలీసులను నెల్లూరు, ప్రకాశం, సీమ జిల్లాలనుంచి తీసుకొచ్చి, భూములిచ్చిన రైతులను దొంగలుగా చూస్తారా అంటూ ఆవేదన చెందారు. తనకు ఓట్లు వేసి గెలిపించిన వారినే జగన్ తొక్కుకుంటూ వెళ్తున్నారని విమర్శించారు. జగన్ పనితీరును ప్రజలు ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారని, అందుకే అణచివేతతో అధికారం చలాయిస్తున్నారన్నారు.

Next Story
Share it