యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న అమరావతి..!

By రాణి  Published on  27 Dec 2019 5:40 AM GMT
యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న అమరావతి..!

ముఖ్యాంశాలు

  • మొదలైన ఏపీ కేబినెట్ భేటీ
  • జీఎన్ రావు కమిటీపై చర్చ
  • కన్నా మౌన దీక్ష
  • గొల్లపూడి, తుళ్లూరు, నిడమర్రులో పరిస్థితి ఉద్రిక్తం

వెలగపూడిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ మొదలైంది. జగన్ సహా రాష్ర్ట మంత్రులంతా ఈ భేటీకి హాజరయ్యారు. ఏపీ కేపిటల్ గా ఏ ప్రాంతాన్ని ఎంచుకోవాలి? రాష్ర్టంలో ఏఏ ప్రాంతాల్లో ఏ అభివృద్ధి జరగాలి ? ఎక్కడ ఏ సంస్థలను ఏర్పాటు చేయాలి ? జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై, తదితర అంశాలపై ఈ కేబినెట్ భేటీలో సీఎం జగన్ మంత్రులతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. అక్కడ రెండ్రోజులుగా ఇదే పరిస్థితి. బయటి వ్యక్తులను సచివాలయం వైపు అనుమతించడం లేదు. శుక్రవారం కేబినెట్ భేటీ జరుగుతున్న నేపథ్యంలో 5 జిల్లాల్లో వందలాది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే 144 సెక్షన్ విధించకుండానే విధించినట్లుగా ఉంది ఇక్కడి పరిస్థితి.

ఉద్యోగులను సైతం సచివాలయం వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వాహనాలు వెళ్లేందుకు వీలు లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. కనీసం నడిచే వీలు కూడా లేకుండా అమరావతి ప్రాంతంలోని రోడ్లకు అడ్డంగా ఇనుప కంచెలను పరిచారు. ఇదేమిటని ప్రశ్నిస్తున్న ఉద్యోగులకు, ప్రజలకు పోలీసులు కనీసం నోరు తెరిచి సమాధానం కూడా ఇవ్వడం లేదు. ఏమైనా అంటే కేబినెట్ భేటీ జరుగుతుంది. వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదని ఖరాకండిగా చెప్తున్నారు. ఒక వ్యక్తి నెత్తి, నోరు బాదుకున్నా దారి వదల్లేదు. మరోవైపు రాజధాని ప్రజలు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. సీఎం జగన్ కు దమ్ముంటే ఎలాంటి పోలీస్ పహారా లేకుండా వెళ్లాలని సవాల్ చేశారు. ఇటువైపు భద్రత లేకుండా వస్తే ప్రజలు కొడతారని భయమేసి ఇలా కట్టుదిట్టమైన భద్రతల నడుమ కేబినెట్ భేటీ పెట్టారని దుమ్మెత్తిపోస్తున్నారు.

గొల్లపూడి, తుళ్లూరు, నిడమర్రులో పరిస్థితి ఉద్రిక్తం

మరోవైపు గొల్లపూడిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలో రాజధానిని మార్చవద్దంటూ గొల్లపూడి నుంచి దుర్గగుడి వరకూ భారీ సంఖ్యలో రైతులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకు, రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో రైతులు ధర్నాకు దిగారు. తుళ్లూరులో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజధానిని తరలించవద్దంటూ చేస్తున్న నిరసనలు నేడు మిన్నంటుతున్నాయి. స్థానికంగా ఉన్న బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే విజయవాడ సూర్యారావు పేటలో ఉన్న మంత్రి బొత్స నివాసాన్ని కొంతమంది ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని, స్టేషన్ కు తరలించారు. నిడమర్రులో కూడా దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. రాజధానిని తరలిస్తే అమరావతి కోసం భూములు త్యాగం చేసిన 29 గ్రామాల రైతుల భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. రహదారులపై బైఠాయించి భూములిచ్చిన వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా కళాశాల బంద్ చేయకపోవడంతో ఎస్ఆర్ఎమ్ వర్సిటీ బస్సు అద్దాలను పగులగొట్టారు.

బీజేపీ మౌన దీక్ష

రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ గంటసేపు మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి పవిత్రమైన నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి నమస్కరించి ఆయన దీక్ష చేపట్టారు. లక్ష్మీనారాయణకు మద్దతుగా పలువురు పార్టీ నేతలు, రైతులు దీక్షలో పాల్గొన్నారు.

Next Story
Share it