ఏపీ రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. రాజధాని ఎక్కుడ ఉండాలని నిర్ణయించే హక్కు, అధికారం రాష్ర్ట ప్రభుత్వానికి ఉంటుందని కేంద్రం స్పష్టం చేశారు. రాష్ర్ట పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది.

మంగళవారం లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖిత రూపంలో సమాధానమిచ్చారు. ‘‘ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ అప్పటి ప్రభుత్వం కేంద్రానికి నోటిఫై చేసింది. 2015 ఏప్రిల్ 23వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఏపీకి మూడు రాజధానులు ఉండాలని అనుకుంటున్న విషయం మాకు మీడియా ద్వారానే తెలిసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫై లెటర్ రాలేదు. రాష్ర్ట పరిధిలో రాజధానిని ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది.’’ అని నిత్యానందరాయ్ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. దీనిని బట్టి ఏపీ రాజధాని అమరావతేనని లోక్ సభ నిర్థారించినట్లుగా తెలుస్తోంది.

ఏపీ మూడు రాజధానుల ప్రతిపాదనకు తాత్కాలికంగా చెక్ పెట్టినట్లే అనిపిస్తోంది. ఎంపీ గల్లా జయదేవ్ రాజధాని రైతుల ఆందోళనను లోక్ సభ దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళనలు చేస్తున్న రైతులపై రాష్ర్ట ప్రభుత్వం చేసిన దాష్టీకాన్ని ఆయన వివరించారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి రాష్ర్టంలో శాంతి, భద్రతలు కరువయ్యాయి. రైతన్న ఒక్కపూట కూడా ప్రశాంతంగా తిండి తిని నిద్రపోయిన దాఖలాలు లేవు. ఇంత ఆందోళన జరుగుతున్నా ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని సర్వత్రా విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రాజధాని రైతులతో చర్చించి, వారి సమస్యలను వినేందుకు సీఎం జగన్ సుముఖత చూపారు. సీఎం జగన్ ను కలిసిన రైతులు తమ సమస్యలను జగన్ వద్ద ఏకరవు పెట్టారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.